Tuesday, June 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుస్థానిక ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారు?

స్థానిక ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారు?

- Advertisement -

– ఏడాదిన్నరగా ఏం చేస్తున్నారు : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
– వాదనలు పూర్తి… తీర్పు వాయిదా
– బీసీ రిజర్వేషన్ల ఖరారుకు గడువు కావాలి
– సర్కారు ఏర్పాట్లు చేస్తే నిర్వహిస్తాం: ఎన్నికల సంఘం
– సర్పంచ్‌ పదవుల్లో కొనసాగేలా ఉత్తర్వులివ్వాలి : పిటిషనర్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవులకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పటిలోగా నిర్వహిస్తారనీ, వాటి పదవీ కాలం ముగిసి 18 నెలలయ్యిందనీ, ఏడాదిన్నర కాలంగా ఎన్నికలు నిర్వహించకుండా ఏం చేస్తున్నారంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గతేడాది జనవరిలో సర్పంచ్‌ పదవులు ఖాళీ అయ్యాయనీ, ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలున్నాయని గుర్తు చేసింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన విచారణ సమయంలో రెండు నెలలు గడువు కోరిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ గడువు కోరడం ఏమిటని ప్రశ్నించింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ పలువురు మాజీ సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు సోమవారం పూర్తి అయ్యాయి. దీంతో తీర్పును వాయిదా వేస్తున్నట్టు జస్టిస్‌ మాధవీదేవి వెల్లడించారు. నల్లగొండ జిల్లా మల్లెపల్లి సర్పంచ్‌ పార్వతి, కుర్మపల్లి సర్పంచ్‌ శ్రీనివాస్‌, జనగామ జిల్లా కాంచనపల్లి సర్పంచ్‌ విజయ, నిర్మల్‌ జిల్లా తల్వెడ సర్పంచ్‌ అనిల్‌కుమార్‌, కరీంనగర్‌ జిల్లా చంగర్ల సర్పంచ్‌ వేణుగోపాల్‌, నిజయతీగూడెం సర్పంచ్‌ మురళీధర్‌ వేసిన పిటిషన్లపై తీర్పును వాయిదా వేశారు.
అధికారుల పాలనలో పరిష్కారం కాని సమస్యలు
పిటిషనర్ల అడ్వకేట్‌ భాస్కర్‌రెడ్డి వాదిస్తూ గతేడాది జనవరి 31తో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిందన్నారు. ఏడాదిన్నర కాలంగా ఎన్నికలు నిర్వహించలేదని వివరించారు. గడువు అయిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగంలోని 243ఈ, 243కే అధికరణాలను పాలకులు ఉల్లంఘించారని చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం-2018 నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందన్నారు. సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసి ఏడాదిన్నర కాలం అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. గ్రామాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలు పేరుకుపోయాయని చెప్పారు. సమస్యలు పరిష్కారం చేయడంలో తీవ్ర జాప్యం అవుతోందన్నారు. గ్రామాల్లో పనులు చేపట్టేందుకు రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులను అందిస్తామనీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు సర్పంచ్‌లుగా తమ సొంత డబ్బులు ఖర్చు చేశారన్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు ఇంకా గడువు కావాలనే యోచనలో ప్రభుత్వం ఉంటే ఎన్నికలు నిర్వహించే వరకు సర్పంచ్‌లకు పాలనా బాధ్యతలు అప్పగించేలా మధ్యంతర ఆదేశాలు వెలువరించాలని కోరారు. గత డిసెంబర్‌లో జరిగిన విచారణ సందర్భంగా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా తేదీలు వెల్లడిస్తామని రాష్ట్రప్రభుత్వం చెప్పినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఏడాదిన్నర కాలంగా గ్రామ పంచాయతీలో పాలన కుంటుపడిందన్నారు. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు. పంచాయతీలకు ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గాలు ఉండి తీరాలని సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయన్నారు. పాలకవర్గం లేకుండా ఉండొద్దని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయని వివరించారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోయినప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు అధికారం ఉందన్నారు.
30 రోజులు సమయమివ్వండి : అదనపు అడ్వకేట్‌ జనరల్‌
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు మరో 30 రోజుల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ విద్యాసాగర్‌ వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు జరిగితే, ఎన్నికల నిర్వహణకు తమకు రెండు నెలల గడువు కావాలన్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉందన్నారు. వాదనలపై స్పందించిన హైకోర్టు, ఏడాదిన్నర కాలంగా ఎన్నికలు జరపకుండా ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం ఆలస్యం చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహించే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది కదా? అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలింగ్‌ కేంద్రాలు, భద్రత వంటి అంశాల్లో ప్రభుత్వ సహకారం అవసరమని ఎన్నికల సంఘం సమాధానం చెప్పింది. ఇరువైపులా వాదనలు ముగియడంతో గ్రామపంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని దాఖలైన పిటిషన్లపై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -