– నిందితుల కోసం పోలీసుల గాలింపు
– ఐద్వా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం జిల్లా కేంద్రంలోని కస్బా బజార్‌లోని రద్దీగా ఉండే దర్గా వద్ద శుక్రవారం రాత్రి సమయంలో మహిళను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్యచేసిన ఘటన జరిగింది. మృతురాలి భర్త మడెం నరసింహారావు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేపల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందిన నరసింహారావుతో మడెం ప్రమీల(28) 15 ఏండ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. తర్వాత ఆర్‌ఎంపీ డాక్టర్‌గా వృత్తి రీత్యా దంపతులు పాల్వంచకు వలస వచ్చి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇంటి ఓనర్ బొమ్మ శ్రావణ్.. ప్రమీలతో చనువుగా ఉంటూ ఆమె వద్ద కొంత నగదు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని ప్రమీల అడిగితే తన కోరిక తీర్చాలని మానసికంగా వేధించేవాడు. ఈ నేపథ్యం లో దంపతులు ఇరువురి మధ్య మనస్పర్థలు పెరిగి 6 ఏండ్లుగా విడిగా జీవిస్తున్నారు. ప్రమీల తన స్వగ్రామం ఖమ్మం జిల్లా పండితాపురంలో ఉన్న బంధువుల అండతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ బట్టల షాపులో సేల్స్ ఉమన్ గా పనిచేస్తోంది. కాగా, ఆరు నెలలుగా తిరిగి భర్త నరసింహారావుతో ఫోన్‌లో మాట్లాడుతూ కలిసి ఉండేందుకు ప్రమీల ప్రయత్నం చేస్తోంది. శ్రావణ్ అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వాలని ప్రమీల.. అడిగిన ప్రతిసారీ ప్రమీలను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి శ్రావణ్ బామ్మర్ది రాజేష్ తన అక్క సంసారంలో ప్రమీల అడ్డుగా ఉందన్న కోపంతో మాటు వేసి ప్రమీలపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేసి పారిపోయినట్టు మృతురాలి భర్త ఆరోపించారు. కాగా, మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారం భించారు. హత్యకు గల కారణాలు ఏమిటనే కోణంలో క్లూస్ టీమ్, కాల్ డేటా, సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నట్టు ఖమ్మం వన్ టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు.
హత్యను నిరసిస్తూ ఐద్వా ర్యాలీ..
ఖమ్మంలో ఇటీవల మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఐద్వా ఖమ్మం డివిజన్, త్రీటౌన్ కమిటీల ఆధ్వర్యంలో శనివారం వన్‌టౌన్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో వరుసగా మహిళలను హత్యలు చేస్తున్నారని అన్నారు. వీటిని నియంత్రించి మహిళలకు భద్రత కల్పించడంలో పోలీస్ శాఖ విఫలమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమీల హంతకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు మెరుగు రమణ, ఖమ్మం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు బాగం అజిత, పత్తిపాక నాగసులోచన, జిల్లా ఉపాధ్యక్షులు మెహరున్నీసాబేగం, త్రీటౌన్ అధ్యక్ష, కార్యదర్శులు బండారు సునీత, అమీన, శోభ, సుభద్ర, అలివేలు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంలో మహిళ దారుణ హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



