Friday, September 12, 2025
E-PAPER
Homeజాతీయంపీడిత జాతి విముక్తి ఆలోచనలో 'ఏచూరి' అగ్రగణ్యులు

పీడిత జాతి విముక్తి ఆలోచనలో ‘ఏచూరి’ అగ్రగణ్యులు

- Advertisement -

దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాసిస్టు ధోరణులపై వామపక్షాల ఐక్యపోరు : ఎంఏ బేబీ
విశాఖలో ఘనంగా సీతారాం ఏచూరి భవన్‌ ప్రారంభం

విశాఖ : దేశంలో నేడు ఆర్‌ఎస్‌ఎస్‌ నయా ఫాసిస్టు స్వభావంతో పోరాటాలను అణచాలని చూస్తోందని, అలాంటి ఆలోచనలు ఉన్న గూండాల గుంపును పోగేసుకుని కర్కశంగా, నేరపూరితంగా వ్యవహరించాలని చూస్తోందని, దీనికి విరుగుడుగా వామపక్ష శక్తులన్నింటినీ కలుపుకుని వామపక్ష భావజాలాన్ని నిలబెట్టడమే ఏచూరికి నిజమైన నివాళి అని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ.బేబీ అన్నారు. విశాఖ నగరంలోని మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో నిర్మితమైన సీతారాం ఏచూరి భవన్‌ (సీపీఐ(ఎం) విశాఖ జిల్లా కార్యాలయం)ను గురువారం ఆయన ప్రారం భించారు. తొలుత సీతారాం ఏచూరి చిత్రపటం వద్ద పార్టీ నాయకులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయడు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎంఏ బేబీ మాట్లాడుతూ ఏచూరితో తన 45 ఏండ్ల అనుబంధం, అనుభవాలను పంచుకున్నారు. ఏచూరి చనిపోయి ఏడాదవుతుందంటే వినడానికి కష్టంగా, బాధగా ఉందన్నారు. ఆయనతో విస్తృతంగా దేశ, విదేశాల్లో పర్యటనలు చేశామని, 2017 అక్టోబర్‌ విప్లవం శత విజయోత్సవం సందర్భంగా మాస్కో వెళ్లామని, లెనిన్‌ భౌతికకాయాన్ని సందర్శించామని గుర్తు చేసుకున్నారు. తాము పర్యటనలు చేసేటప్పుడు పలుమార్లు రైళ్లలో రిజర్వేషన్లు లేనప్పుడు పేపర్లు కిందన వేసుకుని పడుకొని వెళ్లేవారిమని చెబుతూ వేదికపై బేబీ ఉద్వేగానికి గురయ్యారు. దేశంలో సామాజిక, ఆర్థిక పోరాటాలు, పీడిత ప్రజలు, ఆదివాసీలు, వ్యవసాయ కార్మికుల విషయంలో వామపక్ష దృక్పథం గురించి మాట్లాడాల్సి వస్తే, అందులో ఏచూరి అగ్రగణ్యులని కొనియాడారు. ఎక్కడ కార్మికులు ఉంటే అక్కడ, ఎక్కడ కులవివక్షత ఉంటే అక్కడ ఎర్రజెండా ఉండాలని బేబీ అన్నారు. వర్గపోరాటాలు, కార్మిక పోరాటాలను వామపక్ష శక్తులు నిర్వహించాలని సుందరయ్య, బీటీఆర్‌, బసవ పున్నయ్య, రామ్మూర్తి, జ్యోతిబసు, సూర్జిత్‌ వంటి నేతలంతా చెప్పారని… ఈ ఆలోచనలను పుణికిపుచ్చుకున్న వారు సీతారాం ఏచూరి అని, ఆయనను గుర్తు చేసుకోవడం అంటే పోరాటాలను గుర్తు చేసుకోవడమేనని అని వివరించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాని మోడీ ఎర్రకోట నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ను గొప్పగా పొగిడారని, ఆ సంఘానికి రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదని, మత విద్వేషాలు, కల్లోలాలు రెచ్చగొట్టి ప్రజలను చంపడం ఈ గూండాల గుంపు పనని విమర్శించారు. ప్రజలు ఐక్యంగా ఉండాలని కమ్యూనిస్టు పార్టీ చెబుతోందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చూస్తున్నాయని, కేరళలో అదే ధ్యేయంగా పని చేస్తున్నాయని వివరించారు. తాను అసోం నుంచి ఇప్పుడు వచ్చానని, అక్కడ పౌరుల హక్కులను తొలగించేందుకు జిల్లా కమిషనర్‌ను నియమించారని గుర్తుచేశారు. ప్రభుత్వరంగ సంస్థలు ప్రజల ఆస్తులని బేబీ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. విశాఖలోని సీతారాం ఏచూరి భవన్‌ ప్రజలకు అన్ని విధాలా ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రంథాలయం, అభ్యుదయ సాహిత్యం ఇక్కడ ఉంటుందన్నారు.

పోరాట కేంద్రం సీతారాం ఏచూరి భవన్‌
‘సూపర్‌ 6-సూపర్‌ హిట్‌’ సభ రాష్ట్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడానికే : వి శ్రీనివాసరావు
విశాఖలోని సీతారాం ఏచూరి భవన్‌ కొత్త సమాజం కోసం నిర్మించుకున్న పోరాట కేంద్రమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఏచూరి స్ఫూర్తితో ఏర్పాటైన ఈ భవన్‌ ఉద్యమాల కేంద్రంగా విలసిల్లాలని ఆకాక్షించారు. 2024 అక్టోబర్‌ 7న ఈ భవన్‌కు శంకుస్థాపన చేసి, ఏచూరి ప్రథమ వర్థంతిలోపే పూర్తి చేయడం అభినందనీయమన్నారు. దేశం ప్రస్తుతం రెండు సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. బయట నుంచి ట్రంప్‌ సుంకాలు, లోపల నుంచి మోడీ ఆర్థిక, మతోన్మాద, విచ్ఛిన్నకర దాడులను దేశం ఎదుర్కొంటున్న విషయాన్ని వివరించారు. రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేయొద్దంటూ ట్రంప్‌ మన దేశంపై ఒత్తిడి తెస్తోన్నా, ప్రధాని మోడీ మాట్లాడడం లేదన్నారు. మనిషికి ఓటు అనేది ప్రజాస్వామిక హక్కు అని, దేశంలో బీహార్‌, అసోం రాష్ట్రాల్లో కొన్ని తరగతుల ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఓటు హక్కుపై దాడికి మోడీ ప్రభుత్వం చూస్తోందని తెలిపారు. విశాఖ ఉక్కును కాపాడతా మని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి నేడు మాట తప్పిందన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు… ట్రేడ్‌ యూనియన్‌ నాయకులపైనా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పైనా అభాండాలు మోపి ఉక్కు రక్షణకు వెన్నుపోటు పొడిచి ఉద్యమం గొంతు కొయ్యాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని ‘కూటమి’ పార్టీలు భ్రష్టుపట్టిస్తున్నాయని, అనంతపురంలో ‘సూపర్‌ 6 – సూపర్‌ హిట్‌’ పేరిట జరిపిన సభ రాష్ట్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడానికేనని విమర్శించారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి మాట్లాడుతూ సీతారాం ఏచూరి భవన్‌ ఈ ప్రాంత ప్రజల పోరాటాలకు, సాంస్కృతిక, అభ్యుదయ కార్యక్రమాలకు వేదిక కానుందన్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ బంగారు కుటుంబాల పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని వివరించారు. ప్రస్తుత ఉత్తరాంధ్ర నాయకులంతా కార్పొరేట్‌ కంపెనీల కోసం పనిచేస్తున్నారన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ సీతారాం ఏచూరి భవన్‌ అనుకున్న సమయం కంటే ముందే పూర్తయిందని, ఈ భవనానికి ప్రధాన దాతలు కార్మికులు, కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులేనని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ, అధిక సంఖ్యలో సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇతర వామపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -