Thursday, October 23, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'రిటైర్డ్‌' బెనిఫిట్స్‌ అందేదెప్పుడు?

‘రిటైర్డ్‌’ బెనిఫిట్స్‌ అందేదెప్పుడు?

- Advertisement -

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ విభాగాల్లో ప్రజలకు సవ్యంగా అందాలంటే ఉద్యోగుల పాత్ర కీలకం. వారికి చెల్లించాల్సినటువంటి జీత భత్యాలు, ఇతరత్రా ప్రయోజనాలను సర్కార్‌ సకాలంలో చెల్లించాలి. అప్పుడే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారు. వారు సక్రమంగా పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గత ప్రభుత్వం ఉద్యోగులను సరిగా పట్టించుకోలేదు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు చెల్లింపుతో బాటు, బకాయిలను చెల్లిస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోగా పిఆర్‌సి అమలు చేస్తామని హామీ నిచ్చింది. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆస్పత్రుల్లో, వైద్యమందించే విధంగా హెల్త్‌ కార్డులు జారీచేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల సందర్భంగా హామీలు గుప్పించింది.

ఎంతో ఆశపడిన ఉద్యోగులు తమవంతు కృషిచేసి కొత్త ప్రభుత్వాన్ని గెలిపించారు. కానీ, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేండ్లవుతున్నా సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఉద్యోగులవి గొంతెమ్మ కోర్కెలు కాదు, సర్కార్‌ తీర్చలేనివి అంతకన్నా కాదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రిటైర్‌మెంట్‌ తర్వాత బెని ఫిట్స్‌ చెల్లించవలసి వస్తుందని, తాను గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 58 ఏండ్ల నుండి 61 ఏండ్లకు మార్చి 2021 నుండి ఫిబ్రవరి 2024 వరకు పెంచింది. ఉద్యోగ విరమణ వయస్సు 61 ఏండ్లు మార్చి 2024 నుండి ప్రారంభమైంది. ప్రతి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిదివేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్‌ అవుతున్నారు.

2024 మార్చి నుండి సెప్టెంబర్‌ 2025 వరకు దాదాపుగా 12 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్‌ అయ్యారు. వారికి రావలసిన పదవీవిరమణ ప్రయోజనాలైన గ్రాట్యూటీ, కమ్యుటేషన్‌, ఈ.ఎల్‌. హాప్‌-పే లీవ్‌ ఎన్కా ష్మెంట్‌ లీవ్స్‌, జిపిఎఫ్‌, టి.ఎస్‌.జి.ఎల్‌.ఐ, జిఐఎస్‌, పీఆర్సి ఏరియర్స్‌, సర్వీసులో ఉన్నప్పుడు చేసుకున్నటువంటి సరెండర్‌ లీవ్స్‌ తదితర బిల్లుల మొత్తం రిటైర్‌ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సి ఉన్నది. వారి హోదా, వారి సర్వీస్‌ ఆధారంగా వారు నిల్వ చేసుకున్న జిపిఎఫ్‌ నిలువలు దాదాపుగా రూ.35 లక్షల నుండి 75 లక్షల వరకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రావాల్సి ఉన్నవి. ఇందులో గ్రాట్యూటీ తప్పు మిగతా సొమ్ము ఉద్యోగులు దాచుకున్నదే. వారు పదవీ విరమణ తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. ఉద్యోగం చేసినంత కాలం ఉద్యో గులు తాము దాచుకున్న డబ్బులు అందుతాయని, ప్రభుత్వం నుండి గ్రాట్యుటీ లభిస్తుందని ఆశిస్తారు.

పిల్లల చదువులు, పెండ్లిళ్లు, సొంత ఇంటి నిర్మాణం, చేసిన అప్పులు తీర్చడం ఇలా ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల ఆశలు అడియాశలు చేస్తున్నది. ఉద్యో గులకు అందించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వకుండా ఉండడం వలన ఎంతోమంది మనో వేదనకు గురై అనేక రోగాల బారిన పడుతున్నారు. మానసికక్షోభను అను భవిస్తూ చివరికి కొంతమంది చనిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాపితంగా పదిహేడు మంది చనిపోయినా సర్కార్‌ పట్టించుకోలేదు. ఉద్యోగి పదవి విరమణ చేసిన రోజునే ఆయనకు ఇవ్వవలసిన ఆర్థిక ప్రయోజనాలను అందించి శాలువాతో సత్కరించి ప్రభుత్వ వాహనంలో ఇంటికి పంపింస్తామని గత ప్రభుత్వం హామీనిచ్చింది. కొత్త సర్కార్‌ కొలువు దీరినా అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ విధానం అమలు కావడం లేదు.

మార్చి 2024 నుండి ప్రతినెలా రిటైర్డ్‌ ఉద్యోగులు పెరుగుతుండడం వలన బకాయిలు కూడా పెరిగి పోతు న్నాయి. రాష్ట్రంలో రిటైర్‌ మెంట్‌ అయినవారు 12వేల మంది ఉన్నారు. గత జూన్‌లో ప్రకటించిన డి.ఏ. ఏరియర్స్‌ను ఏప్రిల్‌ 2024 నుండి ఆగస్టు 2025 వరకు రిటైర్డ్‌ అయిన వారికి 28 వాయిదాల్లో చెల్లించాల్సినవి కూడా చెల్లించ లేకపోతున్నారు. గత ఏప్రిల్‌ 2025 నుండి రిటైర్‌ అయినటు వంటి వారికి కేవలం నెలవారి పెన్షన్‌ మాత్రమే చెల్లిస్తు న్నారు. ఈ బెనిఫిట్స్‌పై ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఆ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టివిక్రమార్క పెండింగ్‌ బకాయిలు విడుదల చేయుటకు మే నుండి ప్రతి నెలా రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీనిచ్చారు.

ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలు చెల్లించకపోవడంతో కొంతమంది ఉద్యోగులు విసిగిపోయి హైకోర్టును ఆశ్రయించారు. వారికి ఆరు, కొంత మందికి పదివారాల్లో చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించినా పట్టించుకోవడం లేదు. కోర్టు ఆదేశాల ప్రకారం చెల్లించక పోవడం వలన చాలామంది కోర్టు ధిక్కార కేసులు వేసినా స్పందన అంతంత మాత్రమే. మాట మాట్లాడితే సభులు, సమావేశాలు, వేదికలపై తమది ప్రజాప్రభుత్వమని చెప్పుకోవడం కాదు, ఆచరణలో నిరూపించాలి. ఇప్పటికైనా రిటైర్మెంట్‌ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్‌ను అన్నింటిని త్వరగా చెల్లించి పెన్షనర్ల జీవితాలను, వారి కుటుంబాలను కాపాడాలి.

కడారి భోగేశ్వర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -