– అరకొర కొనుగోలు కేంద్రాలపై రైతుల ఆగ్రహం పెరిగిన విస్తీర్ణానికి అనుగుణంగా కేంద్రాల కోసం డిమాండ్
– ఏ కల్లాలు.. రోడ్లపై చూసినా మొక్కజొన్నలే..!
– మండలానికి ఓ సెంటర్ ఉత్తి మాటేనా..?
– అకాల వర్షాలు కురుస్తుండటంతో ఆందోళన
– తక్కువ ధరలకు అమ్ముకుంటున్న రైతాంగం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగిలో మొక్కజొన్న అధిక విస్తీర్ణంలో సాగైంది. ప్రస్తుతం పంట చేతికి వస్తోంది. ఏ ఊరికి వెళ్ళినా.. ఏ కల్లం చూసినా.. ఏ రోడ్డుపైనైనా.. మొక్కజొన్నలు ఆరబోసి ఉంటున్నాయి. వానాకాలంలో విస్తారంగా వర్షాలు కురవడంతో ఆశించిన స్థాయిలో నీరు ఉండటంతో మొక్కజొన్న వైపు రైతులు మొగ్గు చూపారు. దీనికితోడు అధిక వర్షాలతో పత్తి దెబ్బతినగా ఒకటి, రెండు తీతల తర్వాత తొలగించి మొక్కజొన్న వేశారు. తెగుళ్లు, తక్కువ ధరల నేపథ్యంలో మిర్చి సాగు విస్తీర్ణాన్ని కూడా రైతులు తగ్గించారు. ఫలితంగా ఈ యాసంగి సీజన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 11,21,494 ఎకరాల్లో అన్నదాతలు మొక్కజొన్న పంట సాగు చేశారు. మొత్తం 29.79 లక్షల టన్నుల మేర దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇప్పటికే మొక్కజొన్న పంట మార్కెట్‌లోకి వస్తోంది. సాగు భారీ ఎత్తున ఉండటం, ఇతర కారణాలతో మక్కజొన్న పంట కొనుగోళ్లకు డిమాండ్ తగ్గింది. కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించగా.. ప్రస్తుతం రూ.1,600 నుంచి రూ.1,800కు మాత్రమే రైతుల వద్ద నుంచి వ్యాపారులు కొంటున్నారు. పెరిగిన సాగు విస్తీర్ణానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పెరిగిన విస్తీర్ణం.. తగ్గిన కొనుగోలు కేంద్రాలు
మక్కలకు సరైన ధర లభించని సందర్భాల్లోనే కేంద్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. మూడేండ్ల క్రితం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 50 వరకు కేంద్రాల్లో మక్కలు కొనుగోలు చేశారు. ఈసారి మాత్రం సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించింది. ఏటా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సగటున 96 వేల ఎకరాల్లో సాగయ్యే మొక్కజొన్న ఈసారి ఏకంగా 2.43 లక్షల ఎకరాలకు చేరింది. ఖమ్మం జిల్లాలో 1.70 లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెంలో 73 వేల ఎకరాల్లో సాగైంది. ఖమ్మంలో 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు కలిపి కేవలం 16 కేంద్రాల ఏర్పాటుకే మార్క్‌ఫెడ్ సిద్ధమైంది. ఖమ్మం జిల్లాలో చింతకాని, మధిర, ఎర్రుపాలెం, బోనకల్, ఏదులాపురం (మద్దులపల్లి), జీళ్లచెరువు, మోటాపురం, కొణిజర్ల, మంచు కొండ, అల్లిపురం, కొత్తలింగాలలో, భద్రాద్రి జిల్లాలోని టేకులపల్లి, బోడు, ఇల్లెందు, చల్లస ముద్రం, కొమరారంలో మాత్రమే కేంద్రాలను నెలకొల్పారు. ఎకరానికి 40-50 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నా కేవలం 26.5 క్వింటాళ్లే కొనుగోలు చేస్తుండటం రైతులకు ఇబ్బందిగా మారింది. ఇదే అదనుగా ప్రయివేట్ వ్యాపా రులు క్వింటా రూ.1,600కు మాత్రమే కొను గోలు చేస్తుండటంతో రైతులు రూ. 700పైగా నష్టపోతున్నారు.
అకాల వర్షాలతో ఆందోళన
ఒకవైపు మద్దతు ధర లేక, మరోవైపు వడగళ్లతో కురిసిన అకాల వర్షాలకు మొక్కజొన్నకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మళ్లీ వర్షం పడితే ఎండబోసిన ధాన్యం తడిసి నష్టపోవాల్సి వస్తదని ఆందోళన చెందుతు న్నారు. ”వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారం భించి మద్దతు ధరకు మక్కలు కొనాలి. లేకపోతే పంట మొత్తం దళారుల చేతికి వెళ్లుతుంది” అని రైతులు ఆవేదన చెందుతున్నారు. రికార్డు స్థాయిలో సాగు జరిగినప్పటికీ, సకాలంలో కొనుగోళ్లు చేపట్టకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టాల్లోకి వెళుతున్నారు. ప్రభుత్వం స్పందించి అన్నదాతలను ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురుశెట్టికి వినతిపత్రం సమర్పించారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో ఓ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
25శాతం పంటను మాత్రమే కొంటామంటున్న కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వం మక్కజొన్న పంట కొనుగోలుకు అనుమతించాలని కోరుతూ గత నెలలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మొత్తం 29 లక్షల టన్నుల మక్కల ఉత్పత్తికి గానూ 25 శాతం పరిమితి మేరకు 8 లక్షల టన్నుల కొనుగోళ్లకే కేంద్రం సుముఖత తెలిపింది. ఈ పరిమితి దాటాక.. మద్దతు ధరకు కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొక్క జొన్నలు మార్కెట్‌కు తరలివస్తున్న ప్రాంతాల్లో కేంద్రాలను నెలకొల్పారు. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో దశల వారీగా కేంద్రాలను ఓపెన్ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని నూటికి నూరు శాతం పంటను కొనుగోలు చేస్తే తప్ప రైతులకు నష్టాలు తప్పే పరిస్థితి లేదు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా సుమారు 200 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, నేటికీ సగం సెంటర్లు కూడా ప్రారంభం కాలేదు. సిద్ధిపేట, నాగర్‌కర్నూల్, ఖమ్మం, వరంగల్, మహబూ బ్‌నగర్, భూపాలపల్లి, హనుమకొండ తదితర 10 జిల్లాల్లో 75 సెంటర్లు మాత్రమే తెరిచినా, అక్కడ కూడా కొనుగోళ్లు సక్రమంగా జరగటం లేదు. ప్రతి మండలానికి ఒక సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినా అమలు కాలేదు. ”మక్కలు చేతికొచ్చాయి.. ప్రభుత్వం సెంటర్లు తెరవకపోతే ఎంతకాలం ఎండబోసి ఎదురు చూడాలి” అని రైతులు వాపోతున్నారు.
మక్కలు కొనే దిక్కేది..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



