యువత ఆశగాలి మేడలేనా!
మంత్రి సాబ్ పైన బోలెడు ఆశలు పెట్టుకున్న యువతరం
మంత్రికి అధిక మెజార్టీ ఇచ్చిన స్వంత మండలంపైన ప్రేమ కరువైనదా!
మంత్రి స్వంత మండలంలో బస్ స్టాండ్ లేదు
మంత్రి మాటలు ఉత్త మాటలేనా
తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
నవతెలంగాణ – కాటారం
భూపాల్ పల్లి జిల్లాలోని కాటారం మండలం రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత పాలకులు పలు వేదికలపై ప్రసంగాలు చేస్తూ మాయ మాటలతో ప్రజలను మంచి చేసుకొని రాజకీయంగా ఎదుగుతున్నారు. ఈ ప్రాంత సమస్యలను గాలికి వదిలేసి వారి కుటుంబమే అభివృద్ధి చెందేలా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు అనుభవిస్తూ.. నాలుగు రోడ్లు, ఆరు బిల్డింగులు కట్టి ఇదే అభివృద్ధి అని ఈ ప్రాంత నాయకుడు పబ్బం గడుపుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు సొంత మండలం ఎన్ హెచ్ 3 జాహితీయ రహదారిపై ఉన్న కాటారం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు స్టాండ్ ఏర్పాటు కలగానే మిగిలింది.
మంత్రి హామీలకే పరిమితమై…. బస్టాండ్ ఏర్పాటు ప్రతిపాదనలోనే నిలిచింది. బస్టాండ్ లేక ప్రయాణికులు , ప్రజలు ఏళ్లకాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ నిర్మాణ విషయంలో ఎవరు చొరవ చూపడం లేదన్నారు. ఐదు మండలాలకు కూడలిగా ఉన్న కాటారంలో బస్టాండు ఏర్పాటు చేయాలని ప్రజలు రెండు దశాబ్దాలుగా నాయకులను ప్రభుత్వాలను కోరుతున్నారు. ఆర్టీసీ అధికారుల, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకుపోయినా స్పందన లేదు. పలుమార్లు నాయకుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లేదు. జాతీయ రహదారి ఉన్న బస్టాండ్ లేని కారణంగా బస్సులను రోడ్ల పైన నిలుపుతున్నారు. దాంతో తరచూ ట్రాఫిక్ అంతరాయంతో కాటారం, మహా ముత్తారం, మహాదేవపూర్, కాలేశ్వరం, పలిమెల, మలహర్ మండలాల చెందిన వందలాది మంది ప్రయాణికులు, కాటారం నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు.
బస్టాండ్ లేకపోవడంతో రోడ్ల పక్కన, హోటళ్ల, దుకాణాలు ఎదుట బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. ఎండ, వాన కాలంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తరుచూ రోడ్లపై ప్రయాణికులు ఉండడం వలన అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
కాటారంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలి: బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు రామిళ్ళ కిరణ్

కాటారం మండల కేంద్రంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు రామిళ్ళ కిరణ్ అన్నారు.
శ్రీధర్ బాబుని మంథని ప్రాంత ప్రజలు ఐదు సార్లు గెలిపించినా.. బస్ స్టాండ్ ఏర్పాటు చేయకపోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. మంత్రిగా పనిచేస్తూ.. మంథని ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని అన్నారు. మంత్రి మాట్లాడిన ప్రతిసారి మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని అంటారు. మరి కాటారంకు కనీసం బస్ స్టాండు ఎందుకు లేదో మంత్రి చెప్పాలని, అభివృద్ధికి కాటారం సబ్ డివిజన్ ఆమడ దూరంలో ఉందని, కాటారం, గారెపల్లి మొత్తం తిరిగేతే తెలుస్తుందని అన్నారు. ఉన్నదల్లా..మాటల అభివృద్దే తప్ప చేతల అభివృద్ధి ఏమి లేదని అన్నారు. దమ్ము ఉంటే వెంటనే మోడల్ బస్ స్టాండ్ కట్టించాలని డిమాండ్ చేశారు.