మహిళల వస్త్రధారణ పట్ల సినీనటుడు శివాజీ వ్యాఖ్యలు, ఆ తర్వాత బయటినుంచి వచ్చిన స్పందనలు, దానిమీద శివాజీ పునర్‌వాఖ్యానాలు వెరసి తెలుగు సమాజం నేడు మహిళల ఉద్ధరణ మీద సోషల్ మీడియాలో పెద్దగానే శ్రమిస్తున్నది. శివాజీ అయినా, ఆయన్ను సమర్థిస్తున్న వారైనా, వ్యతిరేకిస్తున్న వారైనా ఒకేరకమైన వాదనను ముందుకు తీసుకురావడం విచిత్రంగా ఉంది. ‘మహిళలకు మేము మంచి చెప్తున్నామన్నది’ వీళ్ల వాదనలోని సారాంశం. ‘ఎవరో ఒకరు చెప్తే తప్పా మంచేదో చెడేదో తెలుసుకోలేని స్థితిలో మహిళలున్నారని’ ఈ స్త్రీజనోద్దారకుల భావన. ఇదే సందర్భంలో సామాజిక మధ్యమాల్లో మహిళల స్వేచ్ఛను బరితెగింపుగా వక్రీకరిస్తూ బూతుపురాణాలకు దిగుతూ ‘దేశం కోసం..ధర్మం కోసం’ తీవ్రంగా శ్రమిస్తున్నారు మరికొందరు.మహిళలకు మనలాగే ఆత్మగౌరవం ఉంటుందని, వాళ్లకు కూడా మగవాళ్లతో సమానంగా హక్కులుంటాయని అంగీకరించలేని- ‘మగానుభావులు’ ఇలా ఆడవాళ్ల మీద అసభ్యంగా మాట్లాడుతూనే ఉంటారు.
వీళ్ల దృష్టిలో ఆడవాళ్లు రెండవ తరగతి మనుషులు.ఇలా మాట్లాడేవాళ్లలో శివాజీ మొదటి వాడు కాదు, చివరా కాదు. ఎందుకంటే అడుగడుగునా ఈ దేశంలో ఇలాంటి మనుషులే ఉన్నారు. రాజకీయ నాయకుల దగ్గర నుంచి రబ్బరు స్టాంపులు వేసే అటెండర్ దాకా ఆడవాళ్ల మీద అలవోకగా నోరుజారటం సాధారణమై పోయింది. ఈ దుర్మార్గమైన మనస్తత్వం ప్రజల్లో హఠాత్తుగా వచ్చిందేమి కాదు. తరతరాలుగా ప్రోదిచేయబడిన సంస్కృతి మహిళా హక్కులకు అనుకూలమైనది కాదు. వాళ్ల హక్కులను పూర్తిగా వ్యతిరేకించేది ‘న స్త్రీ స్వాతంత్య్రమర్హతి’ అని శాసనం చేసిన మనువు దగ్గరనుంచి మహిళలను అవమానపరచటానికే కార్యక్రమాలు చేస్తారేమో అన్నట్టుగా సాగుతున్న బుల్లితెర ప్రసారాల దాకా మన అణువణువునా అకారణ స్త్రీద్వేషం సూదిమందులా ఎక్కుతోంది.’స్త్రీ చదివితే సమాజానికి అరిష్టం’ అని నిన్నామొన్నటి వరకు నమ్మిన అమాయక చరిత్ర మనది.
మహాత్మా జ్యోతిరావు ఫూలే దంపతులు ఆడపిల్లల చదువుకోసం పడిన తపన గురించీ, వాళ్లను అడ్డుకోవడానికి సనాతన సాంప్రదాయవాదులు చేసిన కుట్రల గురించి చదివినప్పుడు ఆడవాళ్ల హక్కుల పట్ల ఎవరి చిత్తశుద్ధి ఏమిటో దేశానికి స్పష్టత వచ్చింది. మహిళలను పురుషులతో సమానం చేయటానికి ఎంతో శ్రమించి అంబేద్కర్ తయారు చేసిన ‘హిందూ కోడ్ బిల్లు’ను సర్దార్ పటేల్‌తో సహా పెద్ద వృద్ధ నాయకులంతా వ్యతిరేకించినప్పుడు మహిళామణుల అభివృద్ధి పట్ల మన దేశనాయకుల సంస్కారం ఏపాటిదో తేలిపోయింది.ఈ మధ్య ఆరెస్సెస్ పెద్ద మోహన్ భగవత్ ఇల్లాలు ఇంటిపనులు మాత్రమే చేయాలని, బయటకు వెళ్లటం లాంటివి చేయకూడదని సెలవిచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఇక బీజేపీకి చెందిన పార్లమెంటు సభ్యులు, మంత్రులు రోజుకొకరుగా మహిళలను కించపరిచే వ్యాఖ్యలు నిరాఘాటంగా కొనసాగించడం బాధాకరం. వీళ్లందరూ వల్లించే ఏకైక నినాదం -పాశ్చాత్య సంస్కృతి వల్ల స్త్రీలు చెడిపోతున్నారని. వీళ్లకు తెలియని విషయం ఏమిటంటే వీళ్లు చెప్పే ఆ పాశ్చాత్య సంస్కృతిలోనే స్త్రీలు స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో జీవిస్తున్నారు. నచ్చినట్లు బతకగలుగుతున్నారు.
మహిళల విషయంలో నీతితప్పి మాట్లాడుతున్నవారందరూ నిజానికి మహిళల పట్ల ఆవేదన చెంది మాట్లాడుతున్నవారు కాదు.వీళ్లు చెప్పేవన్నీ అబద్ధాలే. మహిళలు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు కోరుకోవటం, నచ్చినట్లు బతకాలనుకోవటం, ఇంకాచెప్పాలంటే గొంతువిప్పి తమ అభిప్రాయాలను నిర్భయంగా ప్రకటించాలనుకోవటం సదరు వర్గానికి ఎక్కడలేని నొప్పిని కల్గిస్తున్నాయి.’మాతో సమానమై పోతారా’ అన్న పితృస్వామిక అహంకారం వాళ్లను ఒక్కచోట ఉండనివ్వటం లేదు. అందుకే ఇలాంటి రకరకాల ప్రేలాపనలు. అందరిలాగే మహిళా హక్కులను రాజ్యాంగం పొందుపరిచింది. మహిళా హక్కులను వ్యతిరేకించడం రాజ్యాంగ విరుద్ధం. సూటిగా వాళ్ల హక్కులకు వ్యతిరేకంగా మాట్లాడటం సాంకేతికంగా సాధ్యం కాని పని. అందుకే ఈ ‘మగానుభావులు’ డొంకతిరుగుడు సిద్ధాంతాన్ని ఆశ్రయిస్తున్నారు. ‘రాత్రి తిరగడాలు, పొట్టి పొట్టి బట్టలు వేయడాలు’ లాంటి మాటలు ఈ వెర్రితల కాయలు పుట్టించిన వంకలు తిరిగిన సిద్ధాంతాలే. వస్త్రధారణలో కానీ, బయట తిరిగే విషయంలో కానీ మహిళలపట్ల అనుసరిస్తున్న ఈ ధోరణిని పురుషుల పట్ల ఏనాడైనా అనుసరించారా? లేదు. దీనికి ప్రధాన కారణం భారతీయుల్లో నరనరాన జీర్ణించుకొనిపోయిన పితృస్వామిక భావజాలం.
1984లోనే స్త్రీవాద కవయిత్రి సావిత్రి ‘బందిపోట్లు’ కవితలో చెప్పింది-
‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే… మమ్మల్ని విభజించి పాలిస్తోంది’ అని……ఈ అవగాహన నేడు ప్రతీ మహిళకు ఏర్పడాలి. స్వేచ్ఛగా గొంతు విప్పాలి. నిర్భయంగా అడుగు ముందుకు వేయాలి.అప్పుడు మాత్రమే శివాజీ, ఆయనకు మద్దతుగా నిలబడినవారి నోళ్లు మూతపడతాయి.
తోకల రాజేశం
9676761415



