Sunday, July 13, 2025
E-PAPER
Homeమానవికాస్త ప్రోత్స‌హిస్తే మ‌హిళ‌లు స‌త్తా చాటుకుంటారు

కాస్త ప్రోత్స‌హిస్తే మ‌హిళ‌లు స‌త్తా చాటుకుంటారు

- Advertisement -

గీతాంజలి మైని… స్వతహాగా చిత్రకారిణి కాకపోయినా చిత్రకళను ప్రోత్సహించేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. భారతీయ చిత్రకళను ప్రపంచానికి చాటి చెప్పేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. రాజా రవి వర్మ ఆర్ట్‌ ఫౌండేషన్‌కు మేనేజింగ్‌ ట్రస్టీగా ఉండి చిత్ర కళకు అనేక సేవలు అందిస్తున్నారు. అంతేకాక ‘గ్యాలరీ జీ’ పేరుతో వివిధ చిత్రకారుల చిత్రాలతో పెద్ద పెద్ద నగరాల్లో ఆర్ట్‌ గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయడానికి హైదరాబాద్‌ వచ్చిన ఆమెతో మానవి మాట కలిపింది…
మీరు పుట్టి పెరిగింది ఎక్కడా?

మా సొంత ఊరు కేరళలోని పాలక్కడ్‌. పుట్టింది, చదువుకుంది అక్కడే. మాస్టర్స్‌ మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ నుండి చేశాను.
ఆర్ట్‌ పట్ల ఆసక్తి ఎలా కలిగింది?

స్వతహాగా నేను కళాకారురాలిని కాదు. మా కుటుంబంలో కూడా కళాకారులు ఎవ్వరూ లేరు. అయినా నాకు చిత్రకళ అంటే చాలా ఇష్టం. అనుకోకుండా రవి వర్మ కుటుంబంతో నాకు పరిచయం ఏర్పడింది. ఆయన నుండి నాలుగు తరాల వారు కళాకారులుగానే ఉన్నారు. ఆయన మునిమనుమరాలు రుక్మిణి వర్మతో నాకు పరిచయం. ఆమె కూడా ఆర్టిస్టే. ఆమె ఆసక్తితోనే రాజా రవి వర్మ ఆర్ట్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశాము. దానికి నేను మేనేజింగ్‌ ట్రస్టీగా ఉన్నాను. ఈ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పెద్ద పెద్ద కళాకారుల చిత్రాల నుంచి కొత్త కళాకారుల చిత్రాలను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాము.
గ్యాలరీ జిడఆన్‌ ది గో ప్రారంభం గురించి పంచుకుంటారా?
ఈ గ్యాలరీ 20 ఏండ్ల కిందట ప్రారంభమైంది. మంచి కళను ప్రజలకు అందుబాటు లోకి తీసుకు రావడం, కళాకారులను అభినందించడం అనేవి కళాకారుల రోజువారీ జీవితంలో ఒక భాగం చేయడం దీని లక్ష్యం. ఏండ్లుగా మేము ఎంతో మంది లెజెండ్స్‌తో కలిసి పనిచేస్తున్నాము. ఒక కళను దాని ప్రభావాన్ని ఒకే చోట చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ గ్యాలరీకి సరిహద్దులు ఏమీ లేవు. కళాకారుల కోసం ఒక చురుకైన వేదికగా పని చేస్తుంది. వివిధ నగరాలు, అక్కడి సంస్కృతులను ప్రతిబింబిస్తుంది. నిత్యం కొత్త ప్రేక్షకులు వస్తూనే ఉంటారు.
హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్‌ పెట్టారు. దీనికోసం ప్రత్యేక శ్రద్ధ ఏమైనా తీసుకున్నారా?
హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్‌ పెట్టడం ఇదే మొదటి సారి. గొప్ప చరిత్ర కలిగిన నగరం ఇది. అలాగే కళల వారసత్వం కలిగిన ప్రాంతం. సమకాలీన కళను ఆస్వాదించేందుకు ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. కనుక హైదరాబాద్‌ వంటి మహానగరంలో ఎగ్జిబిషన్‌ పెడుతున్నప్పుడు వీటన్నింటిపై దృష్టి పెట్టాను.
కళను ప్రోత్సహిస్తున్నారు.. మీ అనుభవాలు పంచుకుంటారా?
నేను కళను ఎప్పుడూ ఓ ‘పని’ గా భావించను. మేము ఏర్పాటు చేసే ఆర్ట్‌ ఎగ్జిబిషన్లన్నీ కళాకారుల ప్రయాణం, స్వరం, నిజాయితీ గురించి చూపిస్తాయి. కళలో సమగ్రత, దృష్టిలో స్పష్టత కోసం చూస్తున్నాను. అది అప్పుడే తన కళను కొత్తగా ప్రారంభించిన వ్యక్తి అయినా లేదా ఎన్నో ఏండ్ల నుండి కళతో పరిచయం ఉన్న వ్యక్తి అయినా. మార్పును కోరుతున్న కళాకారులను ఇష్టపడతాను. కళలను ఒక చోటకు చేర్చడానికి అవసరమైన స్థలాన్ని సృష్టించడంపై నా దృష్టి ఉంటుంది. మనం చేసే పని అందరినీ ఆశ్చర్యపరచాలి, ఇతరులకు కూడా చేయాలి అనే భావన రావాలి. అప్పుడే మనం కళకు న్యాయం చేస్తున్నట్టు.
నేటి కళా రంగంలో కళా ప్రదర్శనల ప్రాముఖ్యత, పాత్ర ఏమిటి?
కళా ప్రపంచం మారుతోంది, ఇది మంచి విషయం. గ్యాలరీల వెలుపల ప్రదర్శనలు కళాకారులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాయి. తమ కళలను ప్రదర్శించడం కోసం కొత్త వేదికలను తెరిచే అవకాశం కల్పిస్తుంది. ప్రదర్శనల ద్వారా చాలా విస్తృతమైన ప్రజలను తమ సమూహంలోకి ఆహ్వానిస్తారు. ప్రతి ఒక్కరికి గ్యాలరీలు పెట్టుకునే సౌకర్యంగా ఉండరు. కాబట్టి మన కళ ఇంటి నుంచి హోటళ్లు, వారసత్వ భవనాలలోకి వెళ్ళినప్పుడు అది మరింత మంది వద్దకు చేరువవుతుంది. దీనివల్ల కళకు విలువ కూడా పెరుగుతుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో కళకు అందుతున్న ప్రశంసలపై మీ అభిప్రాయం ఏమిటి?
ప్రజలు నేడు కళలను, కళాకారులను ప్రోత్సహించానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. సోషల్‌ మీడియా దీనికి ఎంతో సహకరిస్తుంది. అయితే పెయింటింగ్‌లను కొనుగోలు చేసేటప్పుడు కేవలం గొప్ప గొప్ప కళాకారులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇందులో కొంత వరకు మార్పు వస్తుంది. కళ పట్ల అవగాహన పెరుగుతుంది. నైపుణ్యం ఉంటే కొత్త కళాకారులకు కూడా కచ్చితంగా ప్రోత్సాహం లభిస్తుంది.
ప్రస్తుత కాలంలో గ్యాలరీ జీ పాత్ర ఏమిటి?
గ్యాలరీ జీ అనేది కేవలం ఒక స్థలం మాత్రమే కాదు. ఇది కళాకారులకు ఒక వేదిక. మేము కళాకారులకు, ప్రేక్షకులకు మధ్య వారధులుగా వ్యవహరిస్తాము. కళాకారులకు మద్దతు ఇవ్వడం, వారి కళను ప్రజలకు అర్థమయ్యేలా చేయడం మా పని. నేను రాజా రవివర్మ హెరిటేజ్‌ ఫౌండేషన్‌కు మేనేజింగ్‌ ట్రస్టీగా పనిచేస్తున్నాను. కొత్తతరం కళాకారులను ప్రోత్సహించడం మా బాధ్యతగా భావిస్తాము.
రాజా రవివర్మకు తనకంటూ ఒక వారసత్వం ఉంది. భారతీయ కళను ప్రపంచవ్యాప్తం చేయడంలో ఆయన పాత్ర ఉందని భావిస్తున్నారా?
కచ్చితంగా ఉంది. పాశ్చాత్య పద్ధతులను భారతీయ ఇతివృత్తాలతో మిళితం చేసిన తొలి కళాకారులలో రవివర్మ ఒకరు. అతను భారతీయ పురాణాలను దృశ్య ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చాడు. ఒక విధంగా అతను భారతదేశపు మొట్టమొదటి ఆధునికవాది. ఫౌండేషన్‌గా మేము అతని రచనలను, అవి లేవనెత్తే ప్రశ్నలను, పరిశోధన, సహకారాలు, విమర్శనాత్మక చర్చల ద్వారా మరిన్ని ప్రపంచ వేదికలలోకి తీసుకెళ్లడానికి చురుకుగా కృషి చేస్తున్నాము.
చిత్రకారిణులకు మీరిచ్చే ప్రోత్సాహం?
కచ్చితంగా ఆవైపుగా కూడా దృష్టి పెడుతున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో కూడా నలుగురు మహిళల చిత్రాలు ఉన్నాయి. మహిళలు అద్భుతంగా చిత్రిస్తారు. కానీ ప్రచారం చేసుకోవడంలో కాస్త వెనకబడుతున్నారు. వారికి అవకాశాలు తక్కువ. కాస్త ప్రోత్సహిస్తే మహిళలు తమ సత్తా చాటుకుంటారు. అలాంటి వారిని ప్రోత్సహించడానికి మేమెప్పుడూ ముందు భాగంలో ఉంటాము. అలాగే కళాకారులకు సోషల్‌ మీడియా మంచి వేదికగా ఉంది. దాన్ని ఉపయోగించుకొని తమ కళను ప్రచారం చేసుకోవచ్చు.
– సలీమ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -