Saturday, October 25, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబుగ్గయిన ప్రాణాలకు బాధ్యులెవరు?

బుగ్గయిన ప్రాణాలకు బాధ్యులెవరు?

- Advertisement -

ప్రయివేటుకు అనుకూలంగా ఎంవీ యాక్ట్‌ను సవరించిన మోడీ సర్కార్‌
ఫిట్‌నెస్‌లు లేవు… తనిఖీలు లేవు
సీటింగ్‌ బస్సుల్ని స్లీపర్లుగా మార్చినా పట్టించుకోని వైనం
ఆర్టీసీలను చంపేసి, ప్రయివేటుకు రాజమార్గం
ట్రావెల్స్‌లో రాజకీయ నేతల భాగస్వామ్యం


నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రయివేటు ట్రావెల్స్‌కు చెందిన మరో ఏసీ స్లీపర్‌ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. 20 మంది సజీవ దహనం అయ్యారు. ఈ మరణాలకు బాధ్యులు ఎవరు? రెండ్రోజులు ఈ ప్రమాదంపై హడావిడి చేసి, వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్టు ప్రభుత్వాలు ప్రకటనలు ఇవ్వడం, ఓ వారం గడిచాక, అసలేం జరగనట్టు మళ్లీ మొద్దునిద్రలోకి జారుకోవడం షరామామూలే! ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. ఎక్కడో ఒడిశాలో రిజిస్టర్‌ అయిన బస్సు తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌- కర్నాటక రాష్ట్రాల మధ్య ఎలా తిరుగుతోంది? అనుమతులు ఇచ్చింది ఎవరు? ఆ బస్సు ఫిట్‌నెస్‌ను తనిఖీ చేసింది ఎవరు? సీటర్‌ బస్సుల్ని స్లీపర్‌ బస్సులుగా మారుస్తుంటే ఆయా రాష్ట్రాల రవాణాశాఖల అధికారులు ఏం చేస్తున్నట్టు? వాళ్లకు తెలియకుండానే రాష్ట్ర, జాతీయ రహదారులపై రాజమార్గంలో ఈ బస్సులు గమ్యాలకు ఎలా చేరుతున్నాయి? ఈ ప్రశ్నల్ని ఎవరు అడగాలి? సమాధానాలు ఎవరు చెప్పాలి? సహజంగా రోడ్డు ప్రమాదం అనగానే మానవ తప్పిదమే ప్రత్యక్షంగా కనిపిస్తుంది.

చట్టం కూడా దాన్నే నిర్థారించి, దోషులపై కేసులు నమోదు చేస్తుంది. మరి ప్రయివేటు ఆపరేటర్లను ప్రోత్సహిస్తూ, ఆర్టీసీలను చంపేస్తూ, జాతీయ రవాణా చట్టంలో సవరణలు చేసిన కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు కేసులు నమోదు చేయరు? అనేది కామన్‌మ్యాన్‌ ప్రశ్న. రెండ్రోజుల క్రితం రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆర్టీఏ చెక్‌పోస్టుల్ని ఎత్తేశారు. దీనికి కూడా మోడీ సర్కార్‌ తీసుకొచ్చిన మోటారు వాహన చట్ట (ఎంవీ యాక్ట్‌) సవరణలే కారణం. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్ట సవరణల్లో ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సుల్లో తనిఖీలు, ఫిట్‌నెస్‌ల్లో వెసులుబాటు కల్పించింది. ఇది కూడా ప్రయివేటు ట్రావెల్స్‌ ఇష్టారాజ్యానికి ఒక కారణంగా కనిపిస్తోంది. 2013 అక్టోబర్‌ 30న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పటి మహబూబ్‌ నగర్‌ జిల్లా, ఇప్పటి వనపర్తి జిల్లాలోని పాలెం వద్ద కూడా ఇలాగే ఆర్టీసీకి అద్దెకు ఇచ్చిన ప్రయివేటు బస్సులో అగ్ని ప్రమాదం జరిగి 45 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.

దానినుంచి ఏం గుణపాఠం నేర్చుకున్నాం. రెండ్రోజులు హడావిడి చేసిన పాలకులు ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయారు. ఈ ఏడాదిలోనే గతనెల (సెప్టెంబర్‌) 26వ తేదీ హైదరాబాద్‌ సంజీవరెడ్డి నగర్‌ మెట్రో స్టేషన్‌ కింద ఓ ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు మంటల్లో కాలిపోయింది. డ్రైవర్‌ అప్రమత్తమై, బస్సులోని ప్రయాణీకుల్ని దించేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ప్రయాణీకుల లగేజీతో పాటు బస్సు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. పోలీసులు, రవాణాశాఖ అధికారులు నామ్‌కే వాస్తేగా ఓ కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు. అప్పుడే రవాణాశాఖ అధికారులు అప్రమత్తమై, ప్రయివేటు బస్సుల్ని పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి ఉంటే, ఇప్పుడీ కావేరీ ట్రావెల్స్‌ ప్రమాదం జరిగి ఉండేదా? పాలెం దుర్ఘటన జరిగాక వోల్వో బస్సుల డిజైన్‌లోనే లోపాలు ఉన్నాయని నిర్థారించి, చర్యలు తీసుకున్నారు. అంటే ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప ప్రభుత్వ యంత్రాంగం మేల్కొదనే విషాయాన్ని స్పష్టంగానే చెప్పేస్తున్నారు. చట్ట విరుద్ధంగా బస్సుల్లో మార్పులు చేస్తున్నా, అధికార యంత్రాంగం ఉలుకు పలుకు లేకుండా ఉంది.

నో స్పీడ్‌ లిమిట్‌
ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సులు ప్రయాణీకుల్ని గమ్యస్థానాలకు చేర్చేందుకు పోటీపడుతూ వేగ నియంత్రణను పాటించట్లేదు. ఈ బస్సులకు ఆర్టీసీ బస్సులకు ఉన్నట్టు స్పీడ్‌ లిమిట్‌ లేదు. మరోవైపు బస్సుల్లో సాంకేతిక, నిర్వహణా లోపాలు సర్వసాధారణం. ఎప్పుడో ఒకసారి మరమ్మతులు చేయడమే తప్ప, నిరంతరం ప్రయివేటు బస్సుల్లో భద్రతా తనిఖీలు ఉండవు. డీజిల్‌ ట్యాంక్‌ లేదా ఫ్యూయల్‌ పైప్‌ లైన్లలో లీకేజీ ఉంటే, చిన్న స్పార్క్‌తోనే మంటలు చెలరేగుతాయి. ఇంజిన్‌ సమీపంలో వేడి పెరిగినప్పుడు లేదా ఫ్యాన్‌ బెల్ట్‌ రాపిడి వల్ల చిమ్మిన చిన్న అగ్నికణం కూడా బస్సు మొత్తాన్ని దహనం చేసేస్తుంది. మరికొన్ని స్లీపర్‌ బస్సుల్లో డ్రైవర్లు, క్లీనర్లు వంట చేసుకోవడం కోసం గ్యాస్‌ సిలిండర్లు, స్టౌవ్‌లను లగేజీ పెట్టే ప్రాంతాల్లో దాచేస్తుంటారు. దీనివల్ల బస్సు బాడీకి చిన్న రాపిడి జరిగినా ఈ సిలిండర్లు ప్రమాదానికి కారణమవుతాయి.

అరాచక పోటీ
ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సుల మధ్య ఏమాత్రం సహేతుకం కాని అరాచక పోటీ నెలకొంది. ఈ విషయం పాలకులకూ తెలుసు. మెజారిటీ ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సుల్లో రాజకీయ నాయకుల భాగస్వామ్యం కూడా ఉంటోంది. కేశినేని ట్రావెల్స్‌, దివాకర్‌ ట్రావెల్స్‌, కావేరీ ట్రావెల్స్‌ వంటి బస్సులన్నింటిలోనూ రాజకీయ భాగస్వామ్యం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కనిపిస్తూనే ఉంది. అందుకే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు హఠాత్తుగా మేల్కొన్నట్టు హడావిడి చేసి, ఆ తర్వాత షరామామూలుగానే వ్యవహరిస్తున్నాయి. ఆర్టీఏ నిబంధనల్ని తుంగలో తొక్కి ప్రయివేటు ఆపరేటర్లు సీటింగ్‌ బస్సుల్ని స్లీపర్లుగా మార్చేస్తున్నారు.

హంగు ఆర్భాటాలు
ప్రయాణీకుల్ని ఆకర్షించాలనే తాపత్రయంలో హంగు ఆర్భాటాల కోసం నిబంధనలకు విరుద్దంగా బస్సుల్లో నాసిరకం ఎలక్ట్రికల్‌ వైరింగ్‌తో ఎయిర్‌ కండీషనర్లు, లైటింగ్‌ సిస్టం, చార్జింగ్‌ పాయింట్లు, ఫ్యాన్లు, టీవీలు, ఆడియో పాయింట్లు వంటివి ఏర్పాటు చేయడంతో షార్ట్‌సర్య్కూట్‌లు జరుగుతున్నాయి. వీటివల్ల ఎలక్ట్రికల్‌ లోడ్‌ పెరిగి వేడి ఉత్పత్తి అవుతున్నది. బస్సుల్లో వాడే నాసిరకం రెగ్జిన్‌ కూడా మంటల వ్యాప్తికి కారణమవుతున్నది. స్లీపర్‌ బెర్తుల్లో ఉపయోగించే ఫోమ్‌, కవర్లు, కర్టెన్లు వంటివన్నీ ఫైర్‌ రెసిస్టెన్స్‌కు సంబంధించినవి కావు. దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు నిద్రలో ఉండే ప్రయాణీకులు కళ్లు తెరిచే సరికి ఈ నాసిరకం రెగ్జిన్‌కు మంటలు అంటుకొని నల్లటి పొగ కమ్మేసి, ఏమీ కనిపించకుండా చేసి, ఊపిరాడకుండా చేస్తూ, సజీవ దహనం చేసేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా బస్సుల్లో ఇంటీరియల్‌ డెకరేషన్స్‌ చేయడం వల్లే ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది.

కనిపించని సేఫ్టీ పరికరాలు
బస్సులో అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అప్రమత్తమయ్యేలా ఏర్పాట్లు ఉండాలి. ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు, స్మోక్‌ అలారం, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు సరైన స్థితిలో లేకపోవడం వల్ల ప్రమాదం తర్వాత ప్రాణ నష్టం ఎక్కువ అవుతుంది. డ్రైవర్లకు ఫైర్‌ సేఫ్టీ ట్రైనింగ్‌ లేకపోవడం కూడా ఓ కారణం. కావేరి బస్సు ప్రమాదంలో మంటల్ని ఆర్పలేక, డ్రైవర్లు పారిపోవడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -