Tuesday, July 22, 2025
E-PAPER
Homeజాతీయంరాజకీయ పోరాటాలతో మీకేం పని?

రాజకీయ పోరాటాలతో మీకేం పని?

- Advertisement -

మిమ్మల్ని ఎందుకు వాడుకుంటున్నారు? : ఈడీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ :
రాజకీయ పోరాటాలతో మీకేం పని అని సుప్రీంకోర్టు సోమవారం ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని నిలదీసింది. ఈ పోరాటాలకు మిమ్మల్ని ఎందుకు వాడు కుంటున్నారని ప్రశ్నించింది. కర్నాటక ముఖ్య మంత్రి సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతి, ఆ రాష్ట్ర మంత్రి బైరతి సురేష్‌లకు జారీ చేసిన సమన్లను రాష్ట్ర హైకోర్ట్‌ కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన అప్పీలును అనుమతించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా ఈడీపై అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది. పార్వతి, సురేష్‌లకు మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ (ముడా) అక్రమంగా ఫ్లాట్లు కేటాయించిందన్న ఆరోపణలపై ఈడీ సమన్లు జారీ చేయగా వాటిని కర్నాటక హైకోర్టు కొట్టివేసింది. దీనిపై ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ప్రధాన న్యాయమూర్తి గవారు, న్యాయమూర్తి కె.వినోద్‌ చంద్రన్‌తో కూడిన సుప్రీం బెంచ్‌ ముందుకు ఈడీ అప్పీలు విచారణకు వచ్చింది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. ఈ సమయంలో సీజేఐ గవారు జోక్యం చేసుకుంటూ ‘మా గొంతు విప్పాలని దయచేసి మమ్మల్ని అడగకండి. లేకుంటే ఈడీపై మేము కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది. దురదృష్టవశాత్తూ నాకు మహారాష్ట్రలో కొన్ని అనుభవాలు ఎదురయ్యాయి. రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగనివ్వండి. వాటితో మీకేం పని?’ అని ప్రశ్నించారు. పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ విన్నవించడంతో దానిని తోసిపుచ్చుతున్నట్లు గవారు ప్రకటించారు. ట్రయల్‌ కోర్టు తీర్పును హైకోర్ట్‌ సింగిల్‌ జడ్జి సమర్ధించారని, అంటే ఈ కేసులో ఇప్పటికే రెండు స్థాయిలలో తీర్పులు వచ్చాయని, వాటిని తిరగరాసే ప్రయత్నం అనవసరమని అంతకుముందు సుప్రీంకోర్టు బెంచ్‌ తేల్చి చెప్పింది.

ఏమిటీ కేసు?
మైసూరులో 14 ఫ్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపించింది. మనీ లాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా పార్వతి, సురేష్‌లకు సమన్లు జారీ చేసింది. భూముల లావాదేవీలతో వీరిద్దరూ అక్రమ ప్రయోజనాలు పొందారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈడీ చెబుతోంది. అయితే ఈడీ సమన్లను కర్నాటక హైకోర్టు మార్చిలో కొట్టివేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -