Sunday, December 14, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకార్మికుల హక్కులు పోరాటాలతోనే సాధ్యం

కార్మికుల హక్కులు పోరాటాలతోనే సాధ్యం

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
షాహీ ఎక్స్‌పోర్ట్స్‌ మహిళా కార్మికుల ఆందోళనకు మద్దతు…ఆరో రోజుకు ఆందోళన

నవతెలంగాణ-చర్లపల్లి
కార్మికుల డిమాండ్లు అడుక్కుంటే పరిష్కారం కావని, పోరాడితేనే సాధ్యమవుతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. గెలవాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని షాహీ ఎక్స్‌పోర్ట్స్‌ పరిశ్రమలో మహిళా కార్మికులు చేపట్టిన వేతనాల పెంపు ఆందోళన శనివారం ఆరో రోజుకు చేరింది. విధుల్లో చేరిన తర్వాత కమిటీ ఏర్పాటు చేసి వేతనాల పెంపు అంశాన్ని పరిశీలిస్తామని యాజమాన్యం ఇచ్చిన అస్పష్ట హామీని కార్మికులు తిరస్కరించడంతో ఆందోళన మరింత ఉధృతమైంది. ధర్నా శిబిరాన్ని శనివారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.ఆరు రోజులుగా పోరాటం చేస్తున్న మహిళా కార్మికులకు
సీపీఐ(ఎం) తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తున్నామని జాన్‌వెస్లీ తెలిపారు. పదహారేండ్లుగా పరిశ్రమలో పనిచేస్తూ కేవలం రూ.9 వేల వేతనంతో జీవించాలంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పెరుగుతున్న ధరల మధ్య ఇంత తక్కువ వేతనాలతో జీవితం సాగించడం అసాధ్యమన్నారు.

కనీస వేతనం రూ.26 వేలుగా ఉండాల్సి ఉన్నా, కార్మికులు అడుగుతున్నది రూ.16 వేలేనని తెలిపారు. అయినా యాజమాన్యం ముందుకు రాకపోవడం దుర్మార్గమన్నారు. కొద్దిగా ఆలస్యం జరిగినా ఒక్కరోజు వేతనం కట్‌ చేయడం, క్యాంటీన్‌ సౌకర్యం తొలగించడమేంటని ప్రశ్నించారు. మహిళలు గంటల తరబడి నిలబడి పనిచేయడం, బాత్రూంకు వెళ్లినా చెక్‌ చేయడం మానవత్వం లేని చర్యలని విమర్శించారు. దీంతో విసిగిపోయిన మహిళలు ఒక్కసారిగా విధులు బహిష్కరించి రోడ్డుపైకి రావడం వెనుక ఉన్న బాధను యాజమాన్యం గుర్తించాలని సూచించారు. వేతనాలు పెరిగే వరకు పోరాటం కొనసాగించాలని, ఈ పోరాటంలో సీపీఐ(ఎం), సీఐటీయూ పూర్తిగా అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం, కార్యదర్శవర్గ సభ్యులు కోమటి రవి, సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎస్‌.రమ, వంగూరి రాములు, పి.శ్రీకాంత్‌, కూరపాటి రమేష్‌, జె.చంద్రశేఖర్‌, పి.గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -