మానవాళి శ్రేయస్సు కోసం చేసిన విశిష్ట సేవలకుగానూ అందించే అత్యున్నత గౌరవం నోబెల్. వైద్య విజ్ఞానం, సాహిత్యం, శాంతి, ఆర్థికశాస్త్రం వంటి విభాగాల్లో ప్రతి సంవత్సరం ఈ బహుమతులు అందజేస్తారు. సాంస్కృతిక వార సత్వం, జ్ఞాన సంపద, ఆధ్యాత్మిక లోతులు కలిగిన మన దేశానికి ఈ గౌరవం రావాలని భావిస్తాం. కానీ వాస్తవాన్ని తార్కికంగా పరిశీలిస్తే నిరాశ కలుగు తుంది. స్వాతంత్య్రం పొంది ఏడున్నర దశాబ్దాలు గడుస్తున్నా భారతదేశానికి లభించిన నోబెల్ బహుమతులను వేళ్ల మీద లెక్కించవచ్చు. రాజకీయ, సామాజిక, విద్యా, పరిశోధనా వ్యవస్థలలో ఉన్న లోపాలు దీని వెనుక ఉన్న కారణాలనిపిస్తుంది. ”మన ప్రతిభ తక్కువా? లేక మన వ్యవస్థ ప్రపంచ ప్రమాణాలకు అందుకోవడంలో విఫలమైందా?” అనే ప్రశ్నలు తప్పక మనసులో ఉత్పన్నమవుతాయి.
భారత్‌లో పుట్టిన లేదా భారత మూలాలున్న వ్యక్తులు ఇప్పటివరకు సాధించిన నోబెల్ గౌరవాలు ఇలా ఉన్నాయి. 1. రవీంద్రనాథ్ టాగూర్ (1913)-సాహిత్యంలో నోబెల్ అందుకున్నారు. ఆయన రచించిన గీతాంజలి ప్రపంచ సాహితీవేత్తలను మంత్రముగ్ధులను చేసింది. 2. సి.వి.రామన్ (1930) -భౌతిక శాస్త్రంలో కాంతి వ్యాప్తి (రామన్ ఎఫెక్ట్) ఆవిష్కరణకు గౌరవం అందుకున్నారు. 3. మదర్ థెరిసా (1979) – శాంతి విభాగంలో, పేదల సేవకు, మానవత్వానికి ప్రతీకగా గుర్తింపు లభించింది. 4. అమర్త్యసేన్ (1998) – ఆర్థికశాస్త్రంలో, సామాజిక ఎంపిక సిద్ధాంతానికి నోబెల్ గౌరవం అందుకున్నారు. 5. కైలాష్ సత్యార్థి (2014) – బాల కార్మిక వ్యతిరేక ఉద్యమానికి శాంతి బహుమతి లభించింది. 6. హర్ గోవింద్ ఖోరానా (1968) – జీవ రసాయన శాస్త్రంలో, జన్యు క్రమాల పరిశోధనకు (అమెరికాలో పనిచేసి) నోబెల్ అందుకున్నారు. 7. సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ (1983) – భౌతిక శాస్త్రంలో, నక్షత్ర పరిణామంపై పరిశోధనకు (అమెరికా పౌరుడిగా) నోబెల్ వరించింది. 8. వెంకటరామన్ రామకృష్ణన్ (2009) – రైబోసోమ్ నిర్మాణంపై పరిశోధనకు (బ్రిటన్ పౌరుడిగా) అందుకున్నారు. 9. అబ్దుల్ రజాక్ గూర్నా (2021)- భారత మూలాలున్న టాంజానియా రచయిత, సాహిత్యంలో గౌరవం అందింది. అంటే మొత్తం తొమ్మిది సందర్భా ల్లో భారతీయ మూలాలున్న వ్యక్తులు నోబెల్ బహుమతిని అందుకున్నారు.
కానీ స్వదేశంలో పనిచేస్తూ గెలుచుకున్న వారు కేవలం ఇద్దరు మాత్రమే. టాగూర్, సి.వి. రామన్. ఇతర దేశాలతో పోలిస్తే మనకు తక్కువ ఎందుకు వస్తున్నాయి? పరిశోధనలకు తగిన ప్రోత్సాహం లేకపోవడం. అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాలు తమ జీడీపీలో 2.5 శాతం నుండి 3 శాతం వరకు పరిశోధనకు ఖర్చు చేస్తాయి. కానీ భారత్‌లో అది కేవలం 0.7 శాతం వరకు మాత్రమే ఉంది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఉన్నత స్థాయి పరిశోధనల కోసం అవసరమైన వనరులు, ఆధునిక ప్రయోగశాలలు, ఆర్థిక మద్దతు లేవు. ఈ లోటు కారణంగా ప్రతిభావంతులు స్వదేశంలో సాధించలేక విదేశాలకు వెళ్తున్నారు. విద్యావ్యవస్థలో సృజనాత్మ కతకు తక్కువ ప్రాధాన్యం వుంటోంది. మన విద్యా ర్థులను ప్రశ్నలు అడగడం కాకుండా సమాధానాలు గుర్తుపెట్టుకోవడానికే ప్రోత్సహిస్తారు. ”ఎందుకు?” అనే ప్రశ్న అడగడంతో సైన్సు ప్రారంభం అవుతుంది. కానీ మన పాఠశాలలు ”ఎలా గుర్తుపెట్టుకోవాలి?” అనే దానికే దృష్టి పెడుతున్నాయి.
ఈ విధానం విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలను అణచి వేస్తుంది. మేథో వలస (బ్రెయిన్ డ్రెయిన్) భారత యువత ప్రపంచంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలలో ప్రతిభ చూపుతున్నారు. కానీ వారిలో ఎక్కువ మంది విదేశాల్లోనే స్థిరపడి పోతున్నారు. భారత ప్రభుత్వ పరిశోధనా సంస్థలు వీరిని ఆకర్షించడంలో విఫలమవుతున్నాయి. దీంతో, భారత మేధస్సు ఫలితాలు ఇతర దేశాలకు కేటాయించబడుతున్నాయి. నోబెల్ కమిటీ నిర్ణయాలు పూర్తిగా రాజకీయ రహితమని చెప్పడం కష్టమే. ప్రపంచ రాజకీయ దృక్పథం, పాశ్చాత్య మీడియా అభిప్రాయాలు కూడా బహుమతుల ఎంపికపై ప్రభావం చూపుతాయి. భారతదేశంలో వ్యక్తిగత కృషికి ప్రాధాన్యం తక్కువ. మన పరిశోధనలలో చాలా భాగం ప్రభుత్వ సంస్థల సమిష్టి కృషిగా ఉంటుంది. నోబెల్ బహుమతులు సాధారణంగా వ్యక్తిగత ప్రతిభకు ఇస్తారు. ఈ కారణంగా, భారత పరిశోధకులు వ్యక్తిగత గుర్తింపు పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
సామాజిక, సాంస్కృతిక కారణాలు, ఉద్యోగ ప్రాధాన్యంతో పరిశోధన వెనుకబడింది. భారత సమాజంలో పరిశోధనను వృత్తిగా చూడడం ఇప్పటికీ అరుదు. తల్లిదండ్రులు ఉద్యోగ భద్రత ఉన్న కోర్సులను మాత్రమే ప్రోత్సహిస్తారు. ఫలితంగా, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు కావాలనే ఆలోచన చిన్న వయసులోనే నశిస్తుంది. పరిశోధన వాతావరణం లోపం కూడా వుంది. మన దేశంలోని విశ్వవిద్యాలయాలు పాత పరికరాలతో, తగిన నిధులు లేకుండా పనిచేస్తున్నాయి. పరిశోధనలో స్వేచ్ఛా వాతావరణం లేకపోవడం, బ్యూరోక్రాటిక్ అడ్డంకులు పరిశోధకులను నిరుత్సాహ పరుస్తున్నాయి. నూతన ఆవిష్కరణకు అవసరమైన స్థిరమైన పునాది కూడా వుండడంలేదు. భాషా అవరోధాలూ వున్నాయి. భారత పరిశోధకులు అనేక సందర్భాల్లో స్థానిక భాషల్లో రచనలు చేస్తారు. కానీ అంతర్జాతీయ గుర్తింపు పొందాలంటే ఆ పరిశోధనలు ఇంగ్లీష్‌లో ప్రచురించాలి. ఈ భాషా గోడ కారణంగా భారత పరిశోధనలు అంతర్జాతీయ వేదికలపై తగిన స్థానం పొందలేకపోతున్నాయి.పరిశోధనలో పెట్టుబడి పెడితేనే ప్రతిభ ఫలిస్తుంది (పట్టిక). విజ్ఞానాన్ని దేశాభిమానంగా మార్చుకున్న దేశాలకే ప్రపంచ గౌరవం ఎక్కువగా లభిస్తోంది.
పరిశోధన బడ్జెట్ పెంపు-ప్రభుత్వం రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఖర్చును కనీసం రెండుశాతం వరకు పెంచాలి. విశ్వవిద్యాలయ స్వాతంత్య్రం- శాస్త్రవేత్తలు స్వేచ్ఛగా ప్రయోగాలు చేయగల వాతావరణం కల్పించాలి. యువ పరిశోధకులకు ప్రోత్సాహం- నూతన ఆవిష్కరణలకు గ్రాంట్లు, స్టార్టప్ మద్దతులివ్వాలి. అంతర్జాతీయ ప్రచురణ- మన పరిశోధనలు ‘నేచర్, సైన్స్’ వంటి పత్రికల్లో ఎక్కువగా కనిపించాలి. భాషా అవరోధాల తొలగింపు- స్థానిక భాషలతో పాటు ఇంగ్లీష్‌లో కూడా ప్రచురణను ప్రోత్సహించాలి. విదేశీ మేధావుల తిరిగి రాక- విదేశాల్లో ఉన్న భారతీయ శాస్త్రవేత్తలకు దేశంలో సముచిత అవకాశాలు ఇవ్వాలి.
విద్యా సంస్కరణలు- పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మ కతను ప్రోత్సహించే పాఠ్యపుస్తకాలు రూపొందించాలి. నోబెల్ కన్నా గొప్పది జ్ఞానం. నోబెల్ బహుమతి ఒక గౌరవం. కానీ దానికంటే గొప్పది జ్ఞాన సృష్టి. టాగూర్ లేదా రామన్‌లు నోబెల్ కోసం పనిచేయలేదు. వారు మానవజాతి శ్రేయస్సు కోసం ఆలోచించారు. ఇప్పటి భారత యువతకు కావలసింది అదే దృక్పథం. జ్ఞానం పట్ల ఆసక్తి, పరిశోధన పట్ల నిబద్ధత, సమాజానికి ఉపయోగపడే విజ్ఞానం సృష్టించే తపన పెంచితే, నోబెల్ బహుమతి మన తలుపు తట్టడం అసాధ్యమేమీ కాదు. భారత మేధస్సు అద్భుతమని ప్రపంచం గుర్తించింది. ఇప్పుడు మన బాధ్యత. దానిని ఆచరణలో చూపించడం, ప్రపంచానికి మార్గదర్శకం కావడం. అప్పుడు ‘భారత్‌కి నోబెల్ ఎందుకు రావడం లేదు?’ అనే ప్రశ్న మళ్లీ వేసుకోవాల్సిన అవసరమే ఉండదు.

కె.జయరాజ్



