Saturday, July 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రీ ప్రైమరీ బాధ్యత ఎవరిది?

ప్రీ ప్రైమరీ బాధ్యత ఎవరిది?

- Advertisement -

– స్పష్టత ఇవ్వని సర్కార్‌
– పర్యవేక్షణ లేదు…ఏ శాఖ పరిధో తెలీదు
– 572 ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో 6,146 మంది విద్యార్థులు
– చదువు చెప్పేందుకు టీచర్లు లేరు మార్గదర్శకాలూ లేవు
బి. జగదీశ్వర్‌

ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని గందరగోళంగానే ఉంటాయి. ఆ విషయం తెలిసినా ‘అడిగినప్పుడు చూద్దాంలే’ అనే అధికారుల సా……గతీత అడుగును ముందుకు పడనివ్వదు. అలాంటి నిర్ణయమే సర్కారు స్కూళ్లలో ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణ. పుట్టిన బిడ్డకు మూడేండ్లు నిండగానే ప్రయివేటు స్కూళ్లలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల్లో చేర్పించేయడం పేరెంట్స్‌కు అలవాటైపోయింది. దీనివల్ల విద్యావకాశాలు కొందరికే పరిమితం అవుతున్నాయనే భావనతో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రీ ప్రైమరీ తరగతుల్ని నిర్వహించాలని భావించారు. దానిలో భాగంగా 362 పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణకు గతంలో అనుమతులు ఇచ్చారు. నాలుగేండ్లు నిండిన పిల్లల్ని యూకేజీలో చేర్చుకుంటారు. ఏడాది తర్వాత ఆ పిల్లల్ని ఒకటో తరగతికి ప్రమోట్‌ చేస్తారు. ప్రస్తుత విద్యాసంవత్సరం (2025-26)లో మరో 210 పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రీప్రైమరీ తరగతులున్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 572 పెరిగింది. ఈ స్కూళ్లలో 6,146 మంది విద్యార్థులు చేరారు. ఇప్పుడు వీళ్ల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది.
చట్టాల్లో భిన్నత్వం
విద్యకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలు పరస్పరం భిన్నంగా ఉన్నాయి. దీనితో గందరగోళం ఏర్పడుతుంది. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం ప్రకారం ఐదేండ్లు నిండిన పిల్లల్ని 1వ తరగతిలో చేర్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యావిధానం ప్రకారం 6 ఏండ్లు నిండిన పిల్లల్ని 1వ తరగతిలో చేర్చుకోవాలి.రాష్ట్రంలో స్టేట్‌ సిలబస్‌ ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో ఐదేండ్లు నిండిన వారికి 1వ తరగతిలో ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సెంట్రల్‌ సిలబస్‌ ఉన్న స్కూళ్లలో 6 ఏండ్లు నిండిన వారికి 1వ తరగతిలో ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ చట్టాల ప్రకారం ప్రీ ప్రైమరీ బాధ్యత ఎవరికి వర్తిస్తుందనే దానిపై స్పష్టత లేదు.
విద్యాశాఖకే ఉండాలి
ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణ బాధ్యతలు విద్యాశాఖ పరిధిలోనే ఉండాలని పిల్లల తల్లిదండ్రులు కోరుకుంటు న్నారు. అంగన్‌వాడీల పర్యవేక్షణలో ప్రీప్రైమరీ తరగతులను నిర్వహిస్తే ప్రయోజనం ఉండబోదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంగన్‌వాడీ లకు ఇతర అనేక బాధ్యతలు ఉన్నాయి. రెండేండ్లు నిండిన పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం సహా వారికి చదువుపై ఆసక్తి పెంచే కార్యక్రమాలను అక్కడి టీచర్లు చేస్తున్నారు. ప్రయివేటు స్కూళ్లలో నిర్వహిస్తున్న నర్సరీ, ఎల్‌కేజీ తరగతుల బాధ్యతల్ని గ్రామీణంలో అంగన్‌వాడీ టీచర్లు నిర్వహిస్తున్నారు. అందువల్ల ప్రీ ప్రైమరీని విద్యాశాఖకు అనుసంధానం చేస్తే తల్లిదండ్రులకు కూడా ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందనీ, ఎక్కువ మంది పిల్లలు వీటిలో చేరే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు.
టీచర్లు లేరు
ప్రస్తుత విద్యాసంవత్సరంలో జూన్‌ 12న పాఠశాలలు పున:ప్రారం భమయ్యాయి. అదేనెల 6 నుంచి 19వ తేదీ వరకు జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న 362 ప్రీ ప్రైమరీ పాఠశాలలకు అదనంగా జూన్‌ 11వ తేదీ మరో 210 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులకు అనుమతిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా, ఇప్పటి వరకు ప్రీప్రైమరీ తరగతులను ఎవరు బోధించాలనే విషయంపై స్పష్టత లేదు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించలేదు. కొత్తగా నియామకాలు చేపడితే ఆ టీచర్ల అర్హతలు, వేతనాలపైనా స్పష్టత రావాల్సి ఉన్నది. ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది కాబట్టి, తప్పనిసరై ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులే కొన్ని చోట్ల ఆ పిల్లలకు బోధన చేస్తున్నారు. ఏ శాఖ పరిధో తేలకపోవడంతో ఆ పిల్లలపై పర్యవేక్షణ కొరవడింది.
మార్గదర్శకాలు ఇవ్వాలి
ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలి. అప్పుడే ప్రీ ప్రైమరీ విద్యార్థులకు సిలబస్‌, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం వంటివి సిద్ధమవుతాయి. గతంలో ఇచ్చిన 362 ప్రీ ప్రైమరీ అనుమతులు కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మరో వెయ్యి ప్రభుత్వ పాఠశాలలకు అనుమతులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దానిలో భాగంగా ఈ ఏడాది 210 పాఠశాలలకు అనుమతులు ఇచ్చారు. మరో 790 బడుల్లో ప్రీ ప్రైమరీ ప్రారంభానికి అనుమతులు రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో 30,137 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వాటిలో 18,259 ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్లు ఉన్నాయి. వీటన్నింటిలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని విద్యావేత్తలు కోరుతున్నారు. ఆకర్షణీయమైన తరగతి గదులు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆట వస్తువులు ఉండేలా తరగతి గదుల్ని తీర్చిదిద్ది, అవసరమైన సిబ్బంది, ఉపాధ్యాయులను నియమిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని సూచిస్తున్నారు.
ఎవరి పరిధి…?ప్రభుత్వ స్కూళ్లలో నిర్వహిస్తున్న ప్రీప్రైమరీ తరగతుల బాధ్యత ఎవరిదనే విషయంపై సర్కారు స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఐదేండ్లలోపు ఉన్న పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండాలి. అంటే ఆ పిల్లలంతా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి వస్తారు. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ఐదేండ్లు నిండిన పిల్లలకే ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలి. పాఠశాలల్లో చేరిన పిల్లలే విద్యాశాఖ పరిధిలోకి వస్తారు. ప్రీప్రైమరీలో నాలుగేండ్లు నిండిన పిల్లలను చేర్చుకుంటున్నారు. వారికి ఐదేండ్లు నిండకపోవడంతో విద్యాశాఖ పరిధిలోకి రావడం లేదు. నాలుగేండ్లు నిండడంతో మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి వస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో అయోమయం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -