తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఐదురోజులకే ముగిసాయి. నిరవధికంగా వాయిదా పడ్డాయి. పదమూడు బిల్లులు, ప్రభుత్వ తీర్మానాలు ఆమోదం పొందాయి. 31 ప్రశ్నలు, 82 అనుబంధ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పింది. 66మంది సభ్యులు మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ చట్టం, హిల్ట్, తెలంగాణ రైజింగ్-2047, కృష్ణాజలాలు, పట్టణపరిపాలన, విద్య, పన్నులు తదితర విషయాలపైనా స్వల్పకాలిక చర్చలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా పేద ప్రజలు, కూలీలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ పథకానికి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయడం అభినందనీయం. ఇదంతా ఒక పార్శ్యమైతే, మరోవైపు చర్చలు, వాటి సారాంశం.
ఈ సమావేశాల్లో ప్రతిపక్షం లేకుండానే సభ జరగడం గమనార్హం. గత ప్రభుత్వంలో జరిగిన దానికి భిన్నంగా ఇక్కడ జరిగింది. బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో ప్రతిపక్షం కాంగ్రెస్‌ను అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇప్పుడు ప్రతిపక్షమే తనంత తాను సభనుంచి వెళ్లిపోయింది. తద్వారా ప్రజాసమస్యలను సభలో ఎజెండా చేసే గురుతర బాధ్యత నుంచి తప్పుకుంది. అసెంబ్లీ పనిదినాలు సైతం తక్కువే. సాధారణంగా రెండు వారాలకుపైగా జరుగుతుంటాయి. గత పదేండ్లుగా ఇదే తంతు నడుస్తున్నది. శాసనసభ వ్యవహారాలు నియామవళి ప్రకారం కాకుండా ప్రభుత్వాల ఇష్టానుసారం జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాలను ఉమ్మడి రాష్ట్రంలో సాధాణంగా కనీసం 45 రోజులు నిర్వహించేవారు. కానీప్పుడు ఇరవై రోజులకు మించి జరగడంలేదు. అవసరమైన ప్రోటోకాల్ బిజినెస్ పూర్తి చేసుకుని నాలుగైదు అంశాలు, బిల్లులు, సవరణలు కానించుకుని సమావేశాలను ముగించే తంతు అలవాటైంది. ప్రజాసమస్యలను గుర్తించి, వాటిని సభలో కూలంకషంగా చర్చించి పరిష్కారాలను వెతికే ఆస్కారమే ఉండటం లేదు. రాజకీయ కక్షలు, ఇతర అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. పేదల ఆశలు, ఆకాంక్షలను పరిష్కరించే వేదికలుగా చట్టసభలు ఉండాలి.
గంటకు లక్షలాది రూపాయల ప్రజాధనం ఖర్చవుతున్న తరుణంలో ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలు స్వల్పమే. ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు హక్కుల గురించి బాధ్యతగా చర్చించాల్సిన సభ సూటిపోటీ మాటలు, వ్యంగ్య వాగ్భాణాలతో కాలం వృధా చేస్తున్నది. ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అంటూ చర్చలకు రాజకీయరంగు పులిమి చిలువలు పలువలయ్యేలా అవకాశమిస్తుండటంతో సభా గౌరవం మంటగలుస్తోంది. 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న శాసనసభలో ప్రతిరోజూ అసెంబ్లీకి వచ్చే సభ్యుల సంఖ్య యాభై నుంచి అరవై శాతమే. తొలిరోజు హడావిడి మినహా మిగతా రోజుల్లో విప్ జారీచేస్తేగాని సభలో చూసే అదృష్టం గగనమే. తమ ప్రశ్న వచ్చిన ప్పుడో, తప్పనిసరై బిల్లులపై చర్చలో పాల్గొనాలని చెప్పినప్పుడో ప్రత్యక్షమవుతారు. ప్రశ్నోత్తరాలైనా, జీరో అవర్ అయినా, స్వల్పకాలిక చర్చ అయినా లోతుగా చర్చించి మంచి, చెడులను విశ్లేషించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నా, అల్లాటప్పా ప్రసంగాలతో గౌరవ సభ్యులు ప్రజల్లో పలుచనవు తున్నారు. ముందస్తుగా విషయాలపై అధ్యయనం చేయడం, విశ్లేషిం చడం, లోటుపాట్లను స్పీకర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లి సరిచేయించే ప్రక్రియను ఒంటపట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బీఆర్‌ఎస్ తనకు తానుగా సభకు దూరమైంది. తద్వారా ప్రజాసమస్యలను వదిలేసినట్టయింది. కవిత రాజీనామా రాష్ట్ర రాజకీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రజలను ప్రభావం చేసే అనేక బిల్లులు, చట్టాలు, సవరణలపై చర్చలు నడిచాయి. ప్రధానపక్షం లేకపోవడం లోటుగానే అనిపించింది. శషబిషలకు పోవడం, ఒకరిపైఒకరు విమర్శలకు దిగడంతో సభ జరిగిన రోజుల్లోనూ సమయం వృధా అయింది. సభ్యుల మధ్య సమన్వయం కొరవడింది. ఇది ఇటు సర్కారు నుంచి అటు ప్రతిపక్షం నుంచీ కనిపించింది. అరోపణలు, విమర్శలతో సభను పక్కదోవ పట్టించడమే గాక ప్రజాసమస్యలను పక్కనపెట్టడం ఏమాత్రం సహేతుకం కాదు. విలువైన సభాసమయాన్ని సద్వినియోగపరుచుకోకుండా మీడియాలో చోటుచేసుకునేందుకు దురుసుగా వ్యవహరించే అలవాటును ప్రజలు గమనిస్తున్నా రు. ఈసారీ సమావేశాల్లో సభ్యులకు ఆయా సర్కారీ బిల్లుల కాపీలు, ఇతర సమాచారం సమయానుకూలంగా అందలేదనే విమర్శలురానే వచ్చాయి. శాసనసభా వ్యవహారాలు సక్రమంగా నడిచేలా బాధ్యులు బాధ్యత తీసుకోవాలి. సభానాయకుడితోపాటు ప్రతిపక్షనేతా సహకరించాలి. వీరిద్దరూ సభకు ఆదర్శంగా నిలవాలి. సభాచర్చలు చూస్తుంటే వామపక్షాల బలం సరిగా లేని కారణంగా ఇలా జరుగుతున్నదని అనిపిస్తున్నది. అసెంబ్లీ ప్రజాగొంతుక కావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నది.
ఇదేం చట్టసభ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



