Sunday, March 15, 2026
E-PAPER
Homeజాతీయంట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోండి

ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోండి

- Advertisement -

వారి రాజ్యాంగ హక్కులపై దాడి చేయడం మానండి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో

న్యూఢిల్లీ : ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌) సవరణ బిల్లు 2026పై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ బిల్లును తక్షణమే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ బిల్లుతో తీసుకొచ్చిన సవరణలు నల్సా వర్సెస్‌ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ధ్రువీకరించిన స్వయం నిర్ణయ లింగ గుర్తింపు సూత్రాన్ని ప్రాథమికంగా తిరస్కరిస్తున్నాయని పొలిట్‌బ్యూరో విమర్శించింది. సవరణల్లోని క్లాజ్‌ 2 లింగ గుర్తింపు స్వయంనిర్ణయ సూత్రాన్ని పక్కన పెట్టి, ఒక ప్రధాన వైద్య అధికారి నేతృత్వంలో ఒక వైద్య బోర్డు ఇచ్చే సర్టిఫికెట్‌ ద్వారానే లింగ గుర్తింపును ధ్రువీకరిస్తుందని, సవరణల్లోని సెక్షన్‌ 4 ఈ సర్టిఫికెట్లను జారీ చేసే ముందు వీటిని తనిఖీ చేసే అధికారాన్ని జిల్లా మేజిస్ట్రేట్‌కు ఇచ్చిందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. అంటే ఈ నిబంధనల ఉద్దేశం ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ను వైద్య పర్యవేక్షణలో ఉంచడంతో పాటు అధికార గుప్పెట్లో ఉంచడంగా పొలిట్‌బ్యూరో విమర్శించింది.

అలాగే, ఈ సవరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ద్వారా హామీ ఇచ్చిన గోప్యత, గౌరవం, వ్యక్తిగత స్వయంప్రతిపత్తికి సంబంధించిన ప్రాథమిక హక్కులను నేరుగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల నిర్వచనాన్ని ఈ సవరణల ద్వారా తీవ్రంగా కుదించారని విమర్శించింది. 2019 చట్టం ట్రాన్స్‌మెన్‌, ట్రాన్స్‌ఉమెన్‌, జెండర్‌-క్వీర్స్‌, వైవిధ్య జెండర్లను గుర్తించిందని, కానీ తాజా సవరణలు నిర్థిష్ట సామాజిక- సాంస్కృతిక కమ్యూనిటీలను, అంతర్గత సెక్స్‌ వైవిధ్యాలను కలిగిన వ్యక్తులను గుర్తించడానికి నిరాకరిస్తున్నాయని తెలిపింది. స్వయం నిర్ణయ లింగ గుర్తింపులను తిరస్కరించడంతో పాటు, అలాంటి గుర్తింపు వ్యక్తులను చట్టపరమైన రక్షణ పరిధి నుంచి పూర్తిగా తొలగిస్తున్నాయని విమర్శించింది.

హిందూత్వ ప్రపంచ దృక్పథంతో నడిచే బీజేపీ ప్రభుత్వం జెండర్‌, సామాజిక క్రమాన్ని కఠినమైన, బ్రాహ్మణ ఆలోచనలతో నింపడానికి చాలాకాలంగా ప్రయత్నిస్తోందని, ఈ బిల్లు వ్యక్తులు తమకు తాముగా నిర్వచించుకునే హక్కును తిరస్కరించే మునువాదీ దృక్పథమైన తిరోగమన వాదనను ప్రతిఫలిస్తుందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఈ తిరోగమన మనస్తత్వాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా ప్రదర్శించిందని, ట్రాన్స్‌పర్సన్స్‌ చేసే రక్తదానాలపై వివక్షతో కూడిన నిషేధాన్ని తొలగించే ఉద్దేశం లేదని అత్యున్నత కోర్టుకు బీజేపీ ప్రభుత్వం ధ్రువీకరించిన విషయాన్ని పొలిట్‌బ్యూరో గుర్తు చేసింది.

ఈ తిరోగమన వాద సవరణలు 2019 చట్టంలో పరిమిత స్థాయిలో పొందుపర్చిన రక్షణలను కూడా క్రమపద్ధతిలో రద్దు చేస్తున్నాయని, వీటిని ప్రభుత్వ నిఘా, మెడికల్‌ గేట్‌ కీపింగ్‌, బ్యూరోక్రాటిక్‌ నియంత్రణతో భర్తీ చేస్తున్నాయని విమర్శించింది. ఈ బిల్లు ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల రాజ్యాంగ హక్కులపై దాడిగా వర్ణించిన పొలిట్‌బ్యూరో దీన్ని తక్షణమే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. అలాగే, ఏదైనా ఒక నిర్ధిష్ట సమాజం హక్కులను, జీవితాలను ప్రభావితం చేసే చట్టాలను రూపొందిస్తున్నప్పుడు ఆ సమాజపు భాగస్వామ్యులతో ముందస్తు సంప్రదింపులు లేకుండా వాటిని ప్రవేశపెట్టవద్దని ఈ ప్రకటనలో ప్రత్యేకంగా ప్రస్తావించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -