Thursday, December 18, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'ఫీజు' పథకాన్ని రద్దు చేస్తారా?

‘ఫీజు’ పథకాన్ని రద్దు చేస్తారా?

- Advertisement -

ప్రతి విద్యార్థికి విద్య అనేది ప్రాథమిక హక్కు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, స్కాలర్‌షిప్‌ అనేవి దానం కాదు. విద్యార్థుల హక్కు. ఒకవైపు ‘విద్యావంత మైన తెలంగాణ’ అని చెబుతూనే, రాష్ట్రంలో మరోవైపు విద్యార్థుల భవిష్యత్తు చీకటిలో మిగిలిపోతుంది. ఉన్నత చదువు అభ్యసించే విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌ మెంట్‌, స్కాలర్‌షిప్‌ లాంటి పథకాలు ఒక గొప్ప ఆర్థిక భరోసా. ఇవి ఉన్నంత వరకూ ఉన్నత చదువు చదవాలనుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఏ ఢోకా ఉండదు. కానీ, గత కొన్నేండ్లుగా ఈ పథకం కింద ప్రభుత్వం విడుదల చేసే బకాయిలు సమయానికి విడుదల చేయక పోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిపోయింది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలు మొత్తం రూ.10,400 కోట్లకు పైగా చేరుకుంది. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్‌ వంటి కోర్సుల్లో చేరుతున్నారు. వారి ఆశలు మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌పైనే ఆధారపడి ఉంటాయి. కానీ ప్రభుత్వాలు ఈ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయాయి. కొన్ని ప్రయివేటు కళాశాలలు విద్యార్థుల చదువు పూర్తయినా స్కాలర్‌షిప్‌, ఫీ రీయంబర్స్‌ అకౌంట్లలో పడలేదని సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపేస్తున్నాయి.

దీంతో కొందరు విద్యార్థులు లోన్లు తీసుకుని, అప్పు తీసుకొని చదువు కొనసాగిస్తున్నారు. వారిని బ్యాంకు, అప్పు వడ్డీలు తల్లిదండ్రులను బరువు వెక్కిస్తున్నాయి. దీంతో చాలా మంది విద్యార్థులు మధ్యలోనే చదువును మానేయాల్సి వస్తోంది. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు. విద్యార్థుల కలలు, కుటుంబాల ఆశలు ధ్వంసంమవు తున్నాయి. 2019 నుండి ఇప్పటివరకు స్కాలర్‌ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులు సక్రమంగా జరగలేదు. బడ్జెట్‌లో నిధులు కేటాయిం చినా, విడుదలలో ఆలస్యం కారణంగా బకాయిలు కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. పేద విద్యార్దులు అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికంగా వెనుకబడిన తరగతుల విద్యా ర్థులు ఉన్నత చదువులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌ మెంట్స్‌పై ఆధారపడి చదువుతున్నారు.గత ఆరేండ్ల నుండి విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజులను ప్రభుత్వం చెల్లించడం లేదు. రాష్ట్రంలో సంవత్సరానికి 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరికి సంవత్సరానికి రూ.3వేల కోట్లు అవసరం అవుతాయి. కానీ 2019 నుండి ఇప్పటి వరకు బకాయిలు పేరుకోని ఉన్నాయి.

2019 నుండి 2023 వరకు -4865 కోట్లు బకాయిలు ఉండగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3177 కోట్లు పెండింగ్‌లో ఉంచింది. ఇంకా 2025 -2026 సంవత్సరం బకాయిలు కూడా ఇంకా అదనం. ప్రభుత్వం ఒక్కో విభాగంలో ఉన్న వాటిని క్రమంగా విడుదల చేసిన ఈ బకాయిలు లేకుండా చేయవచ్చు.ఆ వివరాలు చూస్తే ఇంజినీరింగ్‌ విద్యార్ధులకు 2947కోట్లు, ఫార్మసి విద్యార్థులకు 553 కోట్లు, డిగ్రీ, పీజీ, ఓకేషనల్‌ విద్యార్థులకు 1462 కోట్లు, పాలిటెక్నిక్‌, ఐటిఐ, జూనియర్‌ కళాశాలకు 178 కోట్లు మొత్తం బకాయిలు ఉండగా వీటిలో విద్యార్ధులకు ఇచ్చే స్కాలర్‌షిప్స్‌ మొత్తం 1924 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. విద్యార్థులు ఆందోళనలు చేసినప్పుడు టోకెన్లు జారీ చేయడం తప్ప ట్రెజరీల నుండి ఒక్కరూపాయి కూడా నిధులు విడుదల చేయడం లేదు.ఈ ఆర్థిక సంవత్సతరం బడ్జెట్‌లో విద్యార్థుల సంక్షేమానికి 3246 కోట్లు కేటాయిస్తే 1384 (42శాతం) కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇవ్వవలసిన బకాయిలు విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు కళాశాలలను పలుమార్లు మూసి వేశాయి.

ప్రభుత్వం చర్చలు జరుపుతుంది తప్ప బకాయిలు విడుదల చేయడం లేదు.నిరవధికంగా బంద్‌ ప్రకటించిన తర్వాత వారిపై బెదిరింపులకు దిగి విజిలెన్స్‌ దాడులు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చి విద్యా సంస్థలపైకి పంపుతుంది. లక్షలాది మంది అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్న ప్రభుత్వం కనీసం బాధ్యతతో వ్యవహరించడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాక ముందు ఫీజులను విడుదల చేయాలని నాటి అధికార పక్షంపై పోరాడింది. తాము అధికారంలోకి వస్తే మరింత పారదర్శకంగా అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో పెట్టింది. ఇచ్చిన హామీని అమలు చేయ కుండా ఇప్పుడు అసలు ఫీజు పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నది. నగదు బదిలీ పేరుతో డైరెక్టుగా విద్యార్ధి ఖాతాలో ఫీజులు జమ చేసే ప్రయత్నం చేయడం పలు అనుమానాలను రేకెత్తిస్తున్నది.

ప్రభుత్వ కళాశాలలో, యూనివర్సిటీలలో ఫీజులు పెంచడం, రెగ్యులర్‌ కోర్సులను సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులుగా మార్చడం వెనుక ఇదే జరుగుతున్న కసరత్తు ఇదేనా? దీనివల్ల ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా విద్యార్ధులు తమ సర్టిఫికెట్స్‌ తీసుకోవాలన్నా, కళాశాలలో చేరాలన్నా ముందు డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. క్రమంగా ఫీజులు ఇవ్వడం తగ్గించడం, ఫీజుల ఖర్చుల్లో అవినీతి జరిగిందనే పేరుతో ఈ పథకం ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌,స్కాలర్‌ షిప్స్‌ అనేది కేవలం పథకం కాదు-అది సామాజిక న్యాయం ఆర్థిక స్తంభం. ఇది కూలిపోతే, సమాన విద్యాహక్కు అనే కల సాక్షాత్కారం అవదు.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బకాయిలను విడుదల చేసి, ఈ పాస్‌ వ్యవస్థను పారదర్శకంగా మార్చి, ప్రతి విద్యార్థికి చెల్లింపు తేదీని నిర్ధారించాలి. విద్యార్థుల భవిష్యత్తు కాగితాల బంధనంలో కాకుండా, విద్యా సమానత్వంలో నిలబడేలా చూడాలి. భావిభారత భవిష్యత్తును నిలబెట్టాలి.

టి.నాగరాజు
9490098292

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -