Friday, November 7, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రాణాలకు భరోసా ఏది?

ప్రాణాలకు భరోసా ఏది?

- Advertisement -

లోపభూయిష్టంగా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్వహణ
కాగితాల్లోనే రోడ్డు భద్రతా ప్రమాణాలు
రోడ్లపై గుంతలు పూడ్చేదెవరు?
వరుస ప్రమాదాలు జరుగుతున్నా మేల్కొనని ప్రభుత్వాలు


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
దేశంలోని రోడ్లపై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. డజన్ల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ పాపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఎంత? తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరుస బస్సు ప్రమాదాల తర్వాత ఇప్పుడిదే అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. రహదారుల నిర్మాణాన్ని పంచేసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుర్ఘటనలు జరిగాక, తప్పును ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ ప్రజల్ని తప్పుతోవ పట్టిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ఎలాంటి ప్రయత్నాలు జరగట్లేదు. బీజాపూర్‌ జాతీయ రహదారిపై చేవెళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంతో పాలకుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం స్పష్టంగా ప్రజలకు అర్థమైంది.

ఈ రోడ్డు విస్తరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. పైపెచ్చు సింగిల్‌ రోడ్డుగా ఉన్న ఈ జాతీయ రహదారి నిర్వహణలోనూ లోపభూయిష్టంగా ఉంది. రోడ్ల మధ్య, పక్కన పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. వాటిని తప్పించబోయే చేవెళ్లలో టిప్పర్‌ ఆర్టీసీ బస్సును ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్లు ఇద్దరూ మరణించారు కాబట్టి, జరిగిన ఘోరానికి బాధ్యత ఎవరు తీసుకుంటారనే ప్రశ్న సహజం. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జాతీయ, రాష్ట్ర రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. వాటిని ఎప్పటికప్పుడు పూడ్చివేసి, మరమ్మతులు చేయాలి. ఆ పని ఎవరూ చేయట్లేదు. ఫలితంగా రహదారులు రక్తమోడుతున్నాయి. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం 2023లో దేశంలో 4,61,312 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వాటిలో 1,72,944 మంది మరణించారు. 4,43,366 మంది క్షతగాత్రులు అయ్యారు.

2024లో 4.73 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగితే 1.80 లక్షలమంది మరణించారు. క్షతగాత్రుల సంఖ్య దాదాపు 4.50 లక్షలకు పైగానే ఉంది. ఈ మరణాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత లేదా? ఎవరిపై కేసులు పెట్టాలి. ..ఎవర్ని శిక్షించాలి? అసలు రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులైన కుటుం బాల ఆర్థిక, సామాజిక స్థితిగతుల్ని ప్రభుత్వాలు ఏమన్నా పట్టించుకుంటున్నాయా? వారెంత దైన్యంగా బతుకుతున్నారో కనీసం గణాంకాలన్నా ఉన్నాయా? అంటే ‘లేవు’ అనే నిర్లక్ష్య సమాధానమే వినిపిస్తుంది. ఆర్టీసీ వంటి ప్రజా రవాణాను చంపేసీ, రోడ్లపైకి ఇష్టంవచ్చినట్టు ప్రయివేటు వాహనాలకు అనుమతిస్తున్నారు. భారీ వాహనాలకు కనీసం వేగ నియంత్రణలు కూడా లేవు. కొత్త కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తుంటే, అవి తిరిగేందుకు అనువుగా మన జాతీయ, రాష్ట్ర రహదారులు లేవు. అలాం టప్పుడు అనుమతులు ఎలా ఇస్తున్నారనే ప్రశ్నలకు సమాధానాలూ లేవు.

జాగ్రత్తలు..
రోడ్లు ప్రమాదాలకు కారణాలు అనేకం. వాహనదారులు సైతం రోడ్డు భద్రతా మార్గదర్శకాలు పాటించాలి. సీట్‌బెల్ట్‌ పెట్టుకోవడం, వాహనాలకు మధ్య దూరం పాటించడం, సిగళ్ల ఉల్లంఘనకు పాల్పడకుండా ఉండటం, నిబంధనలకు అనుగుణంగా వేగం పాటించడం వంటి ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి. దానికి తగినట్టు ఆయా రహదారులపై రేడియం హెచ్చరిక బోర్డుల్ని పెట్టాలి.

ఆర్టీసీ బస్సుల సంఖ్య పెరగాలి
ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారీ రోడ్డు నెట్‌వర్క్‌ వాడుకుంటున్నది. రాష్ట్రంలో ఆర్టీసీని 11 రీజియన్లుగా విభజించారు. ఇందులో 97 డిపోల పరిధిలో 364 బస్టేషన్లు ఉన్నాయి. ఆర్టీసీ; అద్దె బస్సులు కలిపి మొత్తం 9,094 బస్సులు ఉన్నాయి ఆర్టీసీ బస్సుల్లో సీటింగ్‌ కెపాసిటీ ప్రకారం నడిపితే రాష్ట్రంలో ప్రజల అవసరాల కోసం మొత్తం 27 వేల బస్సులు అవసరం. ఏసీ, నాన్‌ ఏసీ, గ్రామీణ, పట్టణ బస్సులతోపాటు ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రస్తుతం ప్రయాణీకులకు సేవలందిస్తున్నాయి.

మొత్తం 3,328 రూట్లల్లో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. 11,104 గ్రామాలకు ఆర్టీసీ నెట్‌వర్క్‌ఉంది. ఇప్పటికీ రాష్ట్రంలో 1701 గ్రామాలకు బస్సులే వెళ్లకపోవడం గమనార్హం. ఆర్టీసీ బస్సులకు 75.89 శాతం ఆక్యుపెన్సీ రేషియా ఉంది. ప్రతిరోజూ 32.02 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 54 లక్షల మంది ప్రయాణీలను తమ గమ్యస్థానాలకు చేరుస్తు న్నాయి. రోడ్ల డిజైన్లు సక్రమంగా లేకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం, భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు, రన్నింగ్‌ టైం అంటూ ఆర్టీసీ డ్రైవర్లపై ఒత్తిళ్లు వంటివి ప్రమాదాలకు కారణమ వుతున్నాయి. ఈ సమస్యల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పరిష్కారించాలి. ప్రజలకు మెరుగైన రహదారి ప్రయాణాన్ని అందించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

బ్లాక్‌ స్పాట్లు
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన మూలలు, ఇతర ఇబ్బందులతో కూడిన 930 బ్లాక్‌ స్పాట్లు ఉన్నాయి. జాతీయ రహదారి 65 (హైదరాబాద్‌ నుంచి విజయవాడ) పై 17 బ్లాక్‌ స్పాట్లు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి తాండూరు మీదుగా వెళ్లే 163 రహదారిలో 50 భారీ గుంతల్ని గుర్తించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ చుట్టూ 54 బ్లాక్‌ స్పాట్లను ఆర్‌అండ్‌బీ గుర్తించింది. వీటికి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడం, సైన్‌బోర్డులు పెట్టడం, భద్రతాపరమైన అవగాహన కల్పించే పనుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి. ఈ బ్లాక్‌స్పాట్లలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

రాష్ట్రంలో ఇదీ పరిస్థితి
రాష్ట్రవ్యాప్తంగా 1.10 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్‌ ఉంది. ఇందులో రోడ్లు, భవనాల శాఖలో పరిధిలో 32,500 కిలోమీటర్లు ఉంది. స్టేట్‌ రోడ్డు 27,461 కిలోమీటర్లు, జాతీయ రహాదార్లు 2690 కిలోమీటర్ల మేర ఉంది. ఇందులో జిల్లాలకు సంబంధించిన మేజర్‌ రోడ్లు 12,079 కిలోమీటర్లు ఉన్నాయి. ఈ రోడ్ల నిర్మాణం, నిర్వహణ సక్రమంగా చేస్తే ప్రమాదాలకు చెక్‌ పెట్టొచ్చు. ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేస్తూనే, భారత రోడ్డు కాంగ్రెస్‌ ప్రమాణాలకు అనుగుణంగా రోడ్లను నిర్మించాలి.

70 శాతం ప్రమాదాలు ఇక్కడే
రాష్ట్రంలో 70 శాతం రోడ్డు ప్రమాదాలు బ్లాక్‌స్పాట్ల మూలానే జరుగుతున్నట్టు పోలీస్‌ రికార్డులు చెబుతున్నాయి. చేవెళ్ల ఘటన ఇందులోకే వస్తుంది. ఈ ఏడాదిలో గత సెప్టెంబరు నాటికి 7,333 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు సమాచారం. హైరిస్క్‌ జోన్లల్లో కనీసం 2,702 మంది చనిపోయినట్టు లెక్కలు న్నాయి. రోడ్ల డిజైన్లల్లో లోపాలు, తీవ్రమైన మూల మలుపులు, రోడ్డు నిర్మాణ, నిర్వహణా ప్రమాణాలు చాలా బలహీనంగా ఉండటం ప్రమాదాలకు మరోకారణం.

అధికారిక లెక్కల ప్రకారం జాతీయ రహాదారుల వెంట ఉన్న నిజామాబాద్‌, జగదల్‌పూర్‌, బీజాపూర్‌తోపాటు ఔటర్‌ రింగు రోడ్డు చుట్టూ ఈ రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. బ్లాక్‌స్పాట్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 300 కోట్లు కేటాయించినా ఆశించిన మేరకు వేగంగా పనులు జరగడం లేదు. ఈ ప్రమాదాల నివారణకు తమిళనాడు మోడల్‌ను అమలుచేయడానికి మరో రూ. 900 కోట్ల నిధులు అవసరం. ట్రాఫిక్‌ సిగళ్లు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, స్పీడ్‌ కంట్రోల్‌ వ్యవస్థలు, రోడ్లను వెడల్పు చేయడం తదితర చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ నిరంతరం చేపట్టాల్సిన పనులే కావడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -