కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ సవాల్..
నవతెలంగాణ – వేములవాడ
రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే, దానిపై బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆదివారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు తమ మాటలు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇళ్లపై మొదటి విడతలో భాగంగా 144 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేయగా, రెండో విడతలో 600 మందికి పైగా, ఆ తర్వాత మిగతా అర్హులకు కూడా ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. సుమారు 2000 మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారని, వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, నిరుపేదలకు ఇళ్లు లేకపోవడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
గత 10 సంవత్సరాలలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, కేవలం 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై రాజన్న గుడి వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రూ. 150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధికి, రూ. 47 కోట్లతో రోడ్డు వెడల్పు పనులకు కృషి చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ అభివృద్ధి పనులను బీఆర్‌ఎస్ నాయకులు కావాలనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
గత పదేళ్లలో ప్రతి పథకంలోనూ బీఆర్‌ఎస్ నాయకులు దోచుకున్నారని, ముఖ్యంగా దళిత బంధు, బీసీ బంధు పథకాలలో సగం సగం పైసలు పంచుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నాయకులు అధికారం కోల్పోయిన బాధతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. గత పాలకులలా కాకుండా తమ నాయకుడు అనునిత్యం ప్రజల్లో ఉంటున్నారని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని వివరించారు.
బీఆర్‌ఎస్ నాయకులు తమ మాటలను అదుపులో పెట్టుకోకపోతే, రానున్న రోజుల్లో ప్రజల నుంచి ఇంకా ఎక్కువ చీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికపు రాకేష్, తోపాటు తదితరులు ఉన్నారు.