– నీట మునిగిన రిలీఫ్ క్యాంప్స్
– ఎడతెరపివ్వని భారీ వర్షాలకు దేశ రాజధాని అస్తవ్యస్తం
– ఢిల్లీ ఎన్‌సీఆర్ అతలాకుతలం
న్యూఢిల్లీ: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దేశ రాజధానిప్రాంతం ఢిల్లీ-ఎన్‌సీఆర్ అతలాకుతలమవుతున్నది. కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించి పోయింది. వర్షాల కారణంగా యమునా నది ఉప్పొంగింది. డేంజ్‌మార్క్‌ను దాటి ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీని వరద ముంచెత్తింది. నిరాశ్రయుల కోసం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలు కూడా నీటమునిగాయి అధికారిక సమాచారం ప్రకారం.. ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటి మట్టం గురువారం ఉదయం 7 గంటలకు 207.48 మీటర్లుగా ఉంది. అదే ఉదయం 5 గంటల సమయంలో 207.47 మీటర్లుగా ఉంది. తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటల మధ్య నదిలో నీటి మట్టం 207.47 మీటర్ల వద్ద స్థిరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 5 గంటల తర్వాత వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అలీపుర్ ప్రాంతంలో రోడ్డు పైనే లోతుగా గొయ్యి ఏర్పడింది. సివిల్ లైన్స్ ప్రాంతంలో భారీగా వరద నిలిచింది. దీంతో కార్లు నీట మునిగాయి. బేలా రోడ్‌లోని భవనాల్లోకి వరద నీరు ప్రవేశించింది. కాశ్మీర్ గేట్ పరిసరాల్లోనూ వర్షం నీరు నిలిచిపోయింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో యమునా నది పొంగిపొర్లుతోంది. రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ నెమ్మదిగా ముందుకు కదులుతున్నట్టు అధికారులు తెలిపారు.
విమానప్రయాణాలపై ప్రభావం
భారీ వర్షాల తాకిడితో ఢిల్లీ విమానాశ్రయంలో వందలాది విమానాలపై ప్రభావం పడింది. దాదాపు 340కిపైగా విమాన రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఎయిర్‌పోర్టుకు సమీపంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో, వేలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. మరోవైపు భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు ఢిల్లీక వరద హెచ్చరికలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.