Friday, April 3, 2026
E-PAPER
Homeఎడిట్ పేజియుద్ధాలు ఆపాలని ప్రపంచ శాస్త్రవేత్తల వినతి

యుద్ధాలు ఆపాలని ప్రపంచ శాస్త్రవేత్తల వినతి

- Advertisement -

మానవీయ విలువల్ని దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతం (2026) జరుగుతున్న యుద్ధాలన్నింటినీ తక్షణం ఆపాలని ప్రపంచ శాస్త్రవేత్తలు కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పరిశోధనాశాలల్లోని శాస్త్రవేత్తలు, వివిధ విశ్వ విద్యాలయాల్లో పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్లు సంతకాలు చేసి, ఐక్యరాజ్యసమితికి పంపారు. వీరి సంఖ్య నాలుగు వేలకు మించి ఉంది. ఇందులో అన్ని దేశాల వైజ్ఞానికులతో పాటు మన భారతీయ శాస్త్రవేత్తలు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఇది మనం సంతోషించాల్సిన విషయం. సంతకాలు చేసిన వారిలో నోబెల్‌ బహుమతి గ్రహీతలు (14), దిరక్‌ ప్రయిజ్‌ గ్రహీతలు (34) బ్రేక్‌ త్రూప్రయిజ్‌ (20) ఫీల్డ్‌ మెడల్‌ (5), ఉల్ఫా ప్రయిజ్‌ (4) వంటి ప్రతిష్టాత్మకమైన బహుమతులు స్వీకరించిన వారు ఉన్నారు. వీరంతా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటానియో గుట్రెస్‌కు ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూకు, అతని మిత్రుడికి కలిపి లేఖ రాశారు. లేఖలో వాళ్లు రాసిన అంశాలన్నీ అందరూ ఆలోచించదగినవి. శాస్త్రవేత్త అయినవాడు మొదట మానవవాది అవుతాడని నేను ఎప్పుడూ చెపుతుంటాను. ఆ విషయమే ఈ నాలుగు వేల మంది శాస్త్రవేత్తల చొరవతో మరోసారి రుజువైంది.

అక్టోబర్‌ 2023లో హమాస్‌ దాడులు చేసింది నిజమే! దాన్ని శాస్త్రవేత్తలంతా ఖండించారు. అయితే ఆ సాకుతో ఇజ్రాయిల్‌ ఏళ్లకేళ్లు ఇతర దేశాల మీద దాడులు చేయడం మానవ హననానికి దారితీసింది కదా? దానికితోడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను యుద్ధంలోకి లాగడం, ఆయన అనాలోచితంగా యుద్ధానికి పూనుకోవడం మనుషులైన వారెవరూ హర్షించరు. నోబెల్‌ శాంతి బహుమతి కావాలని అంగలార్చినవాడు ఒక ”వార్‌ క్రిమినల్‌”గా మిగిలిపోవడం ఏమైనా బావుందా? అమెరికన్‌ పౌరులే జరుగుతున్న యుద్ధాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు కదా? మరి ఆ విషయం అమెరికా అధ్యక్షుడు పట్టించుకోడా? ఇంతెందుకూ? అమెరికా దేశ ఉపాధ్యక్షుడే ”యుద్ధం ఒక తప్పుడు నిర్ణయమని”- చెప్పి, తనను తాను ఆ నిర్ణయానికి దూరం చేసుకున్నాడు కదా? ఇప్పుడు తక్షణం యుద్ధం ఆపి, బందీలుగా నిర్భందించిన వారిని వెంటనే విడుదల చేయాలి.

నిరాశ్రయులైన వారిని వెంటనే ఆదుకోవాలి. నిరాశ్రయుల సమస్య ఒక అంతర్జాతీయ సమస్య కాబట్టి, అన్నిదేశాల ప్రభుత్వాలు కలిసి వచ్చి నిరాశ్రయుల్ని ఆదుకోవాలని చైనా పిలుపునిచ్చింది. అంతే కాదు, ‘తనకు సాధ్యమైనంత సహాయం’ తక్షణం అందిస్తానని కూడా ప్రకటించింది. నిరాశ్రయుల్లో సంవత్సరం కూడా నిండని పసిపాపలు వేలవేల సంఖ్యలో ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటీ? ఈ యుద్ధాలు, రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వాళ్లు కదా వాళ్లూ? మానవత్వాన్ని పరిరక్షించే దిశలో మానవ శ్రేయస్సును కోరుతూ జీవితాంతం వైజ్ఞానిక పరిశోధనల్లో మునిగే శాస్త్రవేత్తలు కూడా యుద్ధం వల్ల పెద్దగా నష్టపోయారు. పరిశోధనాశాలలు, యూనివర్సిటీ భవనాలు చాలా చోట్ల ధ్వంసమయ్యాయి. వారు పనిచేసే వాతావరణం కూడా లేదు. కానీ, అంతకంటే అధ్యాన్నమైన స్థితి బయట సమాజంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి, మానవత్వాన్ని పరిరక్షించే దిశలో శాస్త్రవేత్తలు కలిసికట్టుగా ముందుకొచ్చారు.

దేశాధినేతల్ని, ప్రభుత్వాల్ని, అంతర్జాతీయ సంస్థల అధిపతుల్ని మాత్రమే కాదు, మొత్తానికి మొత్తంగా ప్రపంచజనావళిని కూడా ఈ విషయంలో కలిసి రావాలని అర్ధించారు. ”యుద్ధ విరమణ”కు అందరం కలిసికట్టుగా పాటు పడదాం! కేవలం శాంతి ద్వారానే సమసలు పరిష్కారమవుతాయనీ, యుద్ధం ఎనాటికీ సమస్యల్ని పరిష్కరించలేదని ఆ లేఖలో ఊటంకించారు. గతకాలంలోని మహానుభావులు చెప్పింది ఇదే- ఇప్పుడు అనుభవ పూర్వకంగా మనం తెలుసుకున్నది కూడా ఇదేనని వారు లేఖలో పేర్కొన్నారు. ప్రపంచాన్ని అత్యాధునిక యుగంలోకి తీసుకుపోవాలని మేం శాస్త్రజ్ఞులం తాపత్రయపడుతూ ఉంటే – కొందరు అహంకారులు, స్వార్థపరులైన దేశాధినేతలు ప్రపంచాన్ని శరవేగంగా ఆదిమ సమాజంలోకి లాక్కుపోతున్నారు. ఈ పరిస్థితిని ప్రపంచ పారులందరూ నిర్ద్వందంగా ఖండించాలి! పరిస్థితులను సమైక్యంగా ఎదుర్కోవాలి!! – అని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు.

యుద్ధంలో ధ్వంసమైన ప్రాంతాల దుర్భరమైన స్థితిగతులను మానవీయకోణంలో చూసినప్పుడు మనుషులైన వారందరూ స్పందించకమానరు. యుద్ధానికి బలైన పశ్చిమాసియా దేశాల్లోని పరిస్థితి అంతా ఒకేలా ఉంది. యుద్ధంతో సంబంధం లేని ఇతర దేశాలలో కూడా కొత్తకొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు వంటగ్యాసు కొరత, ఇంధనం కొరత వంటి సమస్యలు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నా వాటిచుట్టూ అల్లుకున్న అనేక ఇతర సమస్యలు కూడా విశ్వరూపం చూపిస్తున్నాయి. ఆహారం కొరత, ఆరోగ భద్రత లేకపోవడం, రోడ్డు రవాణా ఆగిపోవడం, విమాన సర్వీసులు రద్దు కావడం – ఇవన్నీ కాకుండా భవిష్యత్తరాలను అంధకారంలో ముంచే మరో విపత్కర పరిస్థితి దాపురించింది. అదేమంటే విద్యాసంస్థలు మూతపడడం !! లెబనాన్‌ బీరూట్‌లో లక్షల సంఖ్యల్లో జనం పబ్లిక్‌ పార్టీల్లో తాత్కాలిక గుడారాలు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. కారణం వారి ఇళ్లూ, భవనాలు, అపార్ట్‌మెంట్లు అన్నీ ధ్వంసమయ్యాయి. పునరుద్ధరించుకునే సౌకర్యం లేదు. డబ్బూ లేదు. దాడులు ఆగితే కదా ఏదైనా ఆలోచించుకోవడానికి?

ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రపంచ శాస్త్రవేత్తలు కలిసికట్టుగా తమ అభ్యర్థనను ప్రపంచం ముందు పెట్టారు. ముఖ్యంగా యుద్ధంలో పాల్గొంటున్న దేశాధినేతలను కోరారు. ఐక్యరాజ్య సమితి చొరవతో పరిస్థితి చక్కబడుతుందన్న ఆశాభావం కూడా వెలిబుచ్చారు. వెంటనే యుద్ధం ఆపి, చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలనీ-దేశాల మధ్య తలెత్తిన ఈ సమస్య చాలా జటిలంగా మారిపోయిందని, అది అంత సులభంగా ఈ పరిష్కారమయ్యే పరిస్థితి లేదని చెపుతూనే-యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం, దాని ప్రభావం మొత్తం భూగ్రహం మీదే తీవ్రంగా ఉంటుంది గనుక, తక్షణమే ముందు యుద్ధం ఆపాలని కోరారు. ప్రశాంత వాతావరణం కల్పించుకుని, శాంతి చర్చల ద్వారా పరిష్కార మార్గాలు వెతకాల్సి ఉంటుందని సూచించారు. ఇదే సమయంలో మనం భారతదేశ పౌరులుగా ఆలోచించుకోవాల్సింది ఆలోచించుకోవాలి కదా? మన కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉందా? సరైన విదేశాంగ విధానాలతో ముందుకు పోతోందా? ఆలోచించాలి కదా? ఇరాన్‌- భారత్‌ సంబంధం ఈ నాటిది కాదు. అది వేల సంవత్సరాలది.

అది కేవలం ఆర్ధిక పరమైన సంబంధం కాదు. అది భాషా, సాంస్కృతిక, ఆచార వ్యవహారాల, ఆహార నియమాల భవన నిర్మాణ శైలులకు సంబంధించిన అనేక విషయాలతో కూడుకున్న చాలా లోతైన అనుబంధం. అందువల్ల, ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు చూద్దాం! ఇరాన్‌ సుప్రీం లీడర్‌ను ఇజ్రాయిల్‌ – అమెరికాలు కలిసి హత్య చేస్తే, మన దేశ ప్రభుత్వం ఖండించలేదు. వెంటనే సంతాపం కూడా ప్రకటించలేదు. అయితే, ఈ దేశప్రజలు దేశవ్యాప్తంగా ఆపని చేశారు. భారతదేశ ప్రజలకు తమపై గౌరవభావం ఉందని ఇరాన్‌ కూడా ఔదార్యం చూపింది. ఒకవైపు తనపై జరుగుతున్న దాడుల్ని ప్రతిఘటిస్తూనే మరోవైపు హార్ముజ్‌ జలసంధి దగ్గర ఆగిపోయిన భారత్‌నౌకల్ని అనుమతించి మన దేశానికి రానిచ్చింది. తమ ఈ యుద్ధం కారణంగా భారత ప్రజలు సమస్యలు ఎదుర్కోగూడదని, అందుకే అనుమతించి పంపించామనీ ఆదేశ నాయకులు ప్రకటిం చారు. ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ పూర్తిగా విఫలమయినట్టే కదా?

ఇవన్నీ ఇలా ఉంటే, మరొక ముఖ్యమైన విషయం ఉంది. ఇరాన్‌లో మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఆసుపత్రిని ఇజ్రాయిల్‌ – అమెరికాలు కలిసి ధ్వంసం చేశాయి. భారతదేశానికి జాతిపిత అయిన మహాత్మాగాంధీ పేరుతో ఇరాన్‌ ప్రజలు ఎప్పుడో అక్కడ పెద్ద హాస్పటల్‌ కట్టుకున్నారు. ఈ దేశం పట్ల, ఈ దేశ స్వాతంత్య్ర యోధుల పట్ల ఇరాన్‌కు ఉన్న గౌరవభావం అందులో వ్యక్తమవుతోంది. అలాంటి పెద్ద సంస్థ ధ్వంసమైనప్పుడు భారత ప్రభుత్వ పెద్దలు నోరు విప్పాలా వద్దా? ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమే మంటే- భారత ప్రధాని ఇజ్రాయిల్‌ వెళ్లి వాళ్ల మెప్పు కోసం ”ఇండియా మదర్‌ లాండ్‌ – ఇజ్రాయిల్‌ ఫాదర్‌ లాండ్‌’ అని అన్నారు. అయితే, ఆ ఇజ్రాయిల్‌ వాడే మన ‘ఫాదర్‌ ఆఫ్‌ ద నేషన్‌'( జాతిపిత) పేరుతో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్‌ను ధ్వంసం చేస్తే – ప్రధాని గానీ, ఆయన సహచరులు గానీ నోరు మెదపలేదు. అదీ మన దేశ నాయకుల గొప్పతనం!! దేశభక్తికి పేటెంట్‌ పొందిన వాళ్లు కదా? గాంధీజీ బతికి ఉన్నప్పుడే ఓ మాట చెప్పారు. ”అన్యాయం జరిగినప్పుడు నిశ్శబ్దంగా ఉండడమనేది పిరికి వాళ్ల లక్షణం!”అని – ఇప్పటి మన దేశ నాయకులు ఇలా నిశ్శబ్దంగా ఉండిపోగలరని మన జాతిపిత అప్పుడే గ్రహించినట్టున్నారు.

ప్రస్తుత భారత ప్రభుత్వం కనీసం 75 ఏళ్లుగా ఈ దేశం అనుసరిస్తున్న అలీన విధానాన్నైనా గుర్తు చేసుకో లేదు. వెళ్లి, ఇజ్రాయిల్‌, అమెరికాలకు గులాంగిరి చేసింది. అయితే అక్కడ అమెరికాలో ఏమైందీ? ట్రంప్‌ మూర్ఖపు నిర్ణయాల్ని నిరసిస్తూ అక్కడి పౌరులు లక్షల సంఖ్యలో రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు కదా? ఇక్కడ మన ప్రభుత్వ పెద్దలు క్షమాపణలు కోరుతూ బతుకీడ్చిన పిరికి సావర్కర్‌ వారసులు కదా? ఈదేశ పౌరులు మాత్రం అలా కాదు. వీరు భగత్‌ సింగ్‌, సుభాష్‌, నెహ్రూల వారసులు, ఓటో చోరీతో దొంగదారిన అధికారంలోకి వచ్చిన వారి బండారం బయటపెడుతూనే ఉంటారు. ఈ దేశ పౌరులు వివేచనగల వారు గనకనే, ఇంకా దేశం విలువ కొంతయినా మిగిలి ఉంది. గల్గోటియా, (వాట్సప్‌) లాంటి యూనివర్సీటీలతో ఎఐ సమ్మిట్‌లో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ దేశం పరువు ఎంత తీయాలో అంత తీసేసింది.

నిన్నటిదాకా ఈ దేశ పౌరుల్ని మతాల వారిగా విడగొట్టి, ఇప్పుడు యుద్ధం వచ్చిందని, మారిన పరిస్థితుల్ని మనం ‘సమైక్యంగా’ ఎదుర్కుందాం- అని అంటారా? ఈ దేశ ప్రధానీ? మీకు ముందు నుంచీ ఆ సమైక్య భావన ఉండి ఉంటే దేశం ఇంత పాడైపోయేది కాదుగదా? బయటి దేశాల్లో దేశాలమధ్య యుద్ధాలు జరుగుతుంటే ఇక్కడి ప్రభుత్వం మాత్రం దేశపౌరులతోనే యుద్ధం చేస్తుంది. అప్పుడు పెద్దనోట్లు రద్దు చేసి జనాన్ని బ్యాంక్‌ ముందు నిలబెట్టి చంపింది. ఇప్పుడు గ్యాస్‌ కోసం, పెట్రోలు కోసం నిలబెట్టి చంపుతోంది. కరోనా సమయంలో పేదలకు రైలు సౌకర్యం కూడా కల్పించలేక-వేల మైళ్లు నడిపించి చంపింది. ఆహారం సంగతి తర్వాత, శుభ్రమైన గాలి, మంచినీరు దొరకక జనం చచ్చిపోతూ ఉంటే ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేవీ? దుర్భరమైపోయిన ఇక్కడి జీవితా న్నుండి తప్పించుకోవడానికి అధిక సంఖ్యలో ఈ దేశపౌరులు పౌరసత్వం వదులుకుని విదేశాలకు వెళ్లిపోతుంటే… చర్యలేవీ? భాయియోఁ! -మన్‌కి బాత్‌ విని చెవులు ఊపుతూ ఉండండి! అంతే-

  • నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ పూర్వ సలహా సంఘ సభ్యుడు, జీవశాస్త్రవేత్త.

డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -