Friday, September 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంశ్రీరాంనగర్‌ బస్తీలో నివారణ చర్యలేవీ?

శ్రీరాంనగర్‌ బస్తీలో నివారణ చర్యలేవీ?

- Advertisement -

జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రమేష్‌, వెంకటేశ్‌


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బాగ్‌లింగంపల్లిలోని శ్రీరాంనగర్‌ బస్తీ, కమాన్‌ బస్తీ నీటిలో మునిగి అక్కడి బస్తీ వాసుల ఇండ్లలోకి వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ తెలిపింది. జీహెచ్‌ఎంసీ అధికారులు నివారణ చర్యలు చేపట్టడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించింది. గురువారం శ్రీరాంనగర్‌ బస్తీని డీవైఎఫ్‌ఐ నాయకులు సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. బస్తీ ప్రజలను కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేశ్‌లు మాట్లాడుతూ గత అనేక ఏండ్లుగా వర్షాలకు శ్రీరాంనగర్‌ బస్తీ నీట మునిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర లోతట్టు ప్రాంతాల్లోనూ ఇలాంటి సమస్యలే ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ, నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో వారి నిర్లక్ష్యం కొనసాగుతున్నదని అన్నారు. వర్షాకాలంలో వరద నీటితోపాటు, హుస్సేన్‌ సాగర్‌ నుంచి ప్రవహించే వరద ప్రవాహం శ్రీరాం నగర్‌ బస్తీలోని ఇండ్లలోకి వస్తున్నాయని బస్తీ వాసులు అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పారు.

డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలనీ, వర్షపు నీళ్లు వచ్చి చేరడంతో కాలనీ ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. వాహనాలు నీట మునిగాయనీ, వర్షపు నీళ్ల ప్రవాహంతో ఇండ్ల నుంచి బయటకు రాలేక సతమతమమయ్యారని చెప్పారు. వర్షపు నీళ్లు, మురికి నీళ్లతో విషజ్వరాలు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందన్నారు. భారీగా కురిసిన వర్షానికి ఇండ్లలోకి చేరిన నీటి వల్ల నిత్యావసర వస్తువులు, సరుకులు తడిచాయని అన్నారు. శ్రీరాంనగర్‌ బస్తీ, కమాన్‌ బస్తీలో నెలకొన్న సమస్యకు అధికారులు, ప్రజాప్రతినిధులు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. అధికారులు నిర్లక్ష్యం విడనాడాలని కోరారు. హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాల్లో వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. లేకుంటే బస్తీవాసులను సమీకరించి జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఎండి జావీద్‌, నాయకులు రాజ్‌ కుమార్‌ ఇతర ప్రజాసంఘాల నాయకులు, బస్తీవాసులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -