న్యూజిలాండ్‌తో భారత్ ఢీ నేడు
సెమీస్ బెర్త్‌పై కన్నేసిన హర్మన్‌సేన
నవతెలంగాణ-ముంబయి
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. గ్రూప్ దశలో తొలి రెండు మ్యాచుల్లో అలవోక విజయాలు సాధించిన భారత్.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో అనూహ్య ఓటమి చవిచూసింది. సెమీఫైనల్ రేసులో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు టాప్-4లో చోటు ఖాయం చేసుకోగా.. మిగిలిన ఒక్క స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. నేడు నవీ ముంబయి వేదికగా న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీఫైనల్‌కు చేరుకోనుంది. లేదంటే, ఆఖరు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సహా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది.
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఇక్కడ ఎన్నో మ్యాచులు అనుభవం భారత అమ్మాయిల సొంతం. దీంతో నేడు మ్యాచ్‌లో భారత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. శ్రీలంకలో వర్షం కారణంగా రెండు మ్యాచులు రద్దు కాగా.. నేడు భారత్‌తో మ్యాచ్‌కు సైతం వరుణుడు అడ్డుతలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేడు వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే సెమీఫైనల్ రేసు నుంచి న్యూజిలాండ్ నిష్క్రమించే అవకాశం ఉంది. భారత్‌కు మ్యాచ్ రద్దు అయినా.. సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. నేడు మధ్యాహ్నం 3 గంటలకు భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ ఆరంభం.
పుంజుకుంటారా?
గ్రూప్ దశలో ఐదు మ్యాచులు ముగిసినా.. భారత్ తుది జట్టు కూర్పుపై ఓ అవగాహనకు రాలేదు. తొలి నాలుగు మ్యాచుల్లో నలుగురు బౌలర్లతో ఆడిన భారత్.. ఐదో మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లను బరిలోకి దించినా దక్షిణాఫ్రికాను స్వల్ప స్కోరుకు కట్టడి చేయలేదు. ఛేదనలో ఓ బ్యాటర్ సేవలు లేకపోవటం ప్రతికూలంగా మారింది. బ్యాటర్లు, బౌలర్లలో ఎవరూ నిలకడగా రాణించటం లేదు. ఒక్కో మ్యాచ్‌లో ఒకరు ఆడుతున్నారు. స్మృతీ మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు ఫామ్‌లోకి రావటం భారత్‌కు మంచి పరిణామం. యువ పేసర్ క్రాంతి గౌడ్ కొత్త బంతితో గొప్పగా రాణిస్తున్నా.. డెత్ ఓవర్లలో తేలిపోతుంది. దీప్తి శర్మ, శ్రీ చరణిలు సైతం మిడిల్ ఓవర్ల ఆరంభంలో చూపిన ప్రభావం ఆఖర్లో కొనసాగించటం లేదు. నేడు కీలక మ్యాచ్‌లో బ్యాటర్లు, బౌలర్లకు తోడు ఆల్‌రౌండర్లు సైతం సమిష్టిగా రాణిస్తేనే భారత్ నేరుగా సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంది.
న్యూజిలాండ్ అమ్మాయిలు సైతం ఉత్సాహంగా లేరు. ఐదు మ్యచుల్లో ఓ విజయం సాధించిన కివీస్ రెండింట ఓడింది. రెండు మ్యాచులు వర్షార్పణం అయ్యాయి. అయినా, సెమీఫైనల్ రేసులో నిలిచిన న్యూజిలాండ్ గ్రూప్ దశలో చివరి రెండు మ్యాచుల్లో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. ఏ మ్యాచ్‌లో ఫలితం తేలకుండా పాయింట్లు పంచుకునే పరిస్థితి తలెత్తితే.. కివీస్ ఆశలు ఆవిరి కానున్నాయి. న్యూజిలాండ్ ఎక్కువగా సోఫి డివైన్‌పై ఆధారపడుతోంది. సోఫి విఫలమైతే ఆ ప్రభావం స్కోరు బోర్డుపై కనిపిస్తోంది. స్పిన్నర్లు అమెలి ఖేర్, ఎడెన్ కార్సన్‌లు ఆశించిన ప్రభావం చూపించటం లేదు. సుజి బేట్స్, జార్జియా ప్లిమ్మర్, బ్రూకీ, మ్యాడీ గ్రీన్‌లు రాణిస్తే భారత్‌కు న్యూజిలాండ్ గట్టి పోటీ ఇవ్వగలదు.