Friday, November 7, 2025
E-PAPER
Homeజాతీయంపై చేయి ఎవరిది?

పై చేయి ఎవరిది?

- Advertisement -

బీహార్‌లో తొలి విడత 64.66 శాతం పోలింగ్‌
ఉప ముఖ్యమంత్రి విజయ్‌ కుమార్‌ సిన్హాకు చేదు అనుభవం

పాట్నా: బీహార్‌లో తొలి విడత పోలింగ్‌ చెదురుమదురు ఘటనల మధ్య ముగిసింది. 64.66శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు ఆరంభంలోనే ఓటుహక్కు వినియోగిం చుకున్నారు. లఖిసరారులో ఉపముఖ్య మంత్రి విజయకుమార్‌ సిన్హా వాహనాన్ని ఆర్జేడీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆర్జేడీ శ్రేణులను చెదరగొట్టారు.

ఓటు కోసం క్యూ..
ఉదయం 7గంటలకు 121 స్థానాల్లో మొదలైన తొలిదశ పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. భద్రతా కారణాలతో ఐదు నియోజకవర్గాల్లో 5గంటలకే ముగిసింది. వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు తమ తమ ప్రాంతాల్లో ఆరంభంలోనే ఓటుహక్కు వినియోగించుకున్నారు. బీహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ భక్తియార్‌పుర్‌లో ఓటు వేశారు. మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రాజీవ్‌రంజన్‌ సింగ్‌, బీజేపీ ఎంపీ రవిశంకర్‌ ప్రసాద్‌, ఆయన సతీమణి మాయాశంక పాట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

బీహార్‌ ఉప ముఖ్యమంత్రి విజయ్‌ కుమార్‌ సిన్హా లఖిసరారులో ఓటు వేశారు. కేంద్రమంత్రి, ఎల్జేపీ-రామ్‌ విలాస్‌ పార్టీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ ఖగారియాలో ఓటు వేశారు. మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌, ఆయన సతీమణి రబ్రీదేవి, కుమారుడు, మహాగట్‌బంధన్‌ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ పాట్నాలో ఓటువేశారు. బీహార్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్టు లాలూ తెలిపారు. జన్‌శక్తి జనతాదళ్‌ జాతీయ అధ్యక్షుడు, లాలూ పెద్దకుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పాట్నాలో ఓటువేశారు.

ఉప ముఖ్యమంత్రి విజయ్‌ కుమార్‌ సిన్హాకు చేదు అనుభవం
లఖిసరారులో ఉప ముఖ్యమంత్రి విజయ్‌ కుమార్‌ సిన్హాకు చేదు అనుభవం ఎదురైంది. ఓటు వేసి వెళ్తున్న ఆయన వాహనాన్ని ఆర్జేడీ మద్దతుదారులు కొందరు అడ్డుకున్నారు. ఆయన కారుపై చెప్పులు, పేడ విసిరారు. విజయ్‌ సిన్హాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్జేడీ శ్రేణులు ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించిన ఆయన, అక్కడి నుంచే జిల్లా ఎస్పీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. అదనపు బలగాలను పంపించాలని ఆదేశించారు. అత్యంత వెనుకబడినవర్గాల ప్రజలు ఓటు వేయకుండా అడ్డుకుంటున్నట్టు తెలిపారు. ఆర్జేడీ గూండాలు తన వాహనంపై దాడి చేశారని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరోవైపు సిన్హా ఆరోపణలను ఆర్జేడీ ఎమ్మెల్సీ అజయ్‌కుమార్‌ సింగ్‌ తోసిపుచ్చారు. ఓడిపోతానన్న భయంతోనే విజయ్‌కుమార్‌ సిన్హా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

లఖిసరాయ్‌ ఘటనపై స్పందించిన ఈసీ
లఖిసరాయ్‌ ఘటనపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీహార్‌ డీజీపీని ఆదేశించింది. ఎవరూ కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటానికి అనుమతించబోమని సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. బాధ్యులపై కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

బీహార్‌ ఎన్నికలను నిశితంగా పర్యవేక్షిస్తున్న ఈసీ
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్‌)పై తీవ్ర దుమారం రేగటంతో కేంద్ర ఎన్నికల సంఘం బీహార్‌ ఎన్నికలను నిశితంగా పర్యవేక్షిస్తోంది. తొలి విడత పోలింగ్‌ జరుగుతున్న 45వేలకుపైగా పోలింగ్‌ కేంద్రాల నుంచి వెళ్తున్న లైవ్‌ ఫీడ్‌ను ముగ్గురు కమిషనర్లు పరిశీలిస్తున్నారు. బీహార్‌లో తొలిసారి అన్నిపోలింగ్‌ బూత్‌ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌, మిగితా ఇద్దరు కమిషనర్లు ఎస్‌.ఎస్‌.సంధు, వివేక్‌ జోషి ఢిల్లీ నిర్వాచన్‌ సదన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నుంచి బీహార్‌ తొలివిడత పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నట్టు ఈసీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -