Thursday, July 31, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిరెండు దశాబ్దాల కల నెరవేరిన వేళ...

రెండు దశాబ్దాల కల నెరవేరిన వేళ…

- Advertisement -

నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి 2003వ సంవత్సరంలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వేలాది నిరు ద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. 2004 ఏప్రిల్‌లో పరీక్ష రాశారు. అదే ఏడాది జూన్‌లో ఫలితాలు కూడా ప్రకటిం చారు. తర్వాత నెలలో నియామక ప్రక్రియ ఉంటుందని చెప్పిన ప్రభుత్వం, ఆ నియామకాలను 2005 నవంబర్‌లో పూర్తి చేసింది. అయితే 2004లో జనవరి ఒకటి నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమల్లోకి వచ్చిన నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని, అదే ఏడాది సెప్టెంబర్‌ ఒకటి నుండి అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో 2003లో విడుదలైన నోటిఫికేషన్‌లో ఈ నూతన పెన్షన్‌ పథకాన్ని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కేవలం నియాకపు తేదీని పరిగణించింది. డీఎస్సీ-2003 వారికి జీపీఎఫ్‌ స్థానంలో సీపీఎస్‌ ఖాతా ప్రారంభించింది. దీంతో ఆందోళనకు గురైన డీఎస్సీ-2003 ఉపాధ్యాయులు వారి సంఘాల సహాయంతో ప్రభుత్వ పెద్దలను, అధికారులను కలిసి అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ీ ఫలితం లేకపోయింది. పైగా వారికి నూతన పెన్షన్‌ పథకాన్నే అమలు చేసింది. పాత పెన్షన్‌ స్కీమ్‌నే కొనసాగించాలని విజ్ఞప్తులు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

దీంతో డీఎస్సీ-2003 ఉపాధ్యాయులే నాయ కులుగా, కార్యకర్తలుగా ”డీఎస్సీ-2003 పాత పెన్షన్‌ సాధన సమితి”ని ఏర్పాటు చేసుకుని ఉద్యమాన్ని ప్రారంభించారు. పాత పెన్షన్‌ అమలుకు రాజకీయ నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యం కారణంగా, తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయం కోరుతూ 2019లో సీనియర్‌ న్యాయవాది, కీర్తిశేషులు రామచంద్రరావు ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. ఆనాటి నుండి హైకోర్టులో సుదీర్ఘ కాలంలో అనేక వాద ప్రతివాదనలు జరుగుతున్న కాలంలోనే, కేంద్ర ప్రభుత్వం 2023లో ఇదే తరహాలో నియామక ప్రక్రియ ఆలస్యం చేసింది. దీంతో కొంతమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నూతన పెన్షన్‌ విధానంలోకి అనివార్యంగా నెట్టివేయాల్సి వచ్చింది. అయితే వారికి పాత పెన్షన్‌కు అవకాశం కల్పిస్తూ మెమో నంబర్‌ 57/5 కేంద్రం విడుదల చేసింది. దీంతో పాత పెన్షన్‌ను కొంతమందికి అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఇదే సమస్యను ఎదుర్కొంటున్న 2023 ఉద్యోగులకు ఇన్నాళ్ల తర్వాత హైకోర్టు న్యాయం చేసింది. పాత పెన్షన్‌నే అమలు చేయాలని మొన్న తన తుది తీర్పును వెలువరించింది. దీంతో ఉద్యోగులకు పెన్షన్‌ పథకం నిర్ధారించే సందర్భంలో ఆ ఉద్యోగి నియామక నోటిఫికేషన్‌ తేదీలనే పరిగణించా లని ఈ తీర్పుతో కోర్టు స్పష్టతను ఇచినట్లయింది.

ఈ తీర్పు వలన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది వేల మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరుతుంది. దీనివలన కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలో పనిచేసే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం నిర్వహణా సంస్థ ఎన్‌పీఎస్‌, ఎన్‌ఎస్‌డీఎల్‌ నుండి, ప్రభుత్వం, ఉపాధ్యాయుల భాగస్వామ్య పద్ధతిలో పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి జీపీఎఫ్‌కు బదలాయించేందుకు కేంద్రం అనుమతి ఇస్తుంది. పైగా ఇన్ని వేల మంది ఉపాధ్యాయులకు వారి పదిశాతం చందాకు తోడుగా ప్రభుత్వం కలిపి ఇస్తున్న పద్నాలుగు శాతం చందా డబ్బులు ఇక నుండి వీరి పేరు మీద పెన్షన్‌నిధికి జమ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ మేరకు ప్రభుత్వానికి నెలకు సుమారు పదికోట్ల నుండి పదమూడు కోట్ల రూపాయల వరకూ ఖర్చు తగ్గుతుంది. ఈ విధంగా న్యాయం కోసం ఇన్నేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు వందల మంది ఉపాధ్యాయులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇన్నేండ్ల తర్వాత తుది తీర్పు వెలువడటంతో రెండు దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న వారి కల నెరవేరినట్లయింది.

– అచ్చా విజయ్‌కుమార్‌,
సంక్రాంతి రవికుమార్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -