కేంద్ర ప్రభుత్వ చర్యపై లద్దాఖ్‌లో నిరసనలు
ఉత్సవ విగ్రహాలుగా మిగిలిన
లెఫ్టినెంట్ గవర్నర్, స్థానిక అధికారులు
న్యూఢిల్లీ : లెఫ్టినెంట్ గవర్నర్, సీనియర్ అధికారుల నుంచి ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునే అధికారాలను తొలగిస్తూ గత నెల 24న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలపై లద్దాఖ్‌లో నిరసనలు మిన్నంటుతున్నాయి. వంద కోట్ల రూపాయల వరకూ ఖర్చయ్యే పథకాలు, ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే అధికారం ఇప్పుడు కేంద్ర హోం శాఖ చేతిలోకి పోయింది. లెఫ్టినెంట్ గవర్నర్ కేవలం ఉత్సవ విగ్రహంగానే మిగిలారు. ఇప్పటి వరకూ ఇరవై కోట్ల రూపాయల వరకూ ఖర్చయ్యే ప్రాజెక్టులకు పరిపాలనా కార్యదర్శుల వంటి లడఖ్ ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చే వారు. ఇప్పుడు అది కూడా కేంద్ర హోం శాఖ చేతికే వచ్చింది. మూడు కోట్ల నుంచి పది కోట్ల రూపాయల వరకూ అయ్యే పనులకు సంబంధించి ఆర్థిక పరమైన అనుమతి ఇచ్చే అధికారాన్ని చీఫ్ ఇంజినీర్లు, జిల్లా మెజిస్ట్రేట్లు సైతం కోల్పోయారు. అంటే దీనర్థం ఆర్థిక పరమైన నిర్ణయాలన్నీ కేంద్ర హోం శాఖ తీసుకోవాల్సిందే. స్థానికంగా లెఫ్టినెంట్ గవర్నర్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ వారి ప్రమేయం ఏమీ ఉండదు.లద్దాఖ్‌లో ప్రజలు ఎన్నుకున్న రెండు హిల్ కౌన్సిల్స్…లెV్‌ా, కార్గిల్…ఉన్నాయి. ఐదు కోట్ల రూపాయల వరకూ ఖర్చయ్యే ప్రాజెక్టులకు ఈ కౌన్సిల్స్ అనుమతి ఇచ్చేవి. ఇప్పుడు వాటి ఆర్థిక అధికారాలను కూడా కేంద్ర హోం శాఖ లాగేసుకుంది. 2019లో లడఖ్ ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన తర్వాత కేంద్ర హోం శాఖ అక్కడి వారికే ఆర్థిక అధికారాలు కట్టబెట్టింది. అయితే పారదర్శకత కోసం, ప్రాంతీయ అభివృద్ధికి మెరుగైన సమన్వయం కోసమే తాను ఆర్థికాధికారాలను తీసుకున్నానని కేంద్ర హోం శాఖ చెబుతున్నప్పటికీ తమ ఆర్థిక అధికారాలను హరించడానికే ఈ ఆదేశాలు జారీ చేసిందని లద్దాఖ్ వాసులు మండిపడుతున్నారు.
హస్తినలో నిర్ణయాలా?
లద్దాఖ్ వంటి సుదూర ప్రాంత ప్రజల అవసరాలు, అభివృద్ధి అంశాల గురించి ఎక్కడో దేశ రాజధానిలో కూర్చున్న అధికారులకు ఎలా తెలుస్తుందని సీనియర్ నేత, లెV్‌ా అపెక్స్ బాడీ చైర్మెన్ చెరింగ్ దోర్జే ప్రశ్నించారు. లద్దాఖ్‌కు స్వతంత్ర ప్రతిపత్తి, ప్రత్యేక హోదా కల్పించే విషయంపై ఈ సంస్థ కేంద్రంతో చర్చలు జరుపుతోంది. లద్దాఖ్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి నిర్ణయాలు ఇక్కడ కాకుండా ఢిల్లీలో ఎలా తీసుకుంటారని దోర్జే నిలదీశారు. ఇది ఆచరణ సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. లద్దాఖ్‌లో నెలకొనే వాతావరణం కారణంగా కేవలం ఆరు నెలలు మాత్రమే పనులు జరుగుతాయని, కాబట్టి నిర్ణయాలను వేగవంతంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. కానీ ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా తాము ప్రాజెక్టుల కోసం ఢిల్లీలోని హోం శాఖ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని తెలిపారు.
మోడీ నిర్ణయంతో ఉద్యమానికి నాంది
కేంద్ర హోం శాఖ తాజా నిర్ణయంతో కేంద్రంపై లడఖ్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లెV్‌ాలో సెప్టెంబరులో జరిగిన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. పోలీసులు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత రెండు రోజులకే కేంద్రం నిరసనకారులపై ఉక్కుపాదం మోపింది. జాతీయ భద్రతా చట్టం కింద వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను నిర్బంధించింది. ఆయన హింసను ప్రేరిపిస్తున్నారంటూ అభియోగం మోపింది. గడచిన నాలుగు సంవత్సరాలుగా స్వయం ప్రతిపత్తి కోసం, భూములకు రక్షణ కోసం, ఉద్యోగాల కోసం లద్దాఖ్‌లో ప్రజా ఉద్యమం ఊపందుకుంటోంది. ఒకప్పటి జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చీలుస్తూ 2019లో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యమానికి పునాది వేసింది.
అన్యాయాన్ని అర్థం చేసుకున్న లఢక్ వాసులు
జమ్మూకాశ్మీర్ ప్రజల మాదిరిగానే తాము కూడా తమ హక్కులు కోల్పోయామని లద్దాఖ్ వాసులు గ్రహించారు. రాజ్యాంగంలోని 370, 35ఏ అధికరణల రద్దుతో స్థిరాస్తులను కలిగి ఉండే హక్కును కోల్పోయామని, ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కూడా ఎండమావులుగా మారాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. లద్దాఖ్‌కు కేంద్ర పాలిత ప్రాంత హోదా కల్పించడాన్ని 2021లో కార్గిల్, లెV్‌ా వ్యతిరేకించాయి. దానికి బదులుగా రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేశాయి. పలు డిమాండ్లపై లడఖ్ నాయకత్వంతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతూనే ఉన్నప్పటికీ ఎలాంటి పురోగతి కన్పించలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ తీసుకున్న తాజా నిర్ణయం లద్దాఖ్ వాసుల ఆగ్రహానికి గురైంది. ముస్లింలు అధికంగా నివసించే కార్గిల్ ప్రాంతంలోని ప్రజలు కూడా లద్దాఖ్ వాసులకు సంఘీభావం తెలిపారు.
ప్రజా ప్రతినిధులేరి?
లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఐదు సంవత్సరాల పదవీకాలం అక్టోబర్ 30న ముగిసింది. అయినా కేంద్రం ఎన్నికల షెడ్యూలు ప్రకటించలేదు. గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించలేదు. దీంతో క్షేత్ర స్థాయిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేకుండా పోయారు. కార్గిల్‌లోని హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ పదవీకాలం 2028 చివరి వరకూ ఉంది. ‘2019 తర్వాత లద్దాఖ్ లో ప్రజాస్వామ్యం మిణుకు మిణుకు మంటూ ఉంది. ఇప్పుడు అది కూడా ఆరిపోయింది’ అంటూ ఓ కార్గిల్ వాసి చేసిన వ్యాఖ్య అక్కడి వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.
మా ‘ఆర్థిక’ నిర్ణయాలు హరిస్తారా?
- Advertisement -
- Advertisement -



