అక్టోబర్ నెలకు అవార్డులు ప్రకటన
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అక్టోబర్ నెలకు ఉత్తమ మహిళా, పురుష క్రికెటర్ల పేర్లను ప్రకటించింది. ఈసారి రెండు అవార్డులు దక్షిణాఫ్రికా ప్లేయర్లు కైవసం చేసుకోవడం విశేషం. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన సాధించిన ఎల్ వోల్వార్డ్ ఐసీసీ వుమెన్స్ ప్లేయర్ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. దక్షిణాఫ్రికా స్పిన్ బౌలర్ సేనురన్ ముత్తుసామి ఐసీసీ మెన్స్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు. వోల్వార్డ్ వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టును ఫైనల్ వరకు చేర్చింది. ఫైనల్‌లో భారత్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడినా.. సెంచరీతో కదం తొక్కింది. అలాగే ఈ టోర్నమెంట్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ప్రపంచకప్‌లో ఆడిన ఎనిమిది మ్యాచులు 470 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అజేయంగా 169 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేరింది. భారత్‌తో జరిగిన ఫైనల్‌లోనూ సెంచరీ చేసింది.
ఈ సందర్భంగా లారా వోల్వార్డ్ మాట్లాడుతూ అవార్డు రావడం సంతోషంగా ఉందని పేర్కొంది. ఇక ఈ అవార్డు కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, ఆసిస్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్‌నర్ పోటీపడ్డారు. అక్టోబర్ నెలకు గాను పురుషుల క్రికెటర్ విభాగంలో ఎడమచేతివాటం దక్షిణాఫ్రికా స్పిన్నర్ సేనురన్ ముత్తుసామి ఎంపికయ్యాడు. పాకిస్తాన్‌కు చెందిన నోమన్ అలీ, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్‌ను వెనక్కి నెట్టి మరీ ఐసీసీ అవార్డును అందుకున్నాడు. పాకిస్తాన్ పర్యటనలో ఈ దక్షిణాఫ్రికా ప్లేయర్ బ్యాట్‌తో పాటు బంతితోనూ అద్భుత ప్రదర్శన చేసి ఈ అవార్డును అందుకున్నాడు. ఐసీసీ బెస్ట్ ప్లేయర్‌గా ఎంపికవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ముత్తుసామి 106 పరుగులు చేసి 11 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు.



