ఇంగ్లాండ్‌తో భారత్ ఢీ నేడు
మ. 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-ఇండోర్
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో ఆతిథ్య భారత్ మరో సవాల్‌కు సిద్దమైంది. గ్రూప్ దశలో శ్రీలంక, పాకిస్తాన్‌పై సాధికారిక విజయాలు సాధించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన… ఆ తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవిచూసింది. సెమీఫైనల్ రేసు రసవత్తరంగా మారిన తరుణంలో టీమ్ ఇండియా నేడు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇంగ్లాండ్ నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు సాధించిన ఉత్సాహంలో ఉంది. వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దు కావటంతో ఆ జట్టు విజయాల జోరుకు బ్రేక్ పడింది. భారత్ నుంచి స్మతీ మంధాన, ప్రతిక రావల్, హర్లీన్ డియోల్ సహా జెమీమా రొడ్రిగస్, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు ఆశించిన మేరకు రాణించటం లేదు. బలమైన ఇంగ్లాండ్‌ను ఓడించేందుకు ఒకరిద్దరి మెరుపులు సరిపోవు.
దీంతో సీనియర్లు బ్యాటర్లు మంధాన, జెమీమా, హర్మన్‌ప్రీత్‌లు నేడు బ్యాట్‌తో బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బౌలింగ్ విభాగంలో ఆరో బౌలర్ సేవలు లేకపోవటం భారత్‌ను దెబ్బతీస్తోంది. క్రాంతి గౌడ్, శ్రీ చరణి, దీప్తి శర్మ, స్నేహ్‌రానా లు రాణిస్తున్నా.. నాణ్యమైన జట్లు ఆరో బౌలర్ లేని లోటును సొమ్ముచేసుకుంటున్నాయి. నేడు ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు తుది జట్టు కూర్పులో మార్పులు ఉండేందుకు అవకాశం ఉంది. ఇంగ్లాండ్ తరఫున బ్యూమోంట్, హీథర్ నైట్, వ్యాట్, నటాలీ సీవర్, ఎకెల్‌స్టోన్‌లు కీలకం కానున్నారు. భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్ ఇండోర్‌లో నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం అవుతుంది.