Sunday, February 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తడి, పొడి ఉసేలేదు.!

తడి, పొడి ఉసేలేదు.!

- Advertisement -

నిరుపయోగంగా డంపింగ్ యార్డులు
నవతెలంగాణ – మల్హర్ రావు

పల్లెలు దేశానికి పట్టుగొమ్మల్లాంటివి. ఒకప్పుడు పట్టణాలకు మాత్రమే పరిమిత మైన డంపింగ్ యార్డులు గత కొన్నేళ్లుగా గ్రామాలకు విస్తరించాయి. పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేందుకు గత ప్రభుత్వం పల్లెల్లో డంపింగ్ యార్డులు నిర్మించింది. స్వచ్ఛత కోసం నిర్మించిన అవి నిర్వహణ కొరవడి అలంకార ప్రాయంగా మారుతున్నాయి. మండలంలో కొన్నిచోట్ల మొక్కు బడి చర్యల కింద వాటి నిర్వహణ కొనసాగుతుంది. దీంతో గ్రామాల్లో అనుకున్న లక్ష్యం నీరుగారిపోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని డంపింగ్ యార్డుల నిర్వహణపై దష్టి సారించాలని కోరుతున్నారు. చెత్త సేకరణ కోసం పంచాయతీలకు ఆటోలు, ట్రాక్టర్లు సైతం అందజేశారు. తడి, పొడి చెత్త సేకరణకు గతంలో పలు చోట్ల రెండు రంగుల చెత్త బుట్టలు సైతం పంపిణీ చేశారు. అంత వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఆ విధానం ఎక్కడో ఒక చోట తప్ప, మిగతాచోట్ల సరిగా అమలు కావడం లేదు. యార్డుల నిర్వహణ సైతం మొక్కుబడిగా సాగుతుంది. ఎక్కడ కూడా తడి, పొడి చెత్తను వేరుగా సేకరించడం లేదు. ఫలితంగా రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన దంపింగ్ యార్డులు అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పంచాయతీల్లో నిధులు, సిబ్బంది తక్కువగా ఉండడంతో యార్డుల నిర్వహణ ఇబ్బందికరంగా ఉంటుందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు.

మండలంలో మొత్తం 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్నింటిలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధుల కింద రూ.2.50లక్షల వరకు వెచ్చించి డంపింగ్ యార్డులు నిర్మించారు. ఆయా గ్రామాల్లో తడి,పొడి చెత్తను వేరుగా సేకరణ చేసి యార్డులలో తడి చెత్తతో వర్మీ కంపోస్టు ఎరువు తయారీ చేయాలనే విధానం ఉండేది. అలా తయారు చేసిన ఎరువును అదే గ్రామంలో మొక్కలకు వినియోగించేవారు. మిగిలినది విక్రయించి వచ్చిన డబ్బును పంచాయతీ ట్రాక్టర్లు, ఆటోల ద్వారా ఇళ్ల వద్ద నుండి చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించాలి.

అక్కడ తడి, పొడి, ప్లాస్టిక్, గాజు, పాతదుస్తులు, తదితర ఇతర వ్యర్ధాలను వేరుచే యాలి. ప్రస్తుతం పంచాయతీల్లో నిధుల కొరత, సిబ్బంది కొరత ఉండడంతో ఆ నిబంధన చాలా వరకు కనిపించడం లేదు. ప్రతి రోజు ఇళ్ల వద్ద నుంచి సేకరించే చెత్త, ప్లాస్టిక్, ఘన వ్యర్థాలు, ఇతర వ్యర్థాలను గ్రామాల శివారుల్లో, అటవీ ప్రాంతాల్లో పడేస్తున్నారు.అనంతరం వాటిని తగలబెడుతున్నారు. దీంతో వాయు కాలుష్యం ఏర్పడి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. అటవీ, నిర్మానుష్య ప్రదేశాల్లో చెత్తపారబోయడం, కాల్చివేయడంతో మూగజీవాలు వాటిని తిని అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది.

చర్యలు తీసుకుంటాం: క్రాoతి కుమార్.. ఎంపీడీఓ
గతంలో తడి, పొడి చెత్త సేకరణ కార్యక్రమం బాగా కొనసాగింది. రెండు మూడేళ్ళుగా నిలిసిపోయినట్లుగా తెలుస్తోంది. ఇటీవల బాధ్యతలు చెపట్టిన సర్పంచ్ లకు ముందుగా అవగాహన కల్పిస్తాం. వారు గ్రామీణులకు తెలియజేసేలా చర్యలు తీసుకుంటాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -