13 నుంచి 17 తేదీల వరకు తీవ్రం
వాతావరణశాఖ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో రాబోయే రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి చలి పెరగనున్నది. ఈ మేరకు రాష్ట్ర వాతావరణశాఖ ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 11 నుండి 19 వరకు.. ముఖ్యంగా 13 నుండి 17 నవంబర్ మధ్య కాలంలో తీవ్రమైన చలి వాతావరణం ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఇంత దీర్ఘకాలం చలి తీవ్రత కనిపించదు. కానీ ఈ సంవత్సరం 8 నుంచి 10 రోజుల పాటు చలి ప్రభావం గణనీయంగా ఉండే అవకాశముంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో 9 డిగ్రీల నుంచి 12 డిగ్రీలు, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ తదితర జిల్లాల్లో 11 నుంచి 14 డిగ్రీలు, ఖమ్మం, నల్లగొండ తదితర ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో 14 నుంచి 17 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశముంది. ఈ జిల్లాల్లో చలి ప్రభావం తక్కువగా ఉండే అవకాశముంది.
జాగ్రత్తలు అవసరం
వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు చలి నుంచి సంరక్షించేలా వస్త్ర రక్షణ తప్పనిసరిగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు చలికి అధికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాలి, అధికారుల సూచనలు పాటించాలని కోరారు.



