Tuesday, December 9, 2025
E-PAPER
Homeజాతీయంనాటి ప్రాధాన్యత నేడేది?

నాటి ప్రాధాన్యత నేడేది?

- Advertisement -

– అమెరికా భద్రతా వ్యూహంలో నాడు భారత్‌కు అగ్రస్థానం
– నివేదికల్లో ప్రశంసలు కురిపించిన ఒబామా, బైడెన్‌
– నాడు మెచ్చుకొని నేడు కస్సుమంటున్న ట్రంప్‌

న్యూఢిల్లీ : ఒకప్పుడు అమెరికా జాతీయ భద్రతా వ్యూహం (ఎన్‌ఎస్‌ఎస్‌) యొక్క ప్రాధాన్యతల్లో మన దేశానికి దాదాపుగా అగ్ర స్థానం ఉండేది. కానీ గడచిన దశాబ్ద కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ట్రంప్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆ వ్యూహంలో మనకు ప్రాధాన్యతే లేకుండా పోతోంది. జో బైడెన్‌ హయాంలో భారత్‌కు ‘ప్రధాన రక్షణ భాగస్వామి’ హోదా లభించింది. అంతకుముం దు డోనాల్డ్‌ ట్రంప్‌ పదవీకాలంలో కూడా మన దేశాన్ని ‘ముఖ్యమైన అంతర్జాతీయ శక్తి’గా గుర్తించారు. ఇప్పుడు ఆ హోదాలు, భుజకీర్తులు అదృశ్యమయ్యాయి. నేడు అమెరికా ప్రభుత్వం వాణిజ్యపరమైన ప్రతీకార చర్యలకు దిగుతూ, సుంకాలు వడ్డిస్తూ మనపై ఆర్థిక భారం మోపుతోంది. ఎన్‌ఎస్‌ఎస్‌ అనేది అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ తన భద్రతా దృక్ఫధాన్ని వివరిస్తూ కాంగ్రెస్‌కు విధిగా పంపే చట్టబద్ధమైన నివేదిక. భారత్‌ ఇప్పటికీ ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో కీలక పాత్ర పోషిస్తోంది. 2022లో బైడెన్‌ ప్రభుత్వం తన నివేదికలో మన దేశానికి వ్యూహాత్మక ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ట్రంప్‌ ప్రభుత్వ నివేదికలో భారత్‌ ప్రస్తావన చాలా కొద్దిసార్లు మాత్రమే కన్పించింది. బైడెన్‌ ప్రభుత్వ నివేదికలో భారత్‌కు ఏడు సందర్భాలలో వ్యూహాత్మక ప్రాతినిధ్యం ఇస్తే ట్రంప్‌ పాలనలో అది నాలుగు పర్యాయాలకు తగ్గిపోయింది.

ట్రంప్‌ ప్రభుత్వం ఏం చెప్పింది?
ట్రంప్‌ ప్రభుత్వం తన 2025వ సంవత్సరపు వ్యూహాత్మక నివేదికలో ఏం చెప్పిందంటే…ఇండో-పసిఫిక్‌ భద్రత విషయం లో సాయపడేలా భారత్‌ను ప్రోత్సహించడానికి ఆ దేశంతో వాణిజ్య, ఇతర సంబంధాలు కొనసాగిస్తాం. అదే విధంగా ఆస్ట్రేలియా, జపాన్‌తో కూడా సహకారాన్ని పెంచుకుంటాం. తద్వారా నాలుగు దేశాల మధ్య సంబంధాలు కొనసాగుతాయి. పశ్చిమార్థగోళంలో, ఆఫ్రికాలో అమెరికా ప్రయోజనాల కోసం భాగస్వాముల ను, మిత్రులను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భారత్‌ భాగస్వామి కావాలి. దక్షిణ చైనా సముద్రంలో స్థానం కోసం సైనిక, నౌకా దళాలలో పెట్టుబడులను పెంచడంతో పాటు జపాన్‌ నుంచి భారత్‌ వరకూ అన్ని దేశా ల సహకారం పొందాల్సిన అవసరం ఉంది.

అరిగిపోయిన రికార్డులా…
ట్రంప్‌ ప్రభుత్వం తన ఎన్‌ఎస్‌ఎస్‌ నివేదికలో భారత్‌-పాక్‌ ఘర్షణను ప్రస్తావించింది. ప్రపంచంలో ఎనిమిది ఘర్షణలను నివారించానని ట్రంప్‌ అందులో గొప్పగా చెప్పుకున్నారు. అందులో ప్రత్యేకంగా భారత్‌-పాక్‌ ఘర్షణను కూడా చేర్చారు. అణ్వాయుధాలను కలిగిన పొరుగు దేశాల మధ్య అమెరికా ‘శాంతి’ చర్చలు జరిపిందని తెలిపారు. వాస్తవానికి ట్రంప్‌ దాదాపు యాభై సార్లు ఈ వాదనను తెర పైకి తెచ్చారు. దీనిని భారత్‌ పదే పదే తోసిపుచ్చినప్పటికీ, ఇరు దేశాల సైనిక దళాల మధ్య జరిగిన చర్చల కారణంగానే నాలుగు రోజుల ఘర్షణ ముగిసిం దని చెప్పినప్పటికీ ట్రంప్‌ అరిగిపోయిన రికార్దు మాదిరిగాఅదే పాట పాడుతూ వస్తున్నారు.

ప్రధాన రక్షణ భాగస్వామిగా కొనియాడిన బైడెన్‌
బైడెన్‌ ప్రభుత్వ ఎన్‌ఎస్‌ఎస్‌ నివేదిక మన దేశానికి ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చింది. భారత్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా, ప్రధాన రక్షణ భాగస్వామిగా కొనియాడింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం విషయంలో ఒకేలా ఉన్న రెండు దేశాల దృక్ఫధానికి మద్దతు ఇవ్వడానికి భారత్‌, అమెరికా ద్వైపాక్షికంగా, బహుముఖంగానూ కలిసి పనిచేస్తాయని తెలిపింది.

బైడెన్‌ ప్రభుత్వం కూడా…
అంతకుముందు ఒబామా ప్రభుత్వం కూడా తన రెండు వ్యూహ నివేదికలలో భారత్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. భారత్‌తో వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నామని 2015 నాటి నివేదికలో తెలియజేసింది. ద్వైపాక్షిక సంబంధాలు స్వాభావిక విలువలు, పరస్పర ప్రయోజనాలతో కూడి ఉన్నాయని చెప్పింది. ప్రాంతీయ భద్రతను కల్పించే దేశంగా భారత్‌ నిర్వహిస్తున్న పాత్రను, కీలక ప్రాంతీయ సంస్థలలో దాని భాగస్వామ్యాన్ని సమర్ధించింది. 2010లో కూడా ఒబామా ప్రభుత్వం తన నివేదికలో మన దేశానికి సముచిత స్థానమే ఇచ్చింది. చైనా, రష్యాతో పాటు 21వ శతాబ్దపు ప్రభావంతమైన భాగస్వామ్య దేశంగా నిలిచిందని ప్రశంసించింది. దక్షిణ, మధ్య ఆసియాలో వ్యూహాత్మక స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, ప్రాంతీయ ఆర్థిక సమగ్రతను ముందుకు తీసుకుపోవడానికి భారత్‌తో కలిసి పనిచేస్తున్నామని గుర్తు చేసింది.

మారిన ట్రంప్‌ వైఖరి
2017లో ట్రంప్‌ ప్రభుత్వ ఎన్‌ఎస్‌ఎస్‌ నివేదిక కూడా భారత్‌ను ఓ ఎదుగుతున్న శక్తిగా అభివర్ణించింది. ప్రపంచ శక్తిగా, బలమైన వ్యూహాత్మక, రక్షణ భాగస్వామిగా భారత్‌ అవిర్భావాన్ని స్వాగతిస్తున్నామని చెప్పింది. అయితే రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్‌ వైఖరిలో మార్పు కన్పిస్తోంది. నాలుగు దేశాల మధ్య జరిగిన భద్రతా చర్చల (క్వాడ్‌) గురించి ట్రంప్‌ ప్రభుత్వ నివేదిక పెద్దగా ప్రస్తావించలేదు. బైడెన్‌ ప్రభుత్వం తన 2022 నివేదికలో ఆరు సందర్భాలలో క్వాడ్‌ ప్రస్తావన తీసుకొచ్చింది. ట్రంప్‌ తాజా నివేదికలో ఆ ప్రస్తావన కేవలం ఒకసారి మాత్రమే కన్పించింది. భారత భద్రతా భాగస్వామ్యాన్ని ‘ప్రోత్సహించడాని’కి క్వాడ్‌ ఒక సాధనమని తెలిపింది. ఇక పాకిస్తాన్‌ ప్రస్తావన కూడా ఆ నివేదికలో ఒక చోట మాత్రమే ఉంది. అది కూడా భారత్‌-పాక్‌ ఘర్షణను నివారించడంలో తన గొప్పతనాన్ని చాటుకునేందుకే. ఏదేమైనా భారత్‌కు ప్రాధాన్యత తగ్గడం క్షీణిస్తున్న ద్వైపాక్షిక సంబంధాలను ఎత్తిచూపుతోంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమంటే బైడెన్‌ ప్రభుత్వం తన 2022 నివేదికలో పాకిస్తాన్‌ పేరును ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -