పురుగుమందు డబ్బలతో నిరసన..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఎదుట గురువారం ఉదయం కోనాయపల్లి గ్రామ మహిళలు పురుగుమందు డబ్బలతో ఆగ్రహ నిరసన చేపట్టారు. తమ రుణాలను ఇప్పటికే చెల్లించినప్పటికీ, బ్యాంకు అధికారులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత నెల 14న “శ్రీనిధి సొమ్ములు స్వాహా” అనే ప్రత్యేక కథనం నవతెలంగాణలో ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆ కథనం వెలువడిన అనంతరం జిల్లా అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో కొంతమంది మహిళలు గ్రూప్ లీడర్లు, ఆర్పీలకు రుణాల డబ్బు చెల్లించినప్పటికీ, వారు ఆ సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా తమ అవసరాలకు వాడుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు సంబంధిత సంఘాల సభ్యులకు నోటీసులు పంపించడంతో, కోనాయపల్లి మహిళలు గురువారం ఉదయం బ్యాంకు ముందు పురుగుమందు డబ్బలతో నిరసన చేపట్టారు. తమ వద్ద మెప్మా ప్రతినిధులకు చెల్లించిన రసీదులు, ఆధారాలు ఉన్నప్పటికీ, బ్యాంకు అధికారులు తమపై బకాయిలు ఉన్నట్లు చూపుతున్నారని మహిళలు ఆరోపించారు.ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన ఆడిట్ తనిఖీల్లో కూడా కొన్ని ఆర్థిక లోపాలు బయటపడ్డట్లు సమాచారం. ఆడిట్ అనంతరం బకాయి మొత్తాన్ని చెల్లించాలని అధికారులు సూచించగా, మహిళలు దీనిని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. ఈ ఘటన వేములవాడ పట్టణంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.