‘షాహి ఎక్స్‌పోర్ట్’ యాజమాన్యం వేధింపులు ఆపాలి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమ
లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద కార్మికుల ధర్నా
నవతెలంగాణ – ముషీరాబాద్
నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని షాహి ఎక్స్‌పోర్ట్ ప్రయివేటు లిమిటెడ్ (గార్మెంట్) కంపెనీ కార్మికుల వేతనాలు పెంచాలని, యాజమాన్యం వేధింపులు ఆపాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమ డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీయూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ చిక్కడపల్లిలోని లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కంపెనీలో దాదాపు 1600 మంది మహిళలు 16 ఏండ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి 2011లో జారీ చేసిన జీవో ప్రకారం వేతనాలే ఇప్పటికీ అమలు చేస్తున్నారన్నారు. పైకి ఎక్కువ వేతనాలు ఇస్తున్నా మని చెబుతున్నా.. వాస్తవంగా రూ.9000 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. అలాగే పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు లేవని, వర్కర్స్‌కు క్యాంటీన్ సదుపాయం కూడా కల్పించలేదని అన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మహిళలని కూడా చూడకుండా వారిపై దాడులకు దిగుతున్నారని వాపోయారు.
నిర్బంధించి పనులు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వేతనాలు పెంచాలని దాదాపు 1200 మంది మహిళలు ధర్నా చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందిం చడంలేదని, వెంటనే షాహి ఎక్స్‌పోర్ట్ ప్రయివేటు లిమిటెడ్ కార్మికులకు వేతనాలు పెంచి ప్రత్యేక వస తులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ.. మహిళా కార్మికులకు వేతనాలు పెంచాలంటే యాజమాన్యం బెదిరింపులకు పాల్ప డుతున్నదన్నారు. మహిళలు ధర్నాలు చేస్తుంటే కనీసం ఏ ఒక్క ప్రజాప్రతినిధైనా సంఘీభావం తెలపలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం ఓవైపు కార్మికుల హక్కులను కాలరాస్తోందన్నారు. షాహి ఎక్స్‌పోర్ట్ ప్రయివేటు లిమిటెడ్‌లో పనిచేసే మహిళా కార్మికులకు సీఐటీయూ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ సహాయ కార్యదర్శి ఈశ్వరరావు, ఉపాధ్యక్షులు వీఎస్ రావు, హైదరాబాద్ అధ్యక్షులు దశరథ్, మేడ్చల్ అధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



