– బీసీ రిజర్వేషన్ల అమలుకు పార్లమెంటులో చట్టం చేయాలి
– బీజేపీ ఎంపీలకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరిక
– ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి
– మోడీ ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచాలి : తమ్మినేని
– గవర్నర్ ఎందుకు వెనుకాడుతున్నారు?: ఎస్. వీరయ్య
– కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు : టి. జ్యోతి
– ఇందిరాపార్కు వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మహాధర్నా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేసేం దుకు పార్లమెంటులో చట్టం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కేంద్ర ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లును కేంద్రంచే ఆమోదింపజేయాలని కోరారు. లేదంటే వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను అమలు చేసేం దుకు పార్లమెంటులో చట్టం చేయా లని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు, సామాజిక న్యాయానికి, కులగణనకు బీజేపీ వ్యతిరేకమని విమ ర్శించారు. రాజ్యాంగానికి కూడా వ్యతి రేకమని చెప్పారు. మనువాద రాజకీయాలు చేస్తున్నదని అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లలో ముస్లిములను సాకుగా చూపి అడ్డుకుంటున్నారనీ, బీసీ రిజర్వేషన్లలో హిందువులు కూడా ఉన్నారనీ, వారికి బీజేపీ వ్యతిరేకమా? అని ప్రశ్నించారు.
బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని విమర్శించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ తెలంగాణలో ఎందుకు వ్యతిరేకిస్తున్నదని ప్రశ్నించారు. బీసీల ఓట్లు కావాలి కానీ వారికి రిజర్వేషన్లను కల్పించొద్దా?అని అడిగారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు అడ్డంకిగా ఉన్న బీజేపీ తీరును గ్రామగ్రామాన ప్రజలకు వివరించాలని సూచించారు. ఆ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలంటూ కేంద్రంపై, ప్రధాని మోడీపై ఒత్తిడి తేవాలనీ, లేదంటే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరు, ఎంపీలు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని డిమాండ్ చేశారు. బీజేపీలో చేరిన ఆర్ కృష్ణయ్య, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న మందకృష్ణ మాదిగ స్పందించాలనీ, కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఢిల్లీకి కాంగ్రెస్ నాయకులే కాకుండా అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. బీజేపీకి వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఉండే పార్టీలను భాగస్వాములను చేయాలని చెప్పారు. కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలు చేయొద్దని సూచించారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలనీ, సీపీఐ(ఎం) మద్దతిస్తుందని అన్నారు.
గవర్నర్‌ది నాన్చివేత ధోరణి : ఎస్ వీరయ్య
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై గవర్నర్ న్యాయపరిశీలన పేరుతో కావాలనే నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే గవర్నరే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం వెనక్కి ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై లబ్ది పొందేందుకు పార్టీలు యత్నిస్తున్న తీరును ఎత్తిచూపారు. పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ బిల్లు పెడితే ఏ పార్టీ రంగు ఏంటో బయటపడుతుందన్నారు. రాజ్యాంగంలో కులాల ప్రస్తావనే లేదనీ, వెనుకబడిన సామాజిక తరగతుల వారికి రిజర్వేషన్లు ఇవ్వాలనే ప్రస్తావన ఉందని చెప్పారు.
బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు : టి జ్యోతి
తెలంగాణకు చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఎందుకు మాట్లాడటం లేదని అధ్యక్షత వహించిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలను ఆలస్యం చేస్తున్నదని విమర్శించారు. దీంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆగాయని చెప్పారు.
ప్రజల బాధలు పెంచేలా మోడీ సర్కారు నిర్ణయాలు : జూలకంటి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల కష్టాలు, బాధల్ని తీర్చే చట్టాలు చేయకుండా వారు మరింత ఇబ్బందులు పడేలా, కష్టాలపాలయ్యేలా చేస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు హోల్‌సేల్‌గా అమ్మేందుకు యత్నిస్తున్నదనీ, కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు చేస్తున్నదని ఎండగట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని పార్టీలనూ కలుపుకుని ముందుకు పోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లను మొదటి నుంచీ బీజేపీ వ్యతిరేకిస్తున్నదనీ, అది ఆ పార్టీ నిర్ణయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి సాగర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి, బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవి రమణ, ఆర్ శ్రీరాంనాయక్, ఆర్ అరుణజ్యోతి, పి ఆశయ్య, ఉడుత రవీందర్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్యం, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఆర్డినెన్స్‌ను సమర్థిస్తున్నాం : తమ్మినేని
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ల అమలు కోసం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుతోపాటు ఆర్డినెన్స్‌ను సమర్థిస్తున్నామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం చెప్పారు. బీజేపీకి వక్రబుద్ధి ఉందన్నారు. అందుకే బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించడం లేదని అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నదని విమ ర్శించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ వ్యతిరేకమని, అందుకే ఆమోదించడం లేదని చెప్పారు. బీహార్‌లో ఎన్నికల దృష్ట్యా తన వ్యతిరేకతను కప్పిపుచ్చుకుంటూ ముస్లింలను సాకుగా చూపుతోందన్నారు. ఢిల్లీకి అన్ని శక్తులనూ తీసుకెళ్లి కేంద్రంపై రాజకీయ ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఆమోదింపజేస్తారా… రాజీనామా చేస్తారా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES