Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంహిమాలయ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు చర్యలేవీ ?

హిమాలయ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు చర్యలేవీ ?

- Advertisement -

ప్రశ్నించిన సీపీఐ(ఎం) నేత, ఎమ్మెల్యే తరిగామి
వాతావరణ న్యాయం కోసం ఉద్యమించాలని పిలుపు
శ్రీనగర్‌ :
ప్రకృతిని ఒక వస్తువుగా మార్చిన దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిందిగా ప్రజలకు పర్యావరణ కమిటీ చైర్మెన్‌, సీపీఐ(ఎం) నేత, ఎమ్మెల్యే ఎం.వై.తరిగామి పిలుపునిచ్చారు. వినూత్నమైన పర్యావరణవాద స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లోని చిసోటి పద్దర్‌లో సంభవించిన క్లౌడ్‌ బరస్ట్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారనీ, మరింతమంది గల్లంతయ్యారనీ, పెను విధ్వంసం, అపార నష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి వైపరీత్యం నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లోని హిమాలయ ప్రాంతంలో ఆకస్మిక వరదలు, కొండచరియలు, మంచుపెళ్ళలు విరిగిపడడం వంటి ముప్పులు పొంచి వున్నందున మొత్తంగా వాతావరణ మార్పులపై, పర్యావరణ పరిరక్షణపై దృష్టి కేంద్రీకరించాల్సిన సమయం ఆసన్నమైందని తరిగామి వివరించారు. ”గాలులు మనల్ని హెచ్చరిస్తున్నాయి, నదులు ఆక్రందనలు పెడుతున్నాయి.

ఇది కేవలం విపత్తు కాదు, వ్యవస్థాగత మార్పుల కోసం ఇచ్చిన స్పష్టమైన పిలుపు” అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వాతావరణ న్యాయం కోసం సమైక్యంగా పోరాటం సాగించాలనీ, ఇందుకు పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు, కార్మికులు, విద్యార్ధులు, మేథావి వర్గం అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. ఈ విషాద ఘటనపై అత్యవసరంగా, నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేశారు. జమ్మూ ప్రాంతంలోనిఎత్తైన ప్రాంతాల్లో క్లౌడ్‌ బరస్ట్‌లు, ఆకస్మిక వరదలు, భారీ వర్షపాతం గురించి ముందుగానే వాతావరణ విభాగం హెచ్చరికలు ఉన్నా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఇది నేరపూరితమైన నిర్లక్ష్యం కిందకే వస్తుందన్నారు. దీనికి జవాబుదారీ ఎవరో నిర్ణయించి ఆ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించడం, ప్రజల భద్రత పట్ల ఆందోళన లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలని తరిగామి అన్నారు. ఇలాంటి విపత్తులను కేవలం ప్రకృతి వైపరీత్యాలు అనలేమనీ, నిర్లక్ష్యంగా సాగుతున్న వనరుల దోపిడీ, అడవుల నరికివేత, అనధికారికంగా కొండరాళ్ళ కొట్టివేత, భూమిని ఒక వ్యాపార వస్తువుగా మార్చడం ప్రధాన కారణాలని చెప్పారు. ప్రకృతి యావత్తూ న్యాయం కోసం విలపిస్తున్నా, పాలక వర్గాలకు మాత్రం ఏమీ పట్టడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. హిమాలయ ప్రాంతంలో పర్యావరణ సంస్థలు లేదా విభాగాలు ఎలాంటి సర్వేలైనా నిర్వహించాయా? క్లౌడ్‌బరస్ట్‌ల నివారణకు, ప్రజల భద్రతకు చర్యలేమైనా సిఫారసు చేశారా? అని ఆయన ప్రశ్నించారు. జమ్మూకాశ్మీర్‌కు వాతావరణ న్యాయం జరగాలంటే కొన్ని చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన అన్నారు. వాతావరణ విధాన రూపకల్పనలో సామాన్యులకూ పాత్ర కల్పించాలని చెప్పారు. వాతావరణ ముప్పులను తగ్గించే వ్యూహాల్లో తమ వాణి వినిపించేందుకు, వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలతో పాటూ పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేసే కార్యకర్తలు, ఎన్జీఓలను కూడా చేర్చుకోవాలనీ, వారితో సమన్వయం చేసుకోవాలన్నారు. వాతావరణ నష్ట పరిహారాల కోసం కేంద్రం, కేంద్ర పరిపాలిత యంత్రాంగం తమ యంత్రాంగాలను వ్యవస్థీకరించుకోవాలని ఆయన కోరారు. బాధితులకు నష్టపరిహారం అందేలా వారికి పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అడవుల నరికివేతను అడ్డుకునేందుకు, నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు, కార్పొరేట్ల లూటీ నుంచి పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించేందుకు ప్రజా ఉద్యమం ప్రారంభించాలని ఆయన తెలిపారు. ముమ్మరంగా వర్షాలు పడుతున్నపుడు ఆ వాస్తవిక తీవ్రతను గుర్తించేందుకు వాతావరణ ఉపగ్రహాలు, అడ్వాన్స్‌డ్‌ డాప్లర్‌ రాడార్లును మోహరించడం వంటి సత్వర వాతావరణ హెచ్చరికల వ్యవస్థలు అమలు చేయాలన్నారు. మొబైల్‌ ఫోన్లద్వారా సకాలంలో హెచ్చరికలు జారీచేయాలని సూచించారు. ప్రజలందరికీ తక్షణమే చేరేలా స్థానిక ప్రసార మాధ్యమాల్లో, లౌడ్‌ స్పీకర్ల ద్వారా సమాచారాన్ని అందించడానికి ప్రయత్నించాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad