Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeహెల్త్నొప్పి ఎందుకు వస్తుంది?

నొప్పి ఎందుకు వస్తుంది?

- Advertisement -

నొప్పి తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు, సార్వత్రికంగా మనిషి జీవితంలో నొప్పి ఒక అంతర్గతభాగం. అత్యంత అరుదైన, జన్మతః నొప్పికి స్పందించని జబ్బుతో పుట్టినవాళ్ళని మినహాయించి, మనుషులందరికీ, ఎన్నో రకాల కారకాలకు, పుట్టుకనుండి, జీవితాంతము వరకు, చిన్న, పెద్ద, ఆడ, మగా తేడా లేకుండా, శరీరానికి కష్టం కలిగినప్పుడు, నొప్పి ఉత్పన్నమవ్వడమూ, దానిని భరించవల్సి రావడమూ అత్యంత సహజం.

వైద్యశాస్త్రం నొప్పిని వాస్తవిక/ సంభావ్య శారీరక కణజాల హానిపట్ల, ఒక అవాంఛనీయ ఐన్ద్రిక మానసిక అనుభూతిగా పరిగణిస్తుంది. ఈ పరిభాషానుసారం, నొప్పి రెండు విధాలుగా బాధ కలిగిస్తుందన్నది గమనార్హం. ఒకటి శారీరకం, రెండవది మానసిక. పలుసందర్భాలలో ఒకటి మరొకదానికి దారితీయొచ్చు. నొప్పికొనసాగే వ్యవధిని బట్టి రెండు రకాలు: స్వల్పకాలికనొప్పి, దీర్ఘకాలికనొప్పి.
ఐతే, ఎవరూ, ఏ పరిస్థితిలోనూ, ఏ మాత్రం అంగీకరించని అనుభూతి ఐన, ఒక అనుచితమైన, ఎంతటివారినైనా నిర్వీర్య పరిచేటటువంటి దైనప్పటికీ, శరీరానికి ఎక్కడ, ఏవిధమైన హాని జరగబోతున్నా/ జరిగినా, మెదడు నుండి వచ్చే మొట్టమొదటి సంకేతం నొప్పి. అనుచిత పరిస్థితి లేదా ఉద్దీపనలు నుండి శరీరాన్ని కాపాడుకొనే ప్రకతి సహజమైన రక్షకచర్య.
సాధారణంగా, శరీరంలో ఏ భాగం గాయపడినా, సూక్ష్మక్రిముల బారిన పడినా, ఏవైనా జబ్బుల కారణంగా నరాలకు హానిజరిగినా, వెంటనే ఆ ప్రదేశంలో నొప్పి మొదలౌతుంది. ఇది ఒక సూచికగా పనిచేస్తుంది. శరీరం అస్వస్థతకు గురైనప్పుడు మనం వాపుని గుర్తించకపోవచ్చు కానీ దానిలో భాగంగా మొదలయ్యే నొప్పిని అలక్ష్యం చేయలేం కదా! ఆ విధంగా నొప్పి, శరీరం దెబ్బతిన్నచోటికి, దష్టిని సారించేటట్టు చేస్తుంది.
శారీరక నొప్పి మూడు రకాలుగా ప్రకటితమౌతుంది.
మొదటిదీ, తరుచుగా జరిగేదీ, చేతికో, కాలికో, దెబ్బతగలడమూ/ కాలడమూ లేదా మరే విధమైన గాయమైనా, అక్కడున్న నరాల కొనలు ప్రేరేపితమయ్యి, సంకేతాలు వెన్ను ద్వారా మెదడుకు చేరుతాయి. వెనువెంటనే కొన్ని సంక్లిష్టమైన ప్రక్రియల ద్వారా నొప్పి మొదలై, గాయమైన చోటికి మన ధ్యాస కేంద్రీకతమయేట్టు జరుగుతుంది. ఈ రకమైన నొప్పి తాత్కాలికంగా ఉండి, గాయం నయమౌతున్న దశలో తగ్గిపోతుంది.
అంటువ్యాధి లేదా వాపుతో కూడుకొన్న నొప్పి ఇంకోవిధంగా వస్తుంది. ఇటువంటప్పుడు రోగనిరోధక యంత్రాంగము క్రియాశీలమయ్యి, కొన్ని రసాయనాల ద్వారా నొప్పిని కలిగిస్తుంది. ఈ రకమైన నొప్పి ఒకభాగానికి పరిమితం కాకుండా, వొళ్ళునొప్పులుగా కూడా బాధపెట్టవచ్చు.

పైన పేర్కొన్న రెండురకాల నొప్పులూ, శరీరంలో అత్యంత కీలకమైన, అగ్రశ్రేణి రక్షక చర్యలు.
మూడో రకం నొప్పి నరాల ధ్వంసానంతరం మొదలౌతుంది. ఇది హానికారకమైనది. దీనిని న్యూరోపతిక్పెయిన్‌ అని అంటారు. అనియంత్రిత మధుమేహం వంటి జీవనశైలి సంబంధిత వ్యాధుల్లో, నరాలు ధ్వంసమయ్యి, అకారణంగా క్రియాశీలమమవ్వడం వలన అకస్మాత్తుగా, ఉండుండి, తీవ్రమైన పోట్లు మొదలౌతాయి. ఈ విధమైన నొప్పి తీవ్రమైనదీ, దీర్ఘకాలం కొనసాగవచ్చు.
మానసికంగా నొప్పికి గురౌడం ఒత్తిడితో ముడిపడి ఉంటుంది. ‘మనసు బాధ పడింది’, ‘ఆ మాటలు గుండెకు గుచ్చుకున్నాయి’ వంటి భావ వ్యక్తీకరణలు ఇటువంటి నొప్పిని ఉద్దేశించి ప్రయోగిస్తుంటారు. కొన్ని చూడకూడనివి చూసినప్పుడు లేదా వినకూడనివి విన్నప్పుడు కలిగే ఒత్తిడి ప్రభావం ఈ రకమైన నొప్పిగా ప్రకటితమౌవచ్చు.
గుండె, శరీరంలో ఒక సంక్లిష్టమైన ధమని, సిరలవల్ల ఒత్తిడిలో విడుదలయ్యే కొన్ని రసాయనాల ప్రభావంతో ధమనులే కాకుండా వాటితో పాటు గుండె కండరాలు కూడా సంకోచ వ్యాకోచాలకు గురైనప్పుడు పదునైన కత్తి పోటులాగా చాలా తీవ్రమైన నొప్పి కలుగుతుంది.
స్త్రీలలో అదే రకమైన నొప్పి, ఆ పద్ధతిలోనే, అదే తీవ్రతతో ప్రసవ సమయంలో కలుగుతుంది. కొందరిలో అప్పుడప్పుడు ఋతుస్రావ సందర్భాల్లోనూ కలుగవచ్చు.
ఇవి స్వల్పకాలిక నొప్పులు. ఉద్దీపనలు సర్దుకోగానే నొప్పి తగ్గిపోతుంది. చంటిపిల్లలలో సాధారణంగా స్వల్పకాలిక నొప్పులే చూడడం జరుగుతుంది. పెద్దవారిలో నొప్పి పట్ల మానసిక ఆవరణ (సైకాలాజికల్‌ ఓవర్లే), అంటే ఉన్న తీవ్రతకన్నా ఎక్కువ బాధను అనుభవించడం జరుగుతుంటుంది. ఇది చంటిపిల్లలలో ఉండదు. కొద్దిగా ఎదిగినవాళ్లలో ఇది అప్పుడప్పుడు జరగవచ్చు.

దీర్ఘకాలిక నొప్పి ఎందుకు, ఎలా వస్తుంది? ఎంత కాలం ఉంటుంది?
ఇప్పటికీ ఇవి పెద్ద చిక్కు ప్రశ్నలే! ఈ నొప్పి మామూలుకన్నా ఎక్కువ తీవ్రతతో, అవధిని మించి సాగి, వ్యక్తుల్ని మానసికంగాను, శారీరకంగానూ బాధిస్తుంది. న్యూరాలజీ పెయిన్‌ లాబ్స్‌లో దీర్ఘకాలిక న్యూరలాజికల్‌ నొప్పిని అర్థం చేసుకొనే ప్రయత్నాలు ఇప్పటికీ ముమ్మరంగా సాగుతూనే ఉన్నాయి.
దీర్ఘకాలిక నొప్పి సంక్లిష్టత దష్ట్యా, ఈ నొప్పి (క్రానిక్‌ పెయిన్‌ సిండ్రోమ్‌) వల్ల కలిగే మానసిక ఆర్థిక సాంఘిక నష్టాలను గుర్తించడానికి, దాని వలన ఉద్యోగస్తులకు కలిగే ఆర్ధిక నష్టాన్ని భర్తీచేయడానికి గానూ ఐ.సి.డి. (ఇంటర్నేషనల్కోడ్ఫర్డిసీస్‌)10-కోడ్‌-+89.4 ఇవ్వబడింది.
దీర్ఘకాలిక నొప్పిని కలిగించే వ్యాధులు?
సాధారణంగా కండరాలు, వెన్ను, కీళ్లు, తరచూ తలనొప్పి, మైగ్రైన్‌, ఎముకలు-కండరాల నొప్పులు (మస్కులో స్కైలిటల్‌ పెయిన్‌), ఫైబ్రోమైయాల్జియా అనబడే కండరాల జబ్బు, ఇర్రిటేబుల్బవెల్‌ సింన్డోమ్‌, చివరిదశ కాన్సర్‌, మూత్రవ్యవస్థ, గర్భాశయ, గాల్‌బ్లాడర్‌, లివర్‌ సంబంధిత జబ్బుల కారణంగా నొప్పులు దీర్ఘకాలికంగా కొనసాగుతాయి.
దీర్ఘకాలిక నొప్పి వలన రోజువారీ జీవనగతి విధులు ఛిన్నాభిన్నం అయ్యే అవకాశాలు ఎక్కువ.
నొప్పిని ఎలా నియంత్రించడం?
నొప్పిని ఓర్చుకోవడం సంపూర్ణంగా వ్యక్తిగతమైన విషయం. అది వారి నొప్పిని ఓర్చుకోగలిగే హద్దుపై (పెయిన్త్రెషోల్డ్‌) ఆధారపడి వుంటుంది. కొందరు, ముఖ్యంగా దీర్ఘకాలిక నొప్పితో బాధపడేవాళ్లు, నొప్పిని తట్టుకోలేక, ఓ.టి.సి. (ఓవర్దికౌంటర్‌) లో లభ్యమయ్యే పెయిన్‌ కిల్లర్స్‌ వాడుతుంటారు. అలా వాడడంవల్ల, కొంతకాలానికి కాలేయ, జీర్ణకోశ, గుండె, మూత్రపిండాల, రక్తస్రావ సంబంధ జబ్బులు, మానసికంగా ఆ మందులపై ఆధారపడటం వంటి దుఃష్ఫలితాలకు లోను కావాల్సి వస్తుంది.
నొప్పికి మాత్రమే విడిగా మందులు వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, నొప్పి శరీరంలో అంతర్లీనంగా జరుగుతున్న అవాంఛనీయ ప్రక్రియలకు సూచిక కాబట్టి, ఆ కారకాలను వుద్దేశించి చికిత్స జరిగితే, నొప్పి దానంతటదే తగ్గిపోతుంది. వైద్యపర్యవేక్షణలో, అంటువ్యాధి పరంగా తగురీతిలో ఆంటిబయోటిక్స్‌, వాపుపరంగా ఆంటీ- ఇంఫ్లమేటరీ, ఎముకలు-కండరాల నొప్పుల పరంగా ఫీజియోథెరపీ, యోగా, తదితర చికిత్సా విధానాలు అవలంబించడం అన్ని విధాలా మంచిది. దీర్ఘకాలిక నొప్పికైతే ఇది తప్పనిసరి.

డాక్టర్‌ మీరా,రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అఫ్‌ మైక్రోబయాలజీ,ఫీవర్‌ హాస్పిటల్‌ /ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌, హైదరాబాద్‌.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad