Thursday, August 7, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిసంస్కృతిని సమాధి చేస్తారా?

సంస్కృతిని సమాధి చేస్తారా?

- Advertisement -

చరిత్ర అనేది కేవలం తారీఖులు, సంఘటనల కూర్పు కాదని, విశ్వమానవాళి తమ హక్కుల రక్షణ కొరకు చేసిన పోరాటమే చరిత్రగా రూపాంతరం చెందుతుం దని డి.డి.కొశాంబి తెలిపాడు. దీన్నే కారల్‌ మార్క్స్‌ వర్గ పోరాట ఘర్షణగా తేల్చి చెప్పాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రపంచాన్ని ఇంకా పాదాక్రాంతం చేసుకోవాలనే దుగ్ధతో సుంకాల రంకెలు వేస్తున్నాడు. స్వలాభం కోసం మిత్రదేశాలు, శత్రు దేశాలని చీల్చి చెండాడుతున్నాడు. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న రీతిలో విశ్వమానవాళి సాధించుకున్న ప్రగతి మార్గాలను పటాపంచలు చేయగలనని భ్రమిస్తున్నాడు.
తాజాగా యునెస్కో (ఐక్యరాజ్య సమితి విద్యా విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ)ను లెక్కలోకి తీసుకోనని, అమెరికా ఆ సంస్థకు తనవంతుగా చెల్లించే ఆర్థిక సహాయాన్ని నిలుపుదల చేస్తామని బెదిరిస్తున్నాడు.

చెరువు మీద అలిగి వెనకటికి ఎవడో ఏదో చేసినట్లు ఉన్నదీ తంతు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచశాంతిని సాధించే లక్ష్యంలో భాగంగా దేశ దేశాలన్నీ ఐక్యరాజ్య సమితి అనే గొడుగు కిందకు చేరాయి.అందులో భాగమే యునెస్కో. విద్య, శాస్త్రజ్ఞానం, సంస్కృతి అంశాల్లో ప్రపంచ దేశాల పరస్పర సహాయ సహకారం కోసం ఆ సంస్థ ఆవిర్భవించింది. యునెస్కో గుర్తించిన పారంపర్య చారిత్రక ప్రదేశాలకు (అవి ఎంతచిన్న దేశంలో ఉన్నా) విశేషమైన ఓ గుర్తింపు గౌరవం లభిస్తున్న విషయం తెలిసిందే. ఎంతో మంది చరిత్రకారులకు, సామాజిక శాస్త్రవేత్తలకు అవి మార్గదర్శి అయ్యాయి. అంతర్జా తీయ కీర్తి ప్రతిష్టలతో రాణిస్తూ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తు న్నాయి. ఉదాహరణకు మన రామప్ప దేవాలయం. వాటిని చూడగానే ఓ ఉత్సాహం. ఓ ఉత్తేజం. ఓ కనువిప్పు.
ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుండి, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుండి అమెరికా తప్పుకున్నది. కారణం అవి తమ జేబు సంస్థలుగా ఉండనందునే. అలాగే ప్రపంచ కాలుష్య నివారణ విషయంలో ఏర్పడిన పారిస్‌ ఒడంబడిక నుండి కూడా తప్పుకున్న విషయం తెలుసుకుని అందరూ ముక్కుమీద వేలేసుకున్నారు.

మానవ కృషి, పోరాటాల వలనే మానవీయ సంస్కృతి పరిఢవిల్లుతుంది. భావపరంగా, భౌతికపరంగా తమను తాము విముక్తి చేసుకునేందుకు మానవుడు నిరంతరం పోరాటం చేస్తాడు. ఇది చారిత్రక సత్యం.
ట్రంప్‌ను విమర్శిస్తున్నందుకు స్వదేశంలోని ఉత్తమశ్రేణి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికే నిధులు ఆపేసిన ట్రంప్‌కు యునెస్కో ఒక లెక్క కాదు మరి.
దేశాలు, దేశాధినేతలు నయానా భయానా తనకే లొంగిఉండాలన్న అహంకార ఆధిపత్య ధోరణి గల అమెరికా ట్రంప్‌కు ‘మానవ సంస్కృతి’తో ఏం పని?
ఆకలిదప్పులతో, స్రవిస్తున్న గాయాలతో, ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని క్షణమొక నరకంగా గాజాలో ప్రజలు బతుకుతుంటే… అందుక్కారణమైన ఇజ్రాయిల్‌ నేత నెతన్యాహును ట్రంప్‌ ఒక్కమాట అనడు. ‘కాగల కార్యం గంధర్వులే’ నెరవేర్చినట్టు ట్రంప్‌ ఆలోచనలు నెతన్యాహు అమలు పరుస్తున్నాడు. వారిద్దరు జిగిరీ దోస్తులు. పైగా నెతన్యాహు ట్రంప్‌కు నోబుల్‌ శాంతి బహుమతి రావా లని ప్రతిపాదిస్తాడు. ఇదో వైపరీత్యం. అసలు ఇది ఇచ్చిపు చ్చుకునే రాక్షస వ్యవహారం తప్ప ఇందులో మానవ శాంతి సందేశం ఏం ఉంటుంది? పిల్లి కండ్లు మూసుకుని పాలు తాగినట్టు, లోకం కండ్లు కప్పలేరు కదా!
అందుకే యావత్‌ మానవాళి నేడు గాజాకు మద్దతుగా నిలుస్తున్నది. ఈ మద్దతు జాతిహననంకు పాల్పడే యుద్ధోన్మాదులకు రుచించదు. భారత్‌-పాక్‌ల మధ్య ఉద్భవించిన యుద్ధాన్ని తానే నివారించానని సొంత డబ్బా కొట్టుకునే ట్రంప్‌కు లేదా అలాంటి వారికి విద్య, శాస్త్రజ్ఞానం, సంస్కృతిల అవసరం ఏం ఉంటుంది? ఎవరికి వారు ఆలోచించుకోవాలి.

అసలు యునెస్కో పాలస్తీనాను ఓ సభ్యదేశంగా గుర్తించడమే అమెరికాకు నచ్చడం లేదు. నిత్యం మానవ హననంతో రక్తమోడుతున్న పాలస్తీనా పూర్తి బాధ్యత ఇజ్రాయిల్‌దేనని (నెతన్యూహ) యునెస్కో నొక్కి వక్కాణించడం అస్సలు నచ్చడం లేదు. అందుక అరవై లక్షల డాలర్ల వరకు చెల్లించవలసిన యునెస్కో బకాయిలు చెల్లించడం మానివేసింది.
యుగయుగాల, తరతరాల పురావస్తు సంపద. ఏ ఖండంలో ఉన్నా, ఆ సంపద యావత్తు సమస్త మాన వాళికి చెందుతుందని, ఆ పారంపర్య వారసత్వ సంపదను అపురూపంగా భావించి పరిరక్షించడం ప్రపంచ మానవాళి అందరి కర్తవ్యం అని 1945లో యునెస్కో ఆవిర్భవించినపుడే తన లక్ష్యంగా ప్రకటించింది. బరితెగించిన ఈ కటిక స్వార్థానికి ఇప్పుడు యునెస్కో లక్ష్యం కంటకింపు అయింది.
దాదాపు 200 దేశాలకు పైగా యునెస్కోలో సభ్యత్వం ఉన్నది. 170 దేశాలలో 1,248 చారిత్రిక ప్రదేశాలను గుర్తించి తగు రక్షణకు ఆయా ప్రభుత్వాలతో కలసి పాటుపడుతున్నది.

ఇరాక్‌లో నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటి బాబిలాన్‌ నగరం, బీహార్‌లో క్రీ.పూ. మూడవ శతాబ్దం నాటి నలందా విశ్వవిద్యాలయం వంటి ప్రాచీన ఆనవాళ్లను గమనించి కాపాడేందుకు యునెస్కో చేస్తున్న ప్రయత్నం అద్వితీయ కృషి ఆనాటి ప్రజల జీవనశైలి (సంస్కృత)కి అవి సాక్షీభూతంగా నిలుస్తాయి. గతం నుండి భవితకు ప్రయా ణించే కరదీపికలు అవి. ఆ విలువ ఎనకట్టలేనిది. మరి అలాంటి యునెస్కోను నిర్వీర్యం చేయడం అంటే మానవాళి తన చరిత్రను తానే సమాధి చేసు కోవటం. ఆత్మహత్యా సదృశ్యం. అందుకే మరోవైపు నుండి యునెస్కో రక్షణకు చైనా దేశం ముందుకు రావడం ముదావహం.
కె.శాంతారావు
9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -