మంత్రి, ఎమ్మెల్యే నిధులు ఏమైనట్టు..?
ఏడాదైనా నిధులు కేటాయించని వైనం
కొత్తగా మళ్లీ కేటాయింపులతో నూతన ప్రతిపాదనలు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మామిడి రైతులకు మార్కెట్ సదుపాయం కల్పించడానికి వరంగల్ ఎనుమాముల ప్రాంతంలోని ముసలమ్మ కుంటలో మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పినా ముందుకు పడలేదు. మార్కెట్ నిర్మాణానికి మంత్రి, ఎమ్మెల్యే నిధులను సమకూర్చుతున్నట్టు ప్రకటింటి, ఏడాదైనా ఆ నిధులను ఇవ్వకపోవడంతో ఈ మార్కెట్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అన్న చందంగా వుంది. ముసలమ్మకుంటలో మార్కెట్ నిర్మాణానికి రూ.11 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినా నేటికీ నిధులు మంజూరు కాలేదు. ముసలమ్మకుంటలో సౌకర్యాల లేమితో తాత్కాలికంగా మార్కెట్‌ను ఆజాంజాహి మిల్లు గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ ఏడాది ముసలమ్మ కుంటలో మామిడి మార్కెట్‌ను నిర్వహించడానికి మార్కెటింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 35,265 ఎకరాలలో మామిడి తోటలు రైతులు సాగవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 12,350 ఎకరాలలో సాగు చేస్తుండగా, ములుగు జిల్లాలో అత్యల్పంగా 696 ఎకరాలలో మాత్రమే సాగు చేస్తున్నారు. రెండోస్థానంలో జనగామ జిల్లాలో 8,250 ఎకరాలల్లో వరంగల్‌లో 6,913 ఎకరాలు, హన్మకొండలో 5,900 ఎకరాలు, భూపాలపల్లిలో 1,156 ఎకరాలు సాగు చేస్తున్నారు. దీనికోసమే మార్కెట్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ముసలమ్మకుంట మామిడి మార్కెట్‌ను ఎనుమాముల మార్కెట్‌లో భాగంగా చూపించి రూ. 11 కోట్ల ప్రతిపాదనలను సమర్పించినా మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు నిధులు ఇవ్వడానికి నిరాకరించారు.
దీంతో వరంగల్ మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణుడు తాత్కాలిక రోడ్డు, మార్కెట్ లోపలి గ్రౌండ్ లెవలింగ్‌కు రూ.56 లక్షలతో కొత్తగా ప్రతిపాదనలను సమర్పించారు. ఈ నిధులను వెంటనే మంజూరు చేయడానికి ఉన్నతాధికారులు సుముఖంగా వున్నట్టు సమాచారం. ఈ ఏడాది మామిడి మార్కెట్‌ను ముసలమ్మకుంటలోనే నిర్వహించడానికి మార్కెటింగ్ అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. రూ.56 లక్షల నిధులను ఒకటి రెండ్రోజుల్లో ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు తెలిసింది. ఈ నిధులతో ముసలమ్మకుంట మార్కెట్‌కు రోడ్డు సౌకర్యంతోపాటు 10 ఎకరాల విస్తీర్ణంలో వున్న ఈ మార్కెట్‌లోపలి వైపు గ్రౌండ్ లెవలింగ్ చేయడానికి వీలవుతుంది.
మంత్రి, ఎమ్మెల్యేల నిధులు ఏమైనట్టు..?
గత ఏడాది మార్చిలో ముసలమ్మకుంటలో మామిడి మార్కెట్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి కొండా సురేఖ రూ.20 లక్షలు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు రూ.10 లక్షలు ఇస్తామన్న నిధులు ఏడాది గడిచినా ఇవ్వకపోవడంతో కనీసం అత్యంత అవసరమైన రోడ్డు నిర్మాణం సైతం చేసుకోలేకపోయారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ముసలమ్మకుంట నుంచి మామిడి మార్కెట్‌ను గత ఏడాది నర్సంపేట రోడ్డులోని ఆజాంజాహి మిల్లు గ్రౌండ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. మంత్రి, ఎమ్మెల్యే ప్రకటించిన నిధులిస్తే కనీసం రోడ్డు పనులైనా పూర్తి చేస్తే ఈ ఏడాది ముసలమ్మకుంట మార్కెట్‌లో మామిడి క్రయవిక్రయాలు జరిగేవని వ్యాపారులు, రైతులు చెబుతున్నారు.



