Tuesday, November 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవెల్ఫేర్‌ బోర్డే సంక్షేమ పథకాలు అందించాలి

వెల్ఫేర్‌ బోర్డే సంక్షేమ పథకాలు అందించాలి

- Advertisement -

సీఎస్‌జీ హెల్త్‌ టెస్టులను రద్దు చేయాలి
ప్రయివేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు స్కీమ్‌లు అప్పగించొద్దు
జీవో 12ను వెంటనే సవరించాలి
నవంబర్‌ 10న కార్మిక సంఘాల
రౌండ్‌ టేబుల్‌ : భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

భవన, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచే నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వ పథకాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది. సీఎస్‌సీ ద్వారా హెల్త్‌ టెస్టులను చేయించడాన్ని రద్దు చేయాలని కోరింది. సంక్షేమ పథకాల నిర్వహణను ప్రయివేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పగించేలా తీసుకొచ్చే జీవో 12ను వెంటనే సవరించాలని డిమాండ్‌ చేసింది. కార్మికులు సహజంగా చనిపోతే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను బోర్డు ద్వారా అందించాలని విజ్ఞప్తి చేసింది. నవంబర్‌ 10న కార్మిక సంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. సోమవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో దేవేందర్‌రెడ్డి(ఏఐటీయూసీ) అధ్యక్షతన జేఏసీ సమావేశం జరిగింది. అందులో వంగూరు రాములు (సీఐటీయూ), హన్మేశ్‌, సాంబశివుడు(టీయూసీఐ), అనురాధ, యాదన్న(ఐఎఫ్‌టీయూ), ఐలన్న (బీఎన్‌ఆర్‌కేఎస్‌), కుమార్‌, చంద్రమౌళి(స్ఫూర్తి కార్మిక సంఘం), జేఏసీ నాయకులు రాజు, రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు. జేఏసీ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ.. సహజ, ప్రమాదవశాత్తు మరణాలకు పరిహారం, శాశ్వత, పాక్షిక అంగవైకల్యం కలిగే వారికి ఆర్థిక సహాయం అందించే పథకాలను ప్రయివేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పగించడం దారుణమని విమర్శించారు. మిగతా ఎనిమిది ప్రభుత్వ పథకాలను పూర్తిగా విస్మరించడం అన్యాయమని వాపోయారు. ప్రయివేటు బీమారంగ సంస్థలైన క్రెడిట్‌ యాక్సిస్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి రూ. 250 కోట్లు, ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి రూ.94 కోట్లు, ట్రెయిల్‌ బ్లెజర్‌ అనే బ్రోకర్స్‌ సంస్థ ద్వారా రూ.346 కోట్లు కట్టబెట్టడం అన్యాయమన్నారు. భవన నిర్మాణ కార్మికుల బోర్డు నిధులను కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టే కుట్ర దీని వెనుక ఉందని విమర్శించారు. ప్రయివేటు బీమా కంపెనీలకు కట్టబెట్టిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 2009 నుండి 2025 వరకు బోర్డులో నమోదు చేసుకున్న కార్మికులు 28, లక్షల మంది ఉండగా 15 లక్షల మందికి మాత్రమే రెన్యువల్‌ చేయటం సరిగాదన్నారు. మిగతా 13 లక్షల మంది కార్మికుల రెన్యూవల్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే కార్మికులకు హెల్త్‌ టెస్టుల పేరుతో సీఎస్‌సీ సంస్థకు రూ.463 కోట్లు దోచిపెట్టారని విమర్శించారు. ఆ సంస్థకు నిధులివ్వడాన్ని ఆపేయాలనీ, ప్రభుత్వమే కార్మికులకు హెల్త్‌ కార్డులివ్వాలని డిమాండ్‌ చేశారు. వెల్ఫేర్‌ బోర్డు నిధులు దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. వెల్ఫేర్‌ బోర్డు సలహా మండలిని వెంటనే నియమించి బోర్డు నిధులను కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -