నీళ్లు ఏపీ సీఎం చంద్రబాబుకు, నిధులు రాహుల్ గాంధీకి,
నియామకాలు చంద్రబాబు అనుచరులకు..
కాంగ్రెస్ దోపిడీపై నిలదీస్తాం
‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-భూపాలపల్లి/పరకాల
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం.. పదేండ్ల కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉందనీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఆదివారం జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గండ్ర జ్యోతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నీళ్లు.. ఏపీ సీఎం చంద్రబాబుకు, నిధులు.. ఢిల్లీలోని రాహుల్ గాంధీకి, నియామకాలు చంద్రబాబు అనుచరులకు వెళ్తున్నాయని తెలిపారు. వీటిపై గొంతు విప్పి ప్రశ్నించాల్సింది కేసీఆర్ దళమేనని, కసితో కొడితే అవతలోడి దిమ్మతిరగాలని అన్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల సాగు, తాగునీరు సౌలభ్యం కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మూడేండ్లలో కేవలం రూ.80వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్‌నగర్ గురుకులాల్లో 111మంది విద్యార్థులు కల్తీ ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని అన్నారు. తమ ఇంట్లో పిల్లలకు ఇలాంటి భోజనమే అందిస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ రైజింగ్ అని చెప్పుకుంటున్న ప్రభుత్వం రైజింగ్ ఎందులో ఉందో చెప్పాలన్నారు. రాష్ట్రంలో ప్రతి గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలపై సర్వే చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు సూచించారు. భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జిగా గండ్ర వెంకట రమణారెడ్డి కొనసాగుతారని తెలిపారు. ఎలాంటి భేషజాలకు పోకుండా పాత, కొత్త అనే తేడా లేకుండా అందర్నీ కలుపుకొని పోవాలని రమణారెడ్డికి సూచించారు. కూర్చున్న చెట్టును నరుక్కోవద్దని, మాతృ సంస్థను కాపాడుకోవాలని కోరారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలన, నేటి కాంగ్రెస్ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ చేస్తున్న దోపిడీపై నిలదీస్తాం : కేటీఆర్
హనుమకొండ జిల్లా పరకాలలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్థాపించిన పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ తీసుకున్న పరకాల, నడికూడ మండలాలకు చెందిన 500మంది మహిళలకు కేటీఆర్ కుట్టుమిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా పరకాలలోని లలిత కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు సమీపంలో నాలా నిర్మాణం కోసం రూ.160 కోట్ల దోపిడీకి మంత్రులు, ఎమ్మెల్యేలు తెరలేపారని అన్నారు. ఈ వ్యవహారంపై మండలిలో, శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మెగా టెక్స్‌టైల్ పార్క్ సమీపంలో కాలువ నిర్మాణానికి జనవరి నెలలో రూ.137 కోట్లతో టెండర్లు పిలిచి టెండరింగ్ పూరైందన్నారు. అయినప్పటికీ ఆ పనికి తట్టెడు మట్టి కూడా పోయకుండానే మార్చిలో అదే పనికి ఎస్టిమేషన్ సరిపోదంటూ మరో రూ.160 కోట్లు పెంచుతూ రీ టెండర్స్ పిలవడంలో మతలబేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఈ సమావేశాల్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, మాజీ వికలాంగుల చైర్మెన్ వాసుదేవ రెడ్డి, మాజీ జెడ్పీచైర్మన్ సాంబారి సాంబారావు, బీఆర్‌ఎస్ నాయకులు ఏనుగు రాకేష్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ వెంకటరాణి సిద్దు, ఆయా మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES