దేశంలో స్త్రీలకు సామాజిక భద్రత లేదు
ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో పాల్గొనాలి : ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే పిలుపు
విశాఖపట్నం నుంచి ఎస్ వెంకన్న
పోరాటాల్లో మహిళలు నిర్ణయాత్మకశక్తిగా ఎదగాలని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే పిలుపునిచ్చారు. దేశంలో వారికి భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సీఐటీయూ చేపడుతున్న ఉద్యమాల్లో స్త్రీలు భాగస్వామ్యం పెంచే దిశగా కృషి చేస్తామన్నారు. ఫిబ్రవరి 12న ప్రారంభమైన సార్వత్రిక సమ్మెలో మహిళ లను భాగస్వాములను చేస్తామని తెలిపారు. బుధవారం విశాఖ పట్నంలో జరుగుతున్న సీఐటీయూ 18వ అఖిల భారత జాతీయ మహాసభల్లో ఆమె సౌవర్థ సందేశమిచ్చారు. దేశంలో మహిళలు, కార్మికులు, పీడితులపై పాలకుల దాడి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో విద్య, వైద్య రంగాలను బలహీన పరుస్తున్నారని తెలిపారు. కార్మిక చట్టాలను మార్చేసి కోట్లాది కార్మికులు, మహిళలపై ఒత్తిడి పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో ఆర్ధిక పోరాటాలు చేస్తూనే… మతోన్మాదంపై ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఉత్తరఖాండ్‌లో యూనిఫామ్ సివిల్ కోడ్ పెడితే కోర్టులో ఐద్వా కేసు వేసి పోరాడిందని గుర్తుచేశారు. లేదంటే దేశమంతా అమలు చేసేందుకు కేంద్ర పాలకులు సిద్ధమయ్యేవారని తెలిపారు. మహిళలపై సాంప్రదాయం, సంస్కృతి, మతం పేరుతో మహిళల మనోభావాలపై మతోన్మాదుల దాడి చేస్తున్నారని విమర్శించారు. మహిళలు వర్గ పోరాటాల్లోకి రాకపోతే అవి విజయవంతం కావని వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో భుజం భుజం కలిపి పోరాడాలని దావలే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశంలో ఆశా, అంగన్‌వాడీ మహిళలు పోరాటం చేస్తున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.



