Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeసోపతిస్కూల్‌ అంటే ఇష్టం దేనికి?

స్కూల్‌ అంటే ఇష్టం దేనికి?

- Advertisement -

మీ ఇంటిని, పరిసరాల్ని ఎంతో ఇష్టపడతారు గదా. అలాగే స్కూలు, స్కూల్లో ఇతర విద్యార్థుల్నీ, తరగతి వాతావరణాన్నీ ఇష్టపడాలి. నిజానికి దీనిలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఒకసారి స్కూల్లో చేరిన తర్వాత మీ స్కూలు విద్యాభ్యాసం అయ్యేవరకూ అదే స్కూలుకి వెళుతుంటారు.

కొందరు మాత్రం అనేక కారణాల వల్ల మధ్య మధ్యలో మారుతుంటారు. కానీ ఎక్కువ మంది కొనసాగుతారు. దీనికితోడు తరగతి గదిలో, స్కూలు వాతావరణంలోనే రోజులో ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి సహజంగానే ఆసక్తి ఏర్పడుతుంది. ఇంట్లో తల్లిదండ్రులు, బంధువులు, పెద్దవారి పట్ల కూడా ప్రదర్శించే గౌరవాభిమానాలు స్కూల్లోనూ టీచర్ల పట్ల, తోటి విద్యార్థుల పట్ల ప్రదర్శించాలి. స్కూలు అంటే ఇష్టం ఏర్పడటానికి కారణాలు అనేకం.
యూనిఫామ్‌ :
ఏ స్కూలైనా ఈ రోజుల్లో విద్యార్థులకు ప్రత్యేకమైన యూనిఫామ్‌ను నిర్ణయిస్తుంది. అది ఆ స్కూలు విద్యార్ధివన్న గుర్తింపును ఇస్తుంది. ప్రతి స్కూలుకూ ఒక్కొక్క రకం యూనిఫామ్‌ ఉంటుంది. అలాగే బాలబాలికలకూ వేరు వేరు యూనిఫారాలు ఉంటున్నాయి. యూనిఫామ్‌ను చక్కగా, చూడముచ్చటగా వుంచుకోవాలి. యూనిఫామ్‌ పట్ల ఇష్టత లేకున్నా, అపరిశుభ్రంగా వుంచుకున్నా మంచి విద్యార్ధి అనిపించుకోరు. పాఠ్యపుస్తకాల పట్ల వుండే శ్రద్ధ యూనిఫామ్‌ పట్లా వుండాలి.
టీచర్లు :
మీ స్కూలు, తరగతి ఉపాధ్యాయులు, టీచర్లను ఎంతో గౌరవించాలి. బోధనను గౌరవించాలి. చదువునేర్వడానికి, భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో నిలవడానికి స్కూలు జీవితంలో టీచర్ల పట్ల, విద్యపట్ల మీరు ప్రదర్శించే గౌరవమర్యాదలే తొలి మెట్టు కాగలదు. వారి బోధనా విధానం నచ్చకపోయినా క్లాసులో వినడం అలవర్చుకోవాలి. మీ సమస్యల పరిష్కారానికి, మిమ్మల్ని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యతనూ వారే చేపడుతున్నారు.
పాఠ్యాంశాల బోధనే కాకుండా మీ అభివద్ధికి వీరి సహాయ సహకారాలు ఉంటుంటాయి. మంచి విద్యార్థులను వారు ఎన్నటికీ మర్చిపోరు. కొంతమంది స్కూలు దాటి కాలేజీ విద్యాభ్యాసంలోకి అడుగుపెట్టి నప్పుడు కూడా అందులో ఎలా రాణించాలో కూడా స్కూలు టీచర్లు మార్గదర్శకం చేయగలరు. అందువల్ల అన్ని విధాలా వారి సహాయ సహకారాలు అందుకుని మంచి విద్యార్ధి అనిపించుకోవాలి. అదే లక్ష్యంగా ఉండాలి.
తోటి విద్యార్థులు :
తోటి విద్యార్థులతో ఎంతో స్నేహభావంతో మెలగాలి. వారి విద్యాసక్తులు, తెలివితేటలు, ప్రజ్ఞాపాటవాలను గుర్తించి గౌరవించాలి. కొందరు మీకంటే తెలివిగలవారుంటారు. వారి సూచనలు సలహాలు తీసుకోవచ్చు. ముఖ్యంగా చదువు విషయంలో మీకంటే బాగా చదువుతున్నవారి పట్ల అసూయపడరాదు. వారు చదువు, ఇతర అంశాల్లో అనుసరిస్తున్న జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుని అనుసరించడానికి ప్రయత్నించండి. అలాగే మీకు ఒకటి రెండు సబ్జెక్టులు బాగావస్తే, వాటిలో కాస్తంత వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేయండి. తద్వారా మీ మధ్య మంచి స్నేహబంధం ఏర్పడుతుంది. ఒకరికొకరు సహాయం చేసుకోవడం అలవడుతుంది. ఇది మున్ముందు జీవితంలో ఎంతో ఉపయోగ పడుతుంది.
పోటీలు, పిక్నిక్‌లు :
స్కూలు స్థాయిలో తరచూ జరిగే పలురకాల పోటీల్లో పాల్గొనాలి. అందరితో కలిసిమెలసి పనిచేయడం, ఇతరుల్ని అర్ధం చేసుకోవడం, ఇతరులతో ఎలా మెలగాలి అన్నవి తెలుస్తాయి. అన్ని పోటీల్లో పాల్గొనడం ప్రధానం. దీనివల్ల చదువులోనూ ఎంతో రాణిస్తారు. పోటీల్లో పాల్గొనడం వల్ల వాటి పట్ల ఉండే భయాందోళనలు తొలిగి ఆత్మవిశ్వాసంతో నిలవగలరు. అందుకే ఓటమి, గెలుపులతో సంబంధం లేకుండా అన్నిరకాల పోటీల్లోనూ పాల్గొనడానికే ఎక్కువ ప్రాధాన్యతనీయండి. రచనావ్యాసంగం, వక్తత్వపోటీల్లో, క్విజ్‌ పోటీల్లో పాల్గొనడంలో అనేక విషయాలు తెలుసుకోగలరు. మీరు తెలుసుకోవాల్సిన అంశాలను గ్రహించగలరు. లోపాలు అధిగమించేందుకు తగిన స్ఫూర్తిపొందుతారు.
విద్యా సంవత్సరం ముగిసేలోగా ఏదో ఒక సమయంలో ఉపాధ్యాయులు మిమ్మల్ని పిక్నిక్కు, విహారయాత్రకూ తీసుకువెళతారు. అది ఉన్నచోటనే మీరు చూడదగ్గ ప్రాంతానికి కావచ్చు లేదా దూర ప్రాంతానికి కావచ్చు. ఒక్కొక్కసారి మీ పై తరగతుల వారితోనూ వెళ్లవలసి వస్తుంది. కొత్త ప్రాంతానికి వెళ్లడం, అక్కడి పరిసరాల పరిశీలన, ఆ ప్రాంతం గురించిన ప్రత్యేకతలు, చారిత్రక ప్రాధాన్యతలు వంటివి ఉపాధ్యాయులు వివరించడం లేదా అక్కడి వారు చెప్పడంతో మీకు ఎంతో పరిసరాల జ్ఞానం వస్తుంది. అనేక ప్రాంతాల్లో పర్యటించడం ఎంత అవసరమన్నది మీకు తెలుస్తుంది.
మన పరిసరాల్లో ఉండే ప్రాధాన్యతను తెలుసుకోగలరు. ఇది ఎంతో అవసరం. మీ పరిజ్ఞానం, ఆలోచనాపరిధి విస్తరిస్తాయి. అందరితో కలిసిమెలసి ఉండడం, అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడం, సందేహాలు పరిష్కరించుకోవడం అలవాటవుతుంది. కనుక పిక్నిక్లు, విహారయాత్రలకు తప్పకుండా వెళ్లండి.
విద్యా ప్రయాణం :
స్కూల్లో మీరు నర్సరీలోనో ఒకటో తరగతిలోనో చేరితే టెన్త్‌ వరకూ అదే స్కూల్లో చదువు కొనసాగిస్తారు. కొందరు తరచూ మారుతుండవచ్చు. మీరు తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలు వాస్తవరూపంలో కొంత స్వయంగా తెలుసుకోను, పరిశీలించేందుకు ఈ ప్రయాణం ఎంతో ఉపకరిస్తుంది. దీన్ని ప్రయాణం అని ఎందుకన్నాను అంటే ఒక తరగతి నుంచి మరో తరగతికి వెళతారు, కొత్తవారితో, కొత్త ఉపాధ్యాయులు, టీచర్ల శిక్షణలోకి వెళుతూంటారు గనుక. ఈ ప్రయాణం ఎంతో ఉపకరిస్తుంది, ఎంతో నేర్చుకోనే వీలు కల్పిస్తుంది. ఇది విద్యాభ్యాస ప్రయాణం. తరగతి మారుతున్నప్పటికీ అదే స్కూలు వాతావరణంలోనే ఉంటారు గనుక భయాందోళనలకు గురికావలసిన అవసరం లేదు.
ప్రతి తరగతిలోనూ కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరూ పెద్ద క్లాసులోకి వెళతారు కాబట్టి మీలోనూ ఆ మార్పు వస్తుంది. అందరి స్నేహాన్ని, ఉపాధ్యాయుల అభిమానాన్ని పొందాలన్న భావన పెంపొందించుకోవాలి. చిన్న తరగతి వారిని, పెద్ద తరగతి వారిని సమానంగానే చూడాలి. ఎవరిపట్ల ద్వేషభావంతో మెలగవద్దు. మీకంటే పెద్ద క్లాసులో వున్నవారి సహాయ సహకారాలు తీసుకోవచ్చు. అలాగే సబ్జెక్టుల పరంగా చిన్న తరగతుల వారికి సహాయసహకారాలు అందించవచ్చు. ఏమైనప్పటికీ టీచర్ల నుంచి అభిమానం పొందాలి.
మంచి విద్యార్థి :
భవిష్యత్‌ జీవితానికి స్కూలు జీవితమే పునాది వేస్తుంది. స్కూల్లో మంచి విద్యార్థి అనిపించుకోవాలి. చదువులో, ఆటపాటల్లోనూ రాణించాలి. మంచి పోటీతత్వం పెంచుకోవాలి. విద్యాభ్యాసంలో అందరి మన్ననలూ పొందాలి. మీ ప్రవర్తన, చదువులోనూ అందరి దష్టిని ఆకట్టుకోవాలి. కోపతాపాలకు, అసూయా ద్వేషాలకు లోనుకాకుండా అందరితోనూ కలిసిమెలసి మెలగాలి.
మంచి విద్యార్ధి మంచి పౌరుడు కాగలడు. మంచి పౌరుడు మంచి అధికారి, నాయకుడు కాగలడు. భావి జీవితంలో సంఘంలో గౌరవప్రద జీవితాన్ని గడపాలంటే మంచి విద్యార్ధిగా ఎంతో చదవాలి. ఎంతో గౌరవ మర్యాదలు అందుకోవాలి. స్కూలు తర్వాత కూడా మిమ్మల్ని ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు స్కూల్లో గుర్తుచేసుకోవాలి. ఉన్నత విద్యాభ్యాసానికి, ఉన్నత స్థాయిలో పదవులు చేపట్టడానికి, ఉన్నతంగా జీవించడానికి పాఠశాల విద్యా విద్యాభ్యాసమే తొలి మెట్టు అవుతుంది. తొలి పాఠాలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచే నేర్చుకోవాలి. మంచి విద్యార్ధి కావడానికి ప్రయత్నించండి. మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. మంచి విద్యార్ధి లక్షణాలు…
– కష్టపడేతత్వం బ సమయపాలన
– ఊహాశక్తి బ భావప్రకటనా శక్తి
– సమయస్ఫూర్తి బ. క్రమశిక్షణ
– చదువుపట్ల అత్యంత ఆసక్తి.
– సజనాత్మకత బ. సహకార భావన
– నేర్చుకోవాలన్న, తెలుసుకోవాలన్న తపన.
విధేయత :
విధేయతగా ఉండడం విద్యార్థి జీవితంలో ఎంతో కీలకం. ఉపాధ్యాయుల పట్ల, సీనియర్లపట్ల విధేయత ఉండాలి. ఎందుకంటే మీరు ఎంతో తెలివిగల విద్యార్ధి అయినప్పటికీ మూర్ఖంగా, నిర్లక్ష్యంగా, ఉపాధ్యాయులపట్ల అగౌరవంగా ఉంటే ఎవరూ భరించలేరు, మెచ్చుకోరు. మీకు అన్ని సబ్జెక్టులూ అత్యుత్తమ మార్కులు వచ్చేస్థాయిలో రావాలని లేదు కానీ తరగతి గదిలో, స్కూలు ఆవరణలో మాత్రం ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌ పట్ల విధేయంగా వ్యవహరించాలి. ఆ విధేయతే ఎంతో మేలు చేస్తుంది. అదే మిమ్మల్ని మంచి పౌరునిగా ఆ తర్వాత కాలంలో సమాజం గుర్తిస్తుంది.
తరగతిలో అందరికంటే మీరు తెలివిగల విద్యార్ధి కావచ్చు. మీరు అన్ని పాఠాలూ త్వరగా నేర్చుకునే లక్షణంతో ఉపాధ్యాయులను ఆకట్టుకొనవచ్చు. కానీ తోటి విద్యార్థులపట్ల చులకనగా, ఉపాధ్యాయుల పట్ల అవిధేయతతో ప్రవర్తించడం మంచిది కాదు. దీనివల్ల మీ పట్ల ఇతరులకు పున్నటువంటి అభిమానం పోతుంది. మంచి విద్యార్థి అన్న గౌరవం పోగొట్టుకుంటారు. క్రమంగా ఇంటివద్ద, పరిసరాల్లోనివారూ మిమ్మల్ని దూషించినా పెద్దగా ఆశ్చర్య పోనక్కర్లేదు. అన్నింటా విధేయత కలిగివుండడం ఎంతో మంచిది. మీకంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పెద్దలు ఎంతో తెలిసినవారు, చదువుకున్నవారన్న ధ్యాస కలిగివుండాలి. ఆ భావనతోనే ప్రవర్తించాలి. అపుడే మీరు నిజంగా మంచి విద్యార్ధి అనిపించుకుంటారు.
సెలవల్లో…
స్కూలు సెలవలు మీరు ఎలా గడుపుతున్నారు? ఈ ప్రశ్న మీరు స్వయంగా వేసుకున్నారా? లేకుంటే ఒక్కసారి పరిశీలించండి. సాధారణంగా స్కూలు సెలవలు ఇవ్వగానే బంధువుల ఇళ్లకి, ఊళ్లకి వెళ్లి సరదాగా గడిపేయాలన్న ఆలోచనే ముందుగా వస్తుంది. కొంతమంది ఉన్నచోటనే సరదాగా గడిపేయాలని అనుకుంటారు. మరి… చదువు విషయం? క్లాసు పుస్తకాలు మర్చిపోతారా? ఎందుకు?
సెలవలు సరదాగా గడపడానికే కావచ్చు. కానీ రోజూ కనీసం గంటపాటు పాఠ్యపుస్తకాలు చదువుకోవాలి. ముఖ్యంగా మీకు రాని సబ్జెక్టులు, అనుమానం ఉన్న సబ్జెక్టుల్లో భయాలను వదిలించుకునే ప్రయత్నాలు చేయాలి. ఇందుకు తల్లిదండ్రులు లేదా బంధువులు, పెద్దల సహాయాన్ని పొందాలి. ఒక తరగతి నుంచి పై తరగతికి వెళ్లినపుడు పుస్తకాలు, పాఠ్యాంశాలు పెరుగుతాయి. ఎంతో ఏకాగ్రత పెట్టవలసి వస్తుంది. మీకు అనుమానంగా ఉండే సబ్జెక్టు మరింత భయపెట్టనూ వచ్చు. అందువల్ల ఈ సెలవల్లో ముఖ్యంగా ఆ సబ్జెక్టు లేదా సబ్జెక్టుకు సంబంధించిన తరగతి పుస్తకాలు సంపాదించి నేర్చుకోవడం ఆరంభించాలి. తర్వాత కొత్త తరగతికి వెళ్లినపుడు మీకు భయం ఉండదు.
అలాగే ఇంట్లోవారికి సహకరించడం అలవర్చుకోవాలి. చిన్న చిన్న పనులు చేస్తుండాలి. పనులు చేయడంవల్ల, సహకరించడం వల్ల మీకూ అనేక మెళకువలు తెలుస్తాయి. మీ పనులు మీరు చేసుకోగలరు. చిన్నదానికి తల్లిదండ్రులపై ఆధారపడటం మంచిది కాదు. అలాగే మీలోని ప్రత్యేక ఆసక్తిని మరింత పెంపొందించుకోవచ్చు. ఆటలు, పుస్తకపఠనం లేదా సంగీతం ఏదయినా సరే మీకు ఉన్న ఆసక్తిని పెద్దవారికి తెలియజేస్తే దానికి అనుగుణంగా వారు ఎంతో సహకరించగలరు. సెలవల్లో కొత్తగా ఏదన్నా నేర్చుకోవడానికి ఎంతో సమయం ఉంటుంది. కనుక సెలవల సమయాన్ని వధా చేయకండి.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img