– గిగ్‌వర్కర్ల యూనియన్ల ఆగ్రహం
– గంటకు నికర ఆదాయం రూ.81 మాత్రమే
– డెలివరీ కార్మికులకు సామాజిక భద్రత కరువు
హైదరాబాద్ : గిగ్‌వర్కర్లకు గౌరవమైన వేతనం, ప్రోత్సాహకాలు దక్కుతున్నాయని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ చెప్పేది తప్పని గిగ్ వర్కర్ల యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీపిందర్ గోయల్ తన కంపెనీకి చెందిన తాత్కాలిక ఉపాధి విధానం ‘గిగ్ మోడల్’ ను సమర్థించుకుంటూ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ అసోసియేషన్ (డీజీపీడబ్ల్యూఏ) తప్పుబట్టింది. డెలవరీ కార్మికుల ప్రస్తుత పని పరిస్థితులు ఏమాత్రం గౌరవప్రదంగా లేవని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో భారతదేశంలో వేగంగా పెరుగుతోన్న క్విక్ కామర్స్, డెలివరీ కార్మికుల ప్రయోజనాలపై దీపిందర్ గోయల్, గిగ్‌వర్కర్ల యూనియన్ల మధ్య జరుగుతున్న చర్చ తీవ్ర వేడెక్కినట్లయ్యింది.
”జొమాటోలో 2025లో డెలివరీ పార్ట్‌నర్ సగటు వేతనం రూ.102గా ఉంది. 2024లో ఇది రూ.92గా నమోదయ్యింది. డెలివరీ భాగస్వాములు ఒకవేళ రోజుకు 10 గంటలు చొప్పున నెలలో 26 రోజులు పనిచేసినా ఒక్కో డెలివరీ ఏజెంట్ రూ.26,500 ఆర్జించొచ్చు. అందులోంచి పెట్రోల్, నిర్వహణ ఖర్చులు మినహాయించినా రూ.21,000 వస్తుంది. దీనికి టిప్ అదనం. ఫుల్ టైమ్ వర్క్‌కు ప్రత్యామ్నాయంగా గిగ్ వర్క్ మోడల్ రూపుదిద్దుకుంది. ఉద్యోగితో సమానంగా ప్రయోజనాలు, స్థిరమైన వేతనాలు కోరడం ఈ మోడల్‌కు ఏమాత్రం సరిపోదు.” అని దీపిందర్ గోయల్ వ్యాఖ్యలు చేశారు.
దీపిందర్‌కు యూనియన్ల కౌంటర్..
దీపిందర్ గోయల్ వ్యాఖ్యలను గిగ్ వర్కర్ల యూనియన్ సవాల్ చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని డీజీపీడబ్ల్యూఏ తెలిపింది. ”పెట్రోల్, వాహన నిర్వహణ ఖర్చులను తీసివేస్తే వాస్తవానికి గంటకు నికరంగా రూ.81 మాత్రమే వస్తుంది. దీని ప్రకారం.. నెలకు 26 రోజులు, రోజుకు 10 గంటల చొప్పున కష్టపడి పనిచేసే వ్యక్తికి సుమారు రూ.21,000 మాత్రమే లభిస్తుంది. డెలివరీ భాగస్వాములకు వేతనంతో కూడిన సెలవులు (పెయిడ్ లీవ్స్), సామాజిక భద్రత లేదా గ్యారెంటీ ఉన్న ప్రమాద బీమా లేవు. గోయల్ చెప్పిన అదనపు ఆదాయం చాలా పరిమితం. కేవలం 5 శాతం ఆర్డర్లకు మాత్రమే టిప్స్ వస్తున్నాయి.” అని డీజీపీడబ్ల్యూఏ ఎత్తి చూపింది.
డెలివరీ భాగస్వాములకు సామాజిక భద్రతతో పాటు ప్రోత్సాహకాలు కల్పించాలని, 10 నిమిషాల్లో డెలివరీ టార్గెట్ లాంటి పని ఒత్తిడిని తగ్గించాలనే డిమాండ్‌లతో ఇటీవల ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బెస్ట్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్‌లు సమ్మె చేపట్టాయి. డిసెంబర్ 25న, 31న రెండు రోజుల పాటు దేశ వ్యాప్తంగా చేపట్టిన సమ్మె పిలుపునతో ఫుడ్ యాప్‌లకు ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం ముందు రోజు భారీగా ఆర్డర్లు ఉండటంతో వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడొచ్చనే భయంతో ఆయా యాజమాన్యాలు గిగ్‌వర్కర్లకు స్వల్ప ప్రోత్సాహకాలు పెంచి తాత్కాలికంగా బయటపడ్డాయి. తాజాగా గిగ్‌వర్కర్లు మళ్లీ ఆందోళనకు సంకేతాలు ఇవ్వడం విశేషం.
జొమాటో సీఈఓ చెప్పింది తప్పు..!
- Advertisement -
- Advertisement -



