– ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదవీ కాలం ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పటిలోగా నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని కోరింది. గతంలోనే ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలంది. రాజ్యాంగంలోని అధికరణ 243(ఈ) ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని తాము మధ్యంతర ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేసింది. విచారణను 24వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తోందని కూడా చెప్పింది. ఈ విషయం తెలిసి కూడా ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని ప్రశ్నించింది. పెంచిన రిజర్వేషన్లను రద్దు చేసిన నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్ల డివిజన్ బెంచ్ సోమవారం ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపేస్తూ గతనెల మూడున ఎస్‌ఈసీ జారీ చేసిన ప్రొసీడింగ్న్ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపల్లి మండలానికి చెందిన ఆర్ సురేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై లాయర్ వాదించారు. పంచాయతీ పాలకవర్గాల గడువు గతేడాది జనవరితో ముగిసిందన్నారు. ఏడాదిన్నర దాటినా ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఎన్నికలు నిర్వహించాలని సింగిల్ జడ్జి, ద్విసభ్య దర్మాసనం ఆదేశాలిచ్చిందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది జి విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను హైకోర్టు రద్దు చేసిన తర్వాత బీసీలకు 25 శాతం రిజర్వేషన్ల చొప్పున కేటాయిస్తూ జాబితా అందిస్తే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. పాలకవర్గాల గడువు ముగిసిన ఆర్నెల్లలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. సెప్టెంబరు 30లోగా ఎన్నికలు నిర్వహించాలన్న జూన్ 25నాటి సింగిల్ జడ్జి ఉత్తర్వుల నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. అయితే 42 శాతం బీసీ రిజర్వేషన్లను ఈ కోర్టు రద్దు చేసిందనీ, దీంతో పాత రిజర్వేషన్ల ప్రకారం ప్రభుత్వం పంచాయతీలు, వార్డులు కేటాయింపు జరిపి జాబితా ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రభుత్వ న్యాయవాది షాజియా పర్వీన్ వాదనలు వినిపిస్తూ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. త్వరలో నిర్ణయం తీసుకుంటుందనీ, వారం గడువు మంజూరు చేస్తే పూర్తి వివరాలు నివేదిస్తామన్నారు. వాదనలకు స్పందించిన హైకోర్టు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రద్దు చేసిన విషయంతోపాటు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలిచ్చామని గుర్తు చేసింది ప్రభుత్వం కోరినట్టుగా వారం గడువు ఇవ్వడానికి అభ్యంతరం లేదని అయితే ఎన్నికలు ఎప్పుడో చెప్పాలంది. విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.
సరూర్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్‌పై విచారణ జరపాలి
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ సబ్ రిజిస్ట్రార్‌పై పిటిషనర్ చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇన్స్‌పెక్టర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. సబ్ రిజిస్ట్రార్‌కు లంచం ఇచ్చి . పిటిషనర్‌పై కేసు నమోదు చేసి, చట్టప్రకారం తగిన చర్యలు చేపట్టాలని రాచకొండ డీసీపీకి ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ ఫిర్యాదులోని విషయాలను ధృవీకరించుకోకుండా సివిల్ కేసంటూ ముగించిన సరూర్‌నగర్ సబ్ ఇన్‌స్పెక్టర్ తీరును తప్పుబట్టింది. ఆ ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. సబ్ రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీని ప్రతివాదిగా చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. సరూర్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ శ్రీలతపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్‌ఐఆర్ చేయడం లేదంటూ చంచల్‌గూడకు చెందిన సుదర్శన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.
బీఆర్‌ఎస్‌కు భూకేటాయింపుపై హైకోర్టులో సవాల్
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట సర్వే నెంబర్ 239, 240లో బీఆర్‌ఎస్ పార్టీకి 11 ఎకరాల భూ కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. బీఆర్‌ఎస్‌కు 2023లో భూమి కేటాయింపును సవాల్ చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి గతేడాది ఎం వెంకటరామిరెడ్డి దాఖలు చేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారిం చింది. మార్కెట్ విలువ ప్రకారం రూ.500 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని కేవలం రూ.37 కోట్లకే కేటాయింపు చేయడం అన్యాయమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. కౌంటరు దాఖలుకు గడువు కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ కోరడంతో విచారణను వచ్చేనెల పదో తేదీకి వాయిదా వేసింది.
తుపాను వల్ల నష్ట నివారణ చర్యలు చేపట్టారా?
మొంథా తుపానుతో ప్రభావితమైన జిల్లాల్లో పంట, ఆస్తి నష్ట నివారణ చర్యలు చేపట్టారా?అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు చేపట్టడంలో విఫలమైందంటూ.. గతంలో దాఖలైన పిల్‌లో నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన చెరుకు సుధాకర్ మెమో దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వరంగల్, హన్మకొండ జంట నగరాలు 48 గంటలపాటు పూర్తిగా ముంపులోనే ఉన్నాయన్నారు. తాగునీరు, ఆహారం, ప్రాథమిక వైద్యం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం తరఫున ఏజీపీ వాదించారు. ప్రభుత్వం నుంచి వివరాలు పొంది సమర్పించేందుకు రెండు వారాలు సమయం కావాలని కోరారు. దీంతో విచారణను వాయిదా వేసింది.
స్థానిక ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

