Thursday, November 27, 2025
E-PAPER
Homeజాతీయంకీలక బిల్లులపై చర్చించేనా?

కీలక బిల్లులపై చర్చించేనా?

- Advertisement -

హడావిడిగా ఆమోదం పొందేందుకు మోడీ ప్రభుత్వ యత్నాలు
డిసెంబర్‌ 1 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు
న్యూఢిల్లీ :
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు వచ్చే నెల 1వ తేదీన ప్రారంభం కాబోతున్నాయి. 19వ తేదీ వరకూ ఇవి కొనసాగుతాయి. సెలవలు పోను కేవలం పది హేను రోజులు మాత్రమే జరిగే ఈ సమావేశాలలో తొమ్మిది కీలక బిల్లులకు ఆమోదం పొందాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో అణు విద్యుత్‌, మార్కెట్లు, ఉన్నత విద్య, మౌలిక సదుపాయాలకు సంబంధించిన బిల్లులు ప్రధానమైనవి. స్టాక్‌ మార్కెట్‌, కార్పొరేట్‌ చట్టం, బీమాకు సంబంధించిన బిల్లులు కూడా వీటిలో ఉన్నాయి. సమావేశాలు కేవలం పదిహేను రోజులు మాత్రమే జరుగుతుండడంతో ఇలాంటి ముఖ్యమైన బిల్లులపై చర్చకు పెద్దగా సమయం ఉండకపోవచ్చు. లోతైన చర్చకు అవకాశం ఇవ్వకుండానే వాటిని హడావిడిగా ఆమోదింపజేసుకోవడం ప్రభుత్వ ఉద్దేశంగా కన్పిస్తోంది.
ప్రభుత్వం తీసుకురాబోయే బిల్లుల్లో అత్యంత కీలకమైనది అణు విద్యుత్‌ రంగానికి సంబంధించింది. ఇది రాజకీయంగా సున్నితమైన ప్రతిపాదన. అణు విద్యుత్‌ రంగాన్ని ప్రయువేటు శక్తులకు కట్టబెట్టడం దీని ఉద్దేశం. పది సంవత్సరాల క్రితం ఇది ఊహకు సైతం రాని ప్రతిపాదన. దేశంలోని అత్యంత శక్తివంతమైన ఆరు కార్పొరేట్‌ గ్రూపులు…అదానీ, అంబానీ, టాటాలు, వేదాంత, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, నవీన్‌ జిందాల్‌కు చెందిన జిందాల్‌ ఎనర్జీ…ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగల్‌ వచ్చిన మరుక్షణమే అణు రంగంలోకి ప్రవేశించాలని తహతహలాడుతున్నాయి. అయితే వారి భాగస్వామ్యం చిన్న చిన్న మాడ్యులర్‌ అణు రియాక్టర్లకు ఆర్థిక సాయం అందించడం, వాటిని నిర్మించడం వరకే పరిమితం. సంప్రదాయ అణు విద్యుత్‌ ప్లాంట్లను నిర్మించాలంటే అనేక బిలియన్‌ డాలర్లు ఖర్చవుతాయి. అంతేకాక వాటి నిర్మాణానికి దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలమే పడుతుంది. అణు విద్యుత్‌ రంగాన్ని ప్రయువేటు సంస్థలకు అప్పగించడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు సంస్థలు ఎప్పుడూ దీర్ఘకాలిక భద్రత, విశ్వసనీయతపై కంటే లాభాల పైనే దృష్టి పెడతాయని వారు గుర్తు చేశారు. చండీఘర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం ఈ సమావేశాల్లో ప్రవేశపెడుతుందా లేదా అనేది ఇంకా తెలియడం లేదు. దీనిపై పంజాబ్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్ర బీజేపీ కూడా దీనిని వ్యతిరేకిస్తోంది. చండీఘర్‌ను తన రాజధాని నగరంగా పంజాబ్‌ చెప్పుకుంటోందని, ఈ బిల్లు ఆ వాదనను పూర్తిగా కనుమరుగు చేస్తుందని శిరోమణి అకాలీదళ్‌ మండిపడింది. ఉన్నత విద్యలో సంస్కరణలు తీసుకొచ్చే ందుకు ప్రభుత్వం మరోసారి ప్రయత్నిస్తోంది. యూజీసీ, మరో రెండు రెగ్యులేట రీ సంస్థల స్థానంలో వైద్య, న్యాయ అధ్యయనాలు మినహా మిగిలిన అన్ని విభాగాలనూ పర్యవేక్షించేందుకు ఒక ఉన్నత విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే మరో ముఖ్యమైన బిల్లు బీమా బిల్లు. భారతీయ బీమా వెంచర్లలో దేశీయ, విదేశీ సంస్థలకు వంద శాతం యాజమాన్యం కల్పించేందుకు ఈ బిల్లు ను ఉద్దేశించారు. కీలకమైన బిల్లులను బుల్‌డోజ్‌ చేసి హడావిడిగా ఆమోదింప జేసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు విమర్శించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -