Sunday, December 14, 2025
E-PAPER
Homeకవితఎవరిని నేను...??

ఎవరిని నేను…??

- Advertisement -

ఎవరిని నేను…??
మా నాన్నకు కూతురినా
మా అన్నకు చెల్లినా
కాబోయేవారికి భార్యనా?
అత్త-మామలకు ఉత్తమ కోడలినా?
నా బిడ్డలకు తల్లినా
కనలేని వెల గొడ్రాలినా??
ఎవరిని నేను…??
పుట్టింటి పరువునా
అత్తారింటి గౌరవాన్నా…
గుండెల మీద కుంపటినా
కన్నవారి బాధ్యతనా
వెంబడి వేసుకొని తిరిగే అభరణాన్నా
అదనంగా వచ్చిన అలంకారాన్నా
ఎవరిని నేను…??
అసలు ఎవరిని నేను…??
వంటింట్లో ఘుమఘుమనా?
వాకిట్లో గొబ్బమ్మనా
తలుపులకు కట్టే తోరణాన్నా
దేవుడి గదిలో దీపాన్నా
చెప్పిందల్లా చేసే పనిమనిషినా
నాకొరకు నిలబడగానే పొగరుబోతునా
ఎవరిని నేను…??
పొట్టిదాన్నా, పొడుగ్గా ఉన్నానా,
చామనచాయ, ఉంగరాల జుట్టా??
నడ్డి ముక్కా, మెల్ల కన్నా
బక్కదానినా, లావుగా ఉన్నానా
ఏది నా గుర్తింపు?
ఏమని నా పలకరింపు
అసలు ఎవరిని నేను,
ఇంటిపేరు వంటి పేరు లేని
అల్పజీవినా…??
మొగవాడి నీడలో
కనుమరుగైన ఆడదానినా..??
ఎవరిని నేను…??
నేను చేసే పనినా
కనిపించే రూపాన్నా
అసలు ఎవరిని నేను
ఎవరిని నేను…??
– హరిప్రియ చిన్నపట్ల, 8919239552

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -