భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో మిళితమై ఉన్న చేనేత రంగం ఒకప్పుడు కళగా, వారసత్వ సంపదగా ఆదరింపబడినది. మానవ జీవితంతో ముడిపడి ఉన్న కూడు, గుడ్డ, గూడు వంటి నిత్య అవసరాలలో బట్ట ప్రజల మాన రక్షణకు తోడ్పాటు అందించడంతోపాటు నాగరికతకు ప్రత్యక్షసాక్ష్యంగా ఉన్నది. వ్యవసాయ రంగం తర్వాత లక్షలాది ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కోటిమంది ఆధారపడి జీవించడం తో ప్రత్యేకతగా నిలుస్తున్నది. కానీ, నేడు ప్రభుత్వాల నిర్లక్ష్యపు వైఖరితో తన ఉనికిని చాటుకోలేని దుస్థితిలో కూరుకుపోయింది.
దేశ వస్త్ర ఉత్పత్తులలో తెలంగాణ చేనేత వస్త్రోత్పత్తులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. రంగుల అద్దకం, ప్రింటింగ్, చిటికి పరిశ్రమ, డిజైన్లు మొదలైన నైపుణ్యతతో ఆధునిక మార్కెట్లో సైతం పోటీ పడుతున్నది. తెలంగాణ చేనేత కార్మికులు తరతరాల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ప్రజల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా వస్త్రోత్పత్తులు చేస్తూ తమ నైపుణ్యాన్ని ద్విగుణీకృతం చేసుకుంటూ జీవనం సాగి స్తున్నారు. కాకతీయుల పరిపాలనతోపాటు అనేక సంస్థానాల మూలంగా చేనేత వస్త్రోత్పత్తులకు చేనేత కళకు మంచి ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత నిజాం పరిపాలన చేనేత వస్త్రాల ఉత్పత్తులలో అనేక మార్పులు తెచ్చి అరబ్ దేశాలకు ఎగుమతి చేయడానికి తేలియా రుమాళ్ళును ప్రోత్సహించింది. నూలు సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి.అగ్గిపెట్టెలో అమిరే ఆరు గజాల చీర ఇమడగల సున్నితమైన వస్త్రం తయారు చేయగల నైపుణ్యం, ఎటువంటి చిత్రాన్నయినా చూసి దాన్ని వస్త్రంపై నేయటం తెలంగాణ చేనేత నేతగాళ్ల సొంతం. కుట్టులేని అం గీలు, కటింగ్ లేని గాంధీ టోపీలు స్వాతంత్య్ర పోరాటానికి అందించిన ఘనత తెలంగాణ నేతన్నది.అంతటి ఘనమైన వారసత్వం గల చేనేత నేడు రాష్ట్రంలో అత్యంత దయనీయంగా మారింది. రంగం సంక్షోభంలోకి నెట్టబడింది. చేనేత మగ్గాన్ని నమ్ముకుని బతుకులీడుస్తున్న నేతన్నలు పని లేక పస్తులుంటూ, ఆకలిచావులు, ఆత్మహత్యలకు గురవుతున్న పరిస్థితి నెలకొంది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నేతన్నల కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని, ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చెందుతామని కోటి ఆశలతో కార్మికులు ఎదురు చూశారు. కానీ ఆ విధంగా జరగకపోగా వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పాలకుల అలసత్వంతో పూర్తిగా చేనేత రంగాన్ని సమస్యల సుడిగుండంలో నెట్టివేసింది. గత ప్రభుత్వం తమ ఇమేజ్ గొప్పతనం పెంచుకోవడానికే ఉపయోగించు కున్నది తప్ప ఈ రంగానికి చేసిందేమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆదుకుంటుందనుకుంటే అదీ లేదని అర్థమవుతోంది. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తున్నా నేతన్నల ఉపాధి కల్పన కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ కాలంలోనే ఆర్థిక ఇబ్బందులతో పాటు ఉపాధి లేకపోవడం వలన దాదాపు 36మంది చేనేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందజేయలేదు. ‘చేనేతకు చేయూత పొదుపు’ పథకాన్ని 24 నెలలకు కుదించి కొత్తగా ‘థ్రిఫ్ట్ పథకం’ ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న ‘నేతన్న బీమా’ పథకాన్ని ‘నేతన్న భద్రత’గా పరిమితి పొడిగించింది.అలాగే ‘చేనేత అభయ హస్తం’, ఈ పథకాలు కొత్తవి కావు, గతంలో ఉన్న పథకాల పేరు మార్చి కోతలు విధించి పాత సీసాలో కొత్త సార అన్న చందాన గొప్పలు చెప్పుకుంటున్నది.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకుండా కాల యాపన చేస్తూ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నది. చేనేత కార్మికులపై ఉన్న రూ.33 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్య మంత్రి ఏడాది గడిచినా పట్టించుకోవడం లేదు. పన్నెండేండ్లు గడిచిపోతున్నా ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు, టెెస్కోకు ఎన్నికలు నిర్వహించలేదు. ప్రభుత్వ రంగ సంస్థలకు కావాల్సిన వస్త్రాలను రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికుల ద్వారా ఉత్పత్తి చేయిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు?భారత్ జోడోయాత్రలో భాగంగా రాహుల్‌గాంధీ జడ్చర్ల బహిరంగ సభలో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే చేనేత కార్మికులపై, ఉత్పత్తులపై పడే జీఎస్టీని ప్రభుత్వం భరిస్తుందని చెప్పినప్పటికీ ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదు.
తెలంగాణలో చేనేత ఉత్పత్తి రూ.వెయ్యి కోట్లు ఉంటుంది. ఐదు శాతం జీఎస్టీ భరిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కేవలం 50 కోట్ల వరకు భారం పడుతుంది. రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకోదా? చేనేత పద్మశాలి వివిధ కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఎందుకు చేయడం లేదు? మత్స్యకార, వ్యవసాయ పరపతి సంఘాలు కొనసాగుతున్నప్పుడు చేనేత నేత కార్మిక సహ కార సంఘం పట్ల ఎందుకింత చిన్నచూపు? రాష్ట్ర శాసనసభలో 2024-25 ఏడాదికి ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ.187 కోట్లు మాత్రమే. ఇం దులో ఉద్యోగుల జీతభత్యాలు, కార్యాలయాల ఖర్చులు పోను మిగిలేది అంతంత మాత్రమే! ఇలాగైతే చేనేత రంగం ఎలా అభివృద్ధి చెందు తుంది?చేనేత కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే చేనేతను జౌళిశాఖ నుండి విడదీయాలి. వెంటనే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి రెండు వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి.
ప్రధాని నరేంద్ర మోడీ 2015 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ రంగానికి సాయం చేయకపోగా చేనేతకు సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించారు. ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డ్, కేంద్ర పత్తి బోర్డు, సిల్క్ బోర్డును రద్దు చేశారు. ఐసిఐసిఐ నాబార్డ్ మొదలగునవి రద్దు చేయడమే కాకుండా మహాత్మా గాంధీ బునకర్ బీమా పథకం, థ్రిప్ట్ పథకాలను రద్దు చేశారు. చేనేత రిజర్వు చట్టాన్ని అమలు చేయలేకపోవడం, చేనేతలతో తయారైన వస్త్రాలను కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కొనుగోలు చేయకపోవడం చేేనేత రంగాన్ని నిర్వీర్యం చేయడమే. మూలిగేనక్కపై తాడిపండు పడ్డ చందాన భారత దేశంలో ఎన్నడూ లేనివిధంగా 2017 నుంచి చేనేతపై ఐదు శాతం జీఎస్టీని విధించి ఆ రంగం మనుగడనే ప్రశ్నార్థకం చేశారు.
చేనేతకు సంబంధించిన పట్టు, నూలు, రంగులు, రసాయనాలపై అన్ని రకాల జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలి. చేనేత కార్మి కుల అభివృద్ధి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం 2024-25 గాను బడ్జెట్లో అరకొర నిధులు రూ.200 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. ఈ బడ్జెట్ వాటాల వారిగా చూస్తే ఒక్కోరాష్ట్రానికి ఎంత వస్తుందో కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి ?చేనేత వస్త్రోత్పత్తులు వాడే వినియోగదారులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. కాంబోడియా దేశపు కరెన్సీపై చేనేత మగ్గాన్ని వారి కరెన్సీ నోటుపై ప్రింట్ చేసి గౌరవాన్ని చూపిస్తున్నది. మన దేశంలో మాత్రం చేనేతను ప్రోత్సహించడంలో పాలకులు శీతకన్ను ప్రదర్శిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందిన చేనేతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. చేనేత రంగాన్ని వారసత్వ సంపదగా, ఒక కళగా, అభివృద్ధికి తోడ్పడే వృత్తిగా, ఉపాధి అవకాశం కల్పించే రంగంగా గుర్తించాలి.
చిక్కా దేవదాసు
9391399394
చే’నేత’కేదీ చేయూత?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES