Saturday, December 6, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుశ్రామిక మహిళకు గౌరవమేది?

శ్రామిక మహిళకు గౌరవమేది?

- Advertisement -

పనిప్రదేశాల్లో పెరుగుతున్న లైంగిక వేధింపులు
జీడీపీలో గుర్తింపు లేని ఇంటి పని వాటా 3.1 శాతం
వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో మహిళా కార్మికులే ఎక్కువ
స్కీమ్‌ వర్కర్లలో 90 శాతం వారే
హక్కుల కోసం శ్రామిక మహిళలు సంఘటితం కావాలి

జనాభాపరంగా చూసినా…ఓట్ల పరంగా చూసినా…రెక్కల కష్టం పరంగా చూసినా…ఎలా చూసినా తెలంగాణలో పైచేయి మహిళలదే. పొద్దున ఐదింటి నుంచి రాత్రి పది గంటల దాకా ఇంటా బయటా ఆమెది విరామం ఎరుగని శ్రమ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో కుటుంబ అవసరాలు తీరాలన్నా, పిల్లల చదువులు ముందుకు సాగాలన్నా ఆమె పనిచేయాల్సిందే. కుటుంబం నిలదొక్కు కోవాలంటే రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిందే. అయినా ఆమె శ్రమకు దక్కాల్సిన గౌరవం దక్కకపోగా.. అడుగడుగునా వేధింపులే కొనసాగు తున్నాయి. పని ప్రదేశాల్లో వారి రక్షణ కోసం చట్టాలున్నా వాటి పనితీరు అంతంతే. అంతర్జాతీయ క్రీడాకారుణుల నుంచి రోజువారీ పనులకెళ్లే మహిళల వరకు అడుగడుగునా వివక్ష ఎదురవుతున్న పరిస్థితి. దాన్ని ధిక్కరిస్తే అటు యాజమాన్యం…ఇటు రాజ్యం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న విషయం విదితమే. ఇలాంటి తరుణంలో శ్రామిక మహిళలంతా సంఘటితమై తమ శక్తిని చాటితే పాలకులైనా… యాజమాన్యాలైనా దిగి రావాల్సిందే. ఆ దిశగా మహిళలను చైతన్యపర్చడంలో కార్మిక, మహిళా సంఘాలు ఒక్కటై ముందుకుసాగాల్సిన అవసరం నెలకొంది.

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలో 3.50 కోట్ల మంది ఓటర్లున్నారు. అందులో 1.68 కోట్ల మంది ఓటర్లు మహిళలే. గ్రామీణ తెలంగాణలో వర్కర్‌ పాపులేషన్‌ రేటు 62 శాతంగా ఉంది. అదే పట్టణ ప్రాంతాల్లో చూస్తే వర్కర్‌ పాపులేషన్‌ రేటు 49 శాతంగా ఉంది. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో మహిళా కార్మికుల శాతం పురుషుల సంఖ్యను దాటి పోయిందనీ, ఇటీవలి కాలంలో అది వేగంగా పెరుగుతున్నదని 2025 సమగ్ర నివేదికలో తేలింది. ఓపికతో పనిచేయడం, తక్కువ వేతనంతో ఎక్కువ శ్రమ చేయడం వంటి కారణాల తోనే మహిళా కార్మికుల సంఖ్య పెరుగుతున్నదని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.

సాధారణంగా మహిళలు ఉదయం ఐదు గంటలకే లేచి వంట పని పూర్తిచేసి ఇల్లును శుభ్రపర్చుకుని పిల్లలను తయారు చేసి భర్తకు, పిల్లలకు టిఫిన్‌ బాక్సులు కట్టి హడావిడిగా తినీతినక ఉద్యోగాలకు, పనిప్రదేశాలకు పరుగెత్తుతున్న ధైన్యపరిస్థితి. సాయంత్రం ఇంటికొచ్చాక ఇంటిపనీ, పిల్లలకు సేవలు షరా మామూలే. ఇలా రోజులో తీరిక లేకుండా 16 నుంచి 18 గంటలు శ్రమిస్తూనే ఉన్నారు. ఇటు ఇంటిని, అటు పనిని బ్యాలెన్సింగ్‌ చేయడం వారికి కత్తిమీద సాముగా మారుతున్నది. ఈ క్రమంలోనే మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. మహిళలు చేస్తున్న జీతభత్యం లేని శ్రమ విలువ దేశ స్థూల జాతీయోత్పత్తిలో 3.1 శాతంగా ఉందని గణాంకాలే ఘోషిస్తున్నాయి.

పెరుగుతున్న వేధింపులు..లైంగిక దాడులు
పనిప్రదేశాల్లో మహిళలకు సరైన వసతులు, రవాణా సౌకర్యాలు, రక్షణ చర్యలు ఉండట్లేదు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013 రూపొందినప్పటికీ దాని అమలు తీరు అంతంతే. సంఘటిత, అసంఘటిత, ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళల రక్షణ కోసం ఆయా కార్యాలయాల్లో, సంస్థల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు వేయాలనే నిబంధనలున్నా వాటిలో చాలా అమలు కావడం లేదు. పనిప్రదేశాల్లో 31 శాతం మంది మహిళలు వేధింపులకు గురవుతున్నారనేది నిగూఢ సత్యం. దేశంలో సగటున రోజుకు దాదాపు వంద లైంగిక దాడుల కేసులు నమోదవుతుండటం దీనికి ప్రత్యక్ష ఉదహరణ. అసంఘటిత, వ్యవసాయ, పారిశ్రామిక ప్రాంతాల్లో, ప్రభుత్వ స్కీమ్‌లలో పని చేసే మహిళా కార్మికులు, ఉద్యోగులపై వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయని కార్మిక, మహిళా సంఘాలు ఎత్తిచూపుతున్నాయి.

పనిప్రదేశాల్లో వేధిం పులు ఎదురవుతున్నప్పటికీ బయటకు చెప్పుకుంటే చులకన అవుతామేమోనన్న మానసిక వేదన, ఉద్యోగం పోతే కుటుంబం గడవటం కష్టం అవుతుందనే భావనతో పంటికింద బాధను భరిస్తూ ఉద్యోగాలు చేస్తున్న దుస్థితి నెలకొంది. చాలా పని ప్రదేశాల్లో సరైన టాయిలెట్‌ వ్యవస్థలు కూడా లేవని వర్మ కమిటీ ఎత్తి చూపింది. పనిప్రదేశాల్లో సరైన రక్షణ చర్యలు లేక పోవడం, రవాణా సౌకర్యాలు అందుబాటులో లేకపో వడం వంటి కారణాలతో ఆయా సంస్థల్లో రాత్రి పూట పని చేయడానికి నిరాకరించిన మహిళలు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తున్నది. రాత్రిపూట పని చేసే మహిళా ఉద్యోగులకు, కార్మికుల భద్రత, రవాణా సౌకర్యం వంటి వాటి నుంచి యజామాన్యాలకు మినహాయింపు ఇస్తూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులు జారీ చేయడం ఆందోళనకరం.

సమాన పనికి సమాన వేతన చట్టాలు అమలు చేయాలి
అన్ని రంగాల్లోనూ మహిళల సంఖ్య పెరుగుతున్నది. వేతనాల విషయంలో మాత్రం వివక్ష చూపుతూ చాలా తక్కువ ఇస్తున్న పరిస్థితి. ఈ ధోరణి పోవాలి. సమాన పనికి సమాన వేతన చట్టాలు అమలు చేయాలి. పాఠ్యపుస్తకాల నుంచి లింగవివక్ష కంటెంట్‌ను తొలగించి లింగ సమానత్వంపై సమాజంలో అవగాహన కల్పించాలి. మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు అన్నీఇన్నీ కావు. పనిప్రదేశాల్లో లైంగిక, మానసిక వేధింపులను అరికట్టేందుకు పీఓఎస్‌హెచ్‌ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. మహిళలకు పనిప్రదేశాల్లో భద్రతాచర్యలు తీసుకోని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. రాత్రి విధులు నిర్వర్తించే మహిళా ఉద్యోగుల భద్రత కోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలి. వారికి రవాణా సౌకర్యాలు కల్పించాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై దేశంలో లైంగిక దాడులు పెరుగుతున్నాయి. ఇది ఆందోళనకరం. వాటిని ప్రోత్సహించే శక్తులపై నిఘాపెట్టి కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వ పథకాలు, అసంఘటిత, పారిశ్రామిక, వ్యవసాయ రంగ, ఐటీ, తదితర రంగాల్లో పనిచేసే మహిళలకు భద్రతను పెంచాలి. -తెలంగాణ శ్రామిక మహిళా కన్వీనర్‌ ఎస్వీ.రమ

కేంద్రం విధానాలతో మహిళల ఉపాధికి ఎసరు
అత్యధిక మంది మహిళలు వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో పనిచేస్తున్నారు. పేదలకు పౌష్టికాహారాన్ని అందించే అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం వంటి పథకాల్లో నూటికి 90 శాతం మంది మహిళా కార్మికులే ఉన్నారు. ఐఎల్‌ఓ సంస్థ వారిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు, పెన్షన్‌, మౌలిక సౌకర్యాలు కల్పించాలని సూచించింది. ఇది కేంద్రంలోని బీజేపీ పాలకులకు పట్టడం లేదు. మహిళలకు, పిల్లలకు ఆరోగ్య, శిశు సంరక్షణ సౌకర్యాలు కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ పథకాలకు క్రమంగా మంగళం పాడుతున్నది. వాటిని ప్రయివేటీకరించే పనిలో పడింది. తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర, నాందీ ఫౌండేషన్లకు అప్పజెప్పి చేతులు దులుపుకునే పనిలో పాలకులున్నారు. నగరాలను, పట్టణాలను అద్దంలా తీర్చిదిద్దే పంచాయతీ, మున్సిపల్‌ కార్మికుల్లో మెజార్టీ శాతం మహిళా కార్మికులే. పార్కుల నిర్వహణలోనూ వారిదే కీలక పాత్ర. వీరికి కనీస వేతనాలు అందట్లేదు. గౌరవ వేతనాలే దిక్కు. అదీ నెలానెలా అందేది కష్టమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -