Wednesday, December 3, 2025
E-PAPER
Homeఆటలుఇక్కడే ముగిస్తారా?

ఇక్కడే ముగిస్తారా?

- Advertisement -

సిరీస్‌ విజయంపై భారత్‌ గురి
సమం చేయాలని సఫారీల తపన
భారత్‌, దక్షిణాఫ్రికా రెండో వన్డే నేడు
మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

రోకో రాకతో భారత క్రికెట్‌ సరికొత్త కళ సంతరించుకుంది. రాంచీలో ఈ తరం దిగ్గజాలు టెస్టు సిరీస్‌ ఓటమిని మరిపిస్తూ.. దంచికొట్టారు. మంచు ప్రభావంతో ఛేదనలో సఫారీలు ఆఖరు వరకు భయపెట్టినా.. రాంచీలో భారత్‌ ఘన విజయం సాధించింది. నేడు రాయ్ పూర్‌లో అదే జోరు కొనసాగిస్తూ సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ బవుమా రాకతో దక్షిణాఫ్రికా బలోపేతం కాగా.. సిరీస్‌ను విశాఖలో తేల్చుకునేందుకు రాయ్ పూర్‌లో విజయమే లక్ష్యంగా సఫారీలు బరిలోకి దిగుతున్నారు. భారత్‌, దక్షిణాఫ్రికా రెండో వన్డే నేడు.

నవతెలంగాణ-రాయ్ పూర్‌
ఓవైపు టెస్టులు, మరో వైపు టీ20 క్రికెట్‌ అభిమానులను ఊపేస్తుండగా.. వన్డేలు సైతం రంగ ప్రవేశం చేశాయి. 50 ఓవర్ల ఫార్మాట్‌ ప్రాధాన్యత కోల్పోతున్న వేళ.. రాంచీలో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ షో వన్డే సిరీస్‌కు సరికొత్త కళ తీసుకొచ్చింది. నాణ్యమైన క్రికెటర్లు వన్డే ఇన్నింగ్స్‌లు ఎంత కళాత్మకంగా నిర్మిస్తారో రాంచీలో కోహ్లి చూపించాడు. రాయ్ పూర్‌లో నేడు అభిమానులు అటువంటి తరహా ఇన్నింగ్స్‌లు కోరుకుంటుండగా.. మ్యాచ్‌కు ముందే టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. భారత్‌, దక్షిణాఫ్రికా నేడు రెండో వన్డేలో ఢీకొట్టనుండగా.. ఫోకస్‌ పూర్తిగా విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మపైనే ఉండనుంది. రాయ్ పూర్‌లో నెగ్గితే సిరీస్‌ 2-0తో భారత్‌ వశమవనుండగా.. విశాఖ వన్డే నామమాత్రం కానుంది. ఇక్కడ పుంజుకుని.. సిరీస్‌ రేసును వైజాగ్‌కు తీసుకెళ్లాలని దక్షిణాఫ్రికా ఎదురుచూస్తుంది.

మార్పులు ఉంటాయా?
రాంచీ వన్డేలో రిషబ్‌ పంత్‌ బెంచ్‌కు పరిమితం అయ్యాడు. గువహటిలో కెప్టెన్సీ వహించిన పంత్‌.. రోజుల వ్యవధిలో రాంచీలో డ్రింక్స్‌ అందించాడు. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మిడిల్‌ ఆర్డర్‌లో నం.4 స్థానంలో ఆడాడు. కానీ రుతురాజ్‌ రాంచీలో నిరాశపరిచాడు. మిడిల్‌ ఆర్డర్‌లో రుతురాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వరుసగా 4, 5 స్థానాల్లో ఆడుతున్నారు. వాషింగ్టన్‌ సుందర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌కు జట్టు మేనేజ్‌మెంట్‌ మరో అవకాశం ఇచ్చే యోచనలో ఉంది. కీలక నం.4 స్థానంలో పంత్‌ను తీసుకోవాలని అనుకుంటే.. రుతురాజ్‌కు నిరాశ తప్పదు. యశస్వి జైస్వాల్‌ కఠిన పరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాడు. వరుసగా స్వల్ప స్కోర్లకు వికెట్‌ పారేసుకుంటున్న జైస్వాల్‌.. జట్టులో స్థానానికి న్యాయం చేయాల్సిన అవసరం ఏర్పడింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ఫామ్‌లోకి రావటం భారత్‌కు శుభ పరిణామం. బౌలింగ్‌ విభాగంలో అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రానా, ప్రసిద్‌ కృష్ణ పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. కొత్త బంతితో, పాత బంతితో పాటు మంచు ప్రభావంలో సత్తా చాటడం ఈ ముగ్గురు పేసర్లకు కఠిన సవాల్‌. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌తో పాటు రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌లు స్పిన్‌ బాధ్యతలు తీసుకోనున్నారు.

బవుమా వస్తున్నాడు
రెగ్యులర్‌ కెప్టెన్‌ తెంబ బవుమా రాంచీ వన్డేకు విశ్రాంతి తీసుకున్నాడు. కేశవ్‌ మహరాజ్‌తో పాటు బవుమా నేడు రారుపూర్‌లో ఆడనున్నారు. బవుమా కోసం రియాన్‌ రికెల్టన్‌ బెంచ్‌కు పరిమితం కానుండగా.. సుబ్రెయాన్‌ స్థానంలో మహరాజ్‌ ఆడనున్నాడు. ఎడెన్‌ మార్‌క్రామ్‌, క్వింటన్‌ డికాక్‌లు స్పిన్‌ బాగా ఆడగలరు. భారత్‌ మంచి గణాంకాలు ఉన్నాయి. టాప్‌ ఆర్డర్‌లో ఈ ఇద్దరూ మెరిస్తే సఫారీ బ్యాటింగ్‌ కష్టాలు సగం తీరినట్టే. బవుమా రాకతో టాప్‌ ఆర్డర్‌ మరింత బలోపేతం కానుంది. లోయర్‌ ఆర్డర్‌లో టోనీ, డెవాల్డ్‌ సహా టెయిలెండర్‌ మార్కో యాన్సెన్‌ బ్యాట్‌తో గొప్పగా రాణిస్తున్నాడు. ఇది దక్షిణాఫ్రికాకు అదనపు అనుకూలత. రెగ్యులర్‌ కెప్టెన్‌ రాకతో దక్షిణాఫ్రికా రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోంది. రాయ్ పూర్‌లో నెగ్గి.. సిరీస్‌ను నిర్ణయాత్మక పోరుకు తీసుకెళ్లాలని సఫారీలు చూస్తున్నారు.

పిచ్‌, వాతావరణం
రాయ్ పూర్‌లో ఇప్పటివరకు భారత్‌, న్యూజిలాండ్‌ 2023 వన్డే మ్యాచ్‌ మాత్రమే జరిగింది. నేడు భారత్‌, దక్షిణాఫ్రికా పోరు రెండో లిస్ట్‌-ఏ మ్యాచ్‌ కానుంది. తొలి మ్యాచ్‌లో బౌలర్ల హవా నడిచింది. కానీ నేడు మ్యాచ్‌కు పిచ్‌ బ్యాటర్లకు, బౌలర్లకు సమంగా అనుకూలించనుంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం గణనీయంగా ఉంటుంది. లక్ష్యాలను కాపాడుకోవటం అంత సులువు కాబోదు. ఎటువంటి వర్షం సూచనలు లేవు. మ్యాచ్‌ సమయంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.

మంచు ప్రభావం!
రాయ్ పూర్‌ వన్డేలో మంచు గణనీయంగా ఉండనుంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసే జట్టుకు పరుగుల వేట సులువు కానుండగా.. బౌలర్ల పని కష్టతరం అవుతుంది. రాంచీలోనూ ఇది కనిపింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 130/5 నుంచి.. 332/10 వరకు పుంజుకుంది. మంచు కురిసే వేళ బౌలర్లకు బంతిపై పట్టు చిక్కదు. ఫలితంగా లైన్‌ అండ్‌ లెంగ్త్‌ తడబాటుకు లోనవుతుంది. బ్యాటర్లు ఇదే అదనుగా పరుగులు పిండుకుంటారు. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేయాల్సి వస్తే.. తొలి 20 ఓవర్లలోనే స్పెషలిస్ట్‌ బ్యాటర్లను వెనక్కి పంపాలి. లేదంటే, మంచు ప్రభావంలో బ్యాటర్లను కట్టడి చేయటం కష్టంగా మారుతుంది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునేందుకు మంచు ప్రభావం దోహదం

తుది జట్లు (అంచనా)
భారత్‌ : యశస్వి జైస్వాల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రుతురాజ్‌ గైక్వాడ్‌/రిషబ్‌ పంత్‌, కెఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా, హర్షిత్‌ రానా, కుల్‌దీప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్‌ కృష్ణ.
దక్షిణాఫ్రికా : ఎడెన్‌ మార్‌క్రామ్‌, క్వింటన్‌ డికాక్‌, తెంబ బవుమా (కెప్టెన్‌), మాథ్యూ బ్రీట్జ్కె, టోనీ, డెవాల్డ్‌ బ్రెవిస్‌, మార్కో యాన్సెన్‌, కార్బిన్‌ బాచ్‌, కేశవ్‌ మహరాజ్‌, బర్గర్‌, బార్ట్‌మాన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -