Sunday, August 3, 2025
E-PAPER
Homeజాతీయంమహిళలు ఇంట్లోనే ఉండండి

మహిళలు ఇంట్లోనే ఉండండి

- Advertisement -

అప్పుడే అఘాయిత్యాలు జరగవు
గుజరాత్‌లో వెలిసిన వివాదాస్పద పోస్టర్లు
మహిళా సంఘాల ఆగ్రహం
అహ్మదాబాద్‌:
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వారు వేసుకున్న దుస్తులు, ప్రవర్తనే కారణమని కొందరు తరచూ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తుండటం తెలిసిందే. ఇటువంటి వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి.. తాజాగా అటువంటి ఘటనే గుజరాత్‌లో వెలుగులోకి చూసింది. గుజరాత్‌కు చెందిన ఓ ప్రయివేటు సంస్థ ‘మహిళల భద్రత’ పేరిట పోస్టర్లను రూపొందించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాటిని ఏర్పాటుచేసింది. అందులో ‘మహిళలపై లైంగికదాడి జరగకుండా ఉండాలంటే ఇంట్లోనే ఉండండి. లేట్‌నైట్‌ పార్టీలకు వెళ్తే సామూహిక లైంగికదాడులు జరగొచ్చు’ అని గుజరాతీ భాషలో పెద్దపెద్ద అక్షరాలతో రాసి ఉండడంతో వివాదానికి దారితీశాయి. అంతేకాక ఈ పోస్టర్లను అహ్మదాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసు అధికారులు స్పాన్సర్‌ చేసినట్టు ఉండడంతో పలువురు ప్రజలు, మహిళాసంఘాలు వారిపై విమర్శలు గుప్పించాయి. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వారే కారణమనేలా పరోక్షంగా నిందించే పోస్టర్లకు పోలీసులు ఎలా అనుమతిస్తారని మహిళా సంఘాలు ఆందోళన లేవనెత్తాయి. దీంతో గుజరాత్‌లోని సోలా, అహ్మదాబాద్‌, చంద్లోడియా వంటి ప్రాంతాలలోని డివైడర్లపై ఏర్పాటుచేసిన పోస్టర్లను ట్రాఫిక్‌ పోలీసులు తొలగించారు.
ఆ సంస్థ ఏర్పాటుచేసిన పోస్టర్లు మహిళలను కించపరిచేవిగా, అసభ్యకరంగా ఉండడంతో వాటిని తొలగించినట్టు డీజీపీ (ట్రాఫిక్‌ వెస్ట్‌) శైలేష్‌ మోడీ పేర్కొన్నారు. వాహనదారులకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించడానికి పోస్టర్లు ఏర్పాటుచేసుకోవడానికి ఆ ప్రయివేటు సంస్థకు అనుమతి ఇచ్చామని.. కానీ, అందుకు విరుద్ధంగా ఆ సంస్థ లైంగిక వేధింపులపై పోస్టర్లు పెట్టిందని అదనపు పోలీసు కమిషనర్‌ (ట్రాఫిక్‌) ఎన్‌.ఎన్‌. చౌదరి స్పష్టం చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వాస్తవానికి పోస్టర్లు ఏర్పాటు చేయటానికి అనుమతించిన పోలీసులు చివరకు వివాదస్పదంగా మారటంతో..బుకాయించే ప్రయత్నాలు చేస్తున్నారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -