Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeప్రత్యేకంనాన్న ఎందుకో వెనకబడ్డాడు

నాన్న ఎందుకో వెనకబడ్డాడు

- Advertisement -

నాన్నంటే నమ్మకం. నాన్నంటే భరోసా. నాన్నంటే ధైర్యం. నాన్నంటే బాధ్యత. అంతటి గొప్పతనమున్న నాన్న గురించి మనం మాట్లాడుకునే మాటలు మాత్రం చాలా తక్కువ.
తల్లి ప్రేమను అందరూ గొప్పగా కొనియాడతారు. కానీ నాన్న ప్రేమ గురించి చెప్పడానికి, ఆయనతో అనుబంధాన్ని వ్యక్తపరచడానికి ఎందుకో తడబడతారు. అది భయమో, ప్రేమో తెలియని స్థితి.
నాన్న ప్రేమ మాటల్లో కాదు, మౌనంలో వ్యక్తమవుతుంది.
నవమాసాలు మోసి కన్న తల్లి రుణం తీర్చుకోలేనిది. అలాగే జీవితాంతం మన కోసం తన కలల్ని త్యజించి, మన కలల కోసం పోరాడే నాన్న కూడా అంతే గొప్పవాడు. అందుకే ప్రతి సంవత్సరం జూన్‌ మూడవ ఆదివారం ఒక స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, మన జీవితంలో నిలిచే అద్భుత వ్యక్తికి గుర్తుగా. అమ్మ నిన్ను ఈ లోకానికి పరిచయం చేస్తుంది. నాన్న ఈ లోకాన్ని నీకు పరిచయం చేస్తాడు.
నాన్న ప్రేమ మౌనానికి మరో పేరు
తల్లి ప్రేమను గుండెతో చూస్తాం. కానీ నాన్న ప్రేమను మనసుతో అనుభవిస్తాం. నాన్న కోపంలో చులకన కాదు, బాధ్యత ఉంటుంది. ఆయన మౌనంలో నిర్లక్ష్యం కాదు, అపారమైన ప్రేమ దాగి ఉంటుంది.
తన కలల్ని పక్కనపెట్టి మన కలల కోసం నిత్యం శ్రమించేవాడు నాన్న. అనారోగ్యంతో ఉన్నా పని చేయడం ఆపడు. బాధలో ఉన్నా బాధ్యతను మరువడు. పనికి సెలవు లేదు, ప్రేమకు అంతు లేదు.
పిల్లల భవిష్యత్తు కోసం రోజూ పోరాడుతూనే ఉంటాడు. పిల్లల ఎదుగుదలే అతని గమ్యం. వారే అతని ఆశలు, వారే అతని ఆయుష్షు. తన విజయాలకన్నా పిల్లల విజయాలకే ఎక్కువ ఆనందించేవాడు నాన్న.
నీ విజయాల వెనుక నిలిచే నిశ్శబ్ద శక్తి. పేరు లేని వెలుగు, మాటలేని మౌనం. గుర్తింపు లేకపోయినా, పురస్కారాలు రాకపోయినా నీ జీవితాన్ని నిర్మించిన శిల్పి ఆయనే.
వేరులా కనిపించకుండా, చెట్టు నిలబడేలా చేసే శక్తిలా వుంటాడు నాన్న. నాన్న వున్నప్పుడు విలువ తెలియదు, కానీ లేకపోవడం మాత్రం తట్టుకోలేం.
నాన్న వెనకపడలేదు. మనమే ముందుకెళ్లి ఆయనను వెనకబడేలా చేసాం. ఆయన తన త్యాగాల గురించి చెప్పడు. తన ప్రేమను బయటకు చూపడు. కానీ ప్రతిరోజూ మన కలల కోసం కష్టపడతాడు.
నిజమైన హీరో నాన్న
ఆయన మాటల్లో ప్రేమ ఉంటుంది, ఆయన కోపంలో బాధ్యత ఉంటుంది, ఆయన మౌనంలో త్యాగం ఉంటుంది, ఆయన ప్రతి ఆలోచనలో మన భవిష్యత్తు ఉంటుంది.
తల్లిదండ్రుల ప్రేమ మానవతకు ప్రతిబింబం. వారు చిన్నతనం నుంచి పిల్లలను అల్లారు ముద్దుగా పెంచి, వారి కోసం అన్నిరకాల త్యాగాలు చేస్తారు. వారు కలలు కనేది తమ కోసం కాదు పిల్లల భవిష్యత్తు కోసం.
తమ జీవితాన్ని అర్పించిన తల్లిదండ్రులకు, మనం జీవితాంతం ప్రేమతో, గౌరవంతో తోడుగా ఉండటం బాధ్యత మాత్రమే కాదు, అది వారి ఋణం తీర్చుకోవడం కూడా.
వారిని నిర్లక్ష్యం చేయడం కేవలం నైతిక లోపం మాత్రమే కాదు, అది మనిషితనానికే మాయని మచ్చ.
నాన్నంటే గుర్తుచేసుకునే జ్ఞాపకం కాదు, ఎల్లప్పుడూ గుర్తుండే గమ్యం, ఆ గమ్యాన్ని చేర్చే మార్గం.
హ్యాపీ ఫాదర్స్‌ డే.
జి. అజయ్ కుమార్‌
సామాజిక విశ్లేషకులు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad